ఓడిఎఫ్ ఫ్లస్‌లో తెలంగాణ అగ్రస్థానం
స్వచ్ఛభారత్ మిషన్ ఫేజ్ 2లో రాష్ట్రానికి కేంద్రం మరో ప్రశంస
మొదటి మూడు స్థానాలు దక్షిణాది రాష్ట్రాలు కైవసం
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలో ఓడిఎఫ్ ప్లస్‌లో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2లో మరోసారి తెలంగాణ సత్తా చాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్‌బిఎంజి) కింద దేశంలోని మొత్తం గ్రామాలలో 50 శాతం గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించాయి. ఈ గ్రామాల జాబితాలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానంలో తెలంగాణ (వంద శాతం) నిలిచింది. రెండో స్థానంలో కర్ణాటక (99.5 శాతం), మూడో స్థానంలో తమిళనాడు (97.8 శాతం), నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్, చివరి స్థానాల్లో గుజరాత్ రాష్ట్రం నిలిచాయి. దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్ ప్లస్ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది.
బహిరంగ మల విసర్జన రహిత స్థితిని కొనసాగించడం (ఓడిఎఫ్‌ఎస్), ఘన (బయో-డిగ్రేడబుల్) వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (పిడబ్లూ ఎం), ద్రవ వ్యర్థాల నిర్వహణ (ఎల్‌డబ్లూఎం) తో పాటు పలు ఇతర చర్యలను తెలంగాణ రాష్ట్రం సమర్థవంతంగా కొనసాగిస్తోంది. దేశంలో 2 లక్షల 96వేల గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్‌లో ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
స్వచ్ఛభారత్‌కు అత్యధిక నిధులు..
2014- నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌కు మొత్తం రూ. 83,938 కోట్లు కేటాయించింది. 2023 -24 సంవత్సరానికి రూ. 52,137 కోట్లు ( ఎస్‌బిఎం(జి) నిధులతో పాటు పారిశుధ్యం కోసం 15వ ఆర్థిక సంఘం )నిధులు కేటాయించారు. ఈ నిధులు పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడానికి వినియోగించనున్నారు. స్వచ్ఛభారత్ ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది.