Wednesday, January 22, 2025

హైదరాబాద్‌ విమోచన దినోత్సవంపై కేంద్రం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

“1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత వరకు హైదరాబాద్‌ ప్రాంతం నిజాం పాలనలో ఉంది. ఆపరేషన్‌ పోలో పేరుతో నిర్వహించిన పోలీసు చర్యతో 1948 సెప్టెంబరు 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. సెప్టెంబరు 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన వారికి గుర్తుగా, నేటి యువతలో దేశభక్తి నింపడానికి భారత ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 17ను హైదరాబాద్‌ విమోచన(లిబరేషన్‌) దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది” అని నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.

దీనిపై హోంమంత్రి అమిత్ షా ట్వీటర్ ద్వారా స్పందిస్తూ.. హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నిర్ణయించారని.. ఇది చారిత్రాత్మకమైన రోజు అని హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేసేందుకు అత్యున్నత త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి అన్నారు. యువతలో దేశభక్తి జ్వాల రగిలించి, స్వాతంత్య్ర ఉద్యమంలో మన చిహ్నాలను చిరస్థాయిగా నిలిపే మోదీ ఈ కీలక నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News