అంతరిక్షయాత్రల ఉత్పత్తులు, సేవల వాణిజ్య కేంద్రంగా తెలంగాణ
స్పేస్‌టెక్ విధానాన్ని రూపొందించాలని నిర్ణయం అంతరిక్ష రంగంలో దేశీయ ఉత్పత్తిని
పెంచడం లక్షంగా కృషి : ఆదివారం నాడు వాటాదారులతో నిర్వహించిన వర్చువల్
సదస్సు సందర్భంగా ఐటిశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: అంతరిక్ష పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పాలసీని రూపొందిస్తోందని రాష్ట్ర ఐటి శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఎండ్-టు-ఎండ్ స్పేస్‌టెక్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధానంగా ప్రయోగ వాహనాలు, ఉపగ్రహ వ్యవస్థలు, ఉప వ్యవస్థలు, భూ పరికరాల తయారీ మొదలైన వాటిలో దేశీయ ఉత్పత్తిని పెంచడం ఈ విధానం లక్ష్యమన్నారు. ఆదివారం నాడిక్కడ రాష్ట్ర స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన కోసం వాటాదారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హార్డ్‌వేర్ స్టార్టప్‌లు, అనలిటిక్స్ స్టార్టప్‌లు, అకాడమియా అంశాలపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇస్రో ప్రధాన కార్యాలయ కార్యదర్శి ఉమా మహేశ్వరన్, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ పాల్గొన్నారు. వారితో కలిసి పాల్గొన్న జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. యూనివర్సల్ కనెక్టివిటీ, వ్యవసాయం, రిమోట్ ఎడ్యుకేషన్, విపత్తు నిర్వహణ కోసం పెద్ద డేటా అనలిటిక్స్ ఆవిష్కరణ, ఇతర రంగాలపై ఈ పాలసీ ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, అంతరిక్ష శాఖ ఇటీవలే డ్రాఫ్ట్ స్పేస్ కామ్ పాలసీ…2020, డ్రాఫ్ట్ స్పేస్‌ఆర్‌ఎస్ పాలసీ.. 2020ను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జయేశ్ రంజన్ గుర్తు చేశారు. స్పేస్‌టెక్ కోసం అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా ధృడ సంకల్పంతో కృషి చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత వాటాదారులందరినీ ఆహ్వానించిందన్నారు.
Telangana to formulate Space Hub says Jayesh Ranjan