Wednesday, January 22, 2025

అప్పుల్లో అడుగున.. ఆర్థికంలో అగ్రభాగాన

- Advertisement -
- Advertisement -

Telangana top in financial management:RBI report

ఆర్థిక నిర్వహణ, క్రమశిక్షణలో తెలంగాణ టాప్

నిగ్గుతేల్చిన ఆర్‌బిఐ నివేదిక
48శాతం అప్పులతో జమ్మూకశ్మీర్ అగ్రస్థానం, 16.1%తో ఆఖరి స్థానాల్లో తెలంగాణ, ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పెరిగిన తెలంగాణ పరపతి, రుణదాతల్లో రాష్ట్రంపై భరోసా
ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడే తెలంగాణ రుణాలు సేకరించినట్టు రిజర్వు బ్యాంకు నిర్ధారణ
మూలధన వ్యయంలో నూటికి నూరుశాతం నిజాయితీగా ఖర్చు చేస్తున్నట్టు సముచితమైన గుర్తింపు

మన తెలంగాణ /హైదరాబాద్ : ఆర్ధిక నిర్వహణలో క్రమశిక్షణ, అభివృధ్ధి-సంక్షేమ పథకాలకు నిధులను ఖర్చు చేస్తున్న వైనం, ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు, అప్పులిచ్చిన ఆర్ధిక సంస్థలకు తిరిగి వడ్డీలు చెల్లించడంలోగానీ, అప్పులు తిరిగి చెల్లించడంలో గానీ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని అరుదైన గౌరవాన్ని ఆర్.బీ.ఐ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆర్.బీ.ఐ. ఇటీవల నిర్వహించిన ఎస్‌పిసిఐ (స్టేట్ ఫిస్కల్ పర్‌ఫార్మెన్స్ కాంపోజిట్ ఇండెక్స్) అధ్యయంలో విమర్శకుల నోళ్ళు మూయించే వాస్తవాలను ఆర్‌బిఐ బయటపెట్టింది. రుణాలిచ్చే ఆర్ధిక సంస్థలుగానీ, వేల కోట్ల రూపాయల నిధులను పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, పరిశ్రమలుగానీ ఆర్‌బిఐ నిర్వహించే ఎస్‌పిసిఐ అధ్యయన నివేదికలనే ప్రామాణికంగా తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి, వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని, ఆర్‌బిఐ నివేదిక (వర్కింగ్ పేపర్) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 6వ ర్యాంకు రావడం చేతనే అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని ఆర్ధికశాఖ వర్గాలు అంటున్నాయి.

అంతేగాక తెలంగాణలో పెట్టుబడులు పెట్టినా, తెలంగాణ రాష్ట్రానికి రుణాలను ఇచ్చినా తిరిగి వస్తాయనే భరోసా, నమ్మకం ఉండటంతోనే సెక్యూరిటీ బాండ్లను 30 ఏళ్ళ గడువుతో అమ్మకానికి పెట్టినా హాట్‌కేక్‌లు మాదిరిగా అమ్ముడయ్యి తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయని ఆర్ధికశాఖ వర్గాలు ధీమాగా చెబుతున్నాయంటే తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ ఎంతటి క్రమశిక్షణతో, పారదర్శకతతో ఉందో అర్ధంచేసుకోవాలని ఆ అధికారులు అంటున్నారు. 2014-15వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక నిర్వహణలో 11వ ర్యాంక్లు ఉంది. అయితే స్వయంపాలన, స్వరాష్ట్ర పాలనలో బంగారు తెలంగాణ సాధనే లక్షంగా పనిచేస్తున్న రాజకీయపార్టీ అధికారంలో ఉండటంతోనే 2018-19వ ఆర్ధిక సంవత్సరం నాటికి రికార్డుస్థాయిలో 6వ స్థానానికి తెలంగాణ ఎగబాకింది. తలకుమించిన అప్పులు చేసి ఆర్ధికంగా దివాళా తీసిన రాష్ట్రాల్లో 48 శాతం అప్పులతో జమ్ము-కాశ్మీర్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా కేవలం 16.1 శాతం స్వల్ప అప్పులతో తెలంగాణ రాష్ట్రం చివరిస్థానంలో ఉందని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టంచేసిందని ఆ అధికారులు వివరించారు.

అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే క్యాపిటల్ వ్యయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను యధావిధిగా, నిజాయితీగా ఖర్చు చేస్తుండటాన్ని ఆర్.బి.ఐ. ప్రస్ఫుటంగా గుర్తించింది. పన్నుల వసూళ్ళల్లోగానీ, రాష్ట్ర సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారాన్ని మోపకుండా ఆదాయాన్ని రాబట్టుకొంటున్న విధానం ఆర్.బి.ఐ.ని విశేషంగా ఆకట్టుకొంది. అంతేగాక ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనలకు లోబడే తెలంగాణ ప్రభుత్వం రుణాలను సేకరించుకొందని ఆర్.బి.ఐ. నిర్ధారించింది. ఈ నివేదిక తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష పార్టీలకు కనువిప్పు కలిగించేదిగా ఉందని ఆ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ రంగాల్లో నూటికి నూరు శాతం నిజాయితీగా నిధులను ఖర్చు చేస్తూ వస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణకు సముచితమైన గుర్తింపు దక్కడం గర్వించదగిన విషయమని అధికారవర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి.

దీర్ఘకాలిక రుణాలు తీసుకొన్న రాష్ట్రాల్లో తెలంగాణకు టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని, 30 ఏళ్ళ కాలపరిమితి విధిస్తే ఆర్ధిక సంస్థలుగానీ పెట్టుబడిదారులు గానీ రుణాలు ఇవ్వరని, అలా దేశంలోని చాలా రాష్ట్రాలకు రుణాలిచ్చే సంస్థలు అప్పులివ్వకుండా మొహం చాటేస్తున్నాయని, జమ్ము-కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చినప్పటికీ రుణాలిచ్చేందుకు ముందుకురానటువంటి ఆర్ధిక సంస్థలు ఉన్నాయని, కానీ తెలంగాణకు అలాంటి పరిస్థితి లేదని, ఏకంగా 30ఏళ్ళ కాలపరిమితి విధించినప్పటికీ రుణాలిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు, పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని వివరించారు. ఇలా దేశంలోని అత్యున్నతమైన ఆర్ధిక సంస్థ అయిన ఆర్.బి.ఐ. ఇచ్చిన నివేదికలే తెలంగాణను కీర్తించడంతోనే దేశంలోని అనేక రాష్ట్రాలు, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా అభివృధ్ధి, సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నాయని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు.Telangana top in financial management:RBI report

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News