Saturday, November 23, 2024

తెలంగాణ వర్శిటీ విసి లంచావతారం

- Advertisement -
- Advertisement -
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ విసి
నిత్య వివాదాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు
వరుసగా ఇసి సమావేశాలను నిర్వహించి
విసి అధికారులకు కత్తెర వేస్తూ తీర్మానాలు
చివరకు వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను
ప్రభుత్వానికి అప్పగిస్తూ పాలకమండలి తీర్మానం
వారం రోజులుగా వర్సిటీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

హైదరాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను ఎసిబి అధికారులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఎసిబి అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్‌గల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు విసి రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. తార్నాకలో ఉన్న తన నివాసంలో దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఎసిబి డిఎస్‌పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్ గుప్తా లంచం డిమాండ్ చేయగా, ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వాహకులు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
గతకొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలకమండలితో విసికి తలపడిన విషయం తెలిసిందే. అయితే వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో విసి వెనక్కి తగ్గారు. వర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా విసి రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడటం గమనార్హం. విసి రవీందర్ గుప్తా ఎసిబి పట్టుబడటంతో విద్యార్థులు వర్సిటీలో సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఒప్పంద అద్యాపకులు అందరూ టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.

వివాదాలకు కేంద్ర బిందువుగా తెలంగాణ వర్సిటీ
విశ్వవిద్యాలయం అంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలి. నిత్యం కొత్త అంశాలపై బోధన సాగాలి. కానీ తెలంగాణ వర్సిటీ నెలకో వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తోంది. ఏడాదిగా ఆందోళనలతో అట్టుడికింది. చదువులు సాగక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 22 నెలల పాటు ఇంఛార్జి వైస్ ఛాన్స్‌లర్ల పాలనలో నడిచిన వర్సిటీకి శాశ్వత విసి వస్తే పరిపాలన, అకడమిక్ వాతావరణం మెరుగు పడుతుందని అంతా ఆశించారు. ఆ దిశగా ఫలితం కనిపించకపోగా.. మరింతగా దిగజారిపోయింది. వర్సిటీ ఏ విధంగా ఉండకూడదో ఉదాహరణగా నిలిచిందంటే ఆశ్చర్యం కలగకమానదు.

ప్రతిసారి ఏదో ఒక వివాదం వర్సిటీలో రాజుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే పాలక మండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యడంతో వరుసగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఇసి) సమావేశాలను నిర్వహించారు. ఇందులో క్రమంగా విసి అధికారులకు కత్తెర వేస్తూ తీర్మానాలు చేస్తూ వచ్చారు. మొదట రిజిస్ట్రార్‌ను తొలగించి, ఆ తరువాత ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారాలకు విసిని దూరం చేశారు. కనీసం మెయింటనెన్స్‌కు సైతం డబ్బులు రాకుండా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇసి విజిలెన్స్, ఎసిబి విచారణకు లేఖ రాయాలని తీర్మానం చేసింది. చివరకు వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తూ పాలకమండని తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా విజిలెన్స్ అధికారులు సిబ్బంది యూరివర్సిటీలో తనిఖీలు చేపట్టారు. డబ్బులు ఇచ్చామంటూ వర్సిటీకి వచ్చిన అనేక మందిని విచారించారు. అలాగే వర్సిటీ ఖాతాల్లో లావాదేవీలను పరిశీలించారు. అన్నింటిపైనా పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ క్రమంలోనే శనివారం తార్నాకలోని విసి రవీందర్ గుప్త నివాసంలో ఎసిబి ట్రాప్‌లో పట్టుపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News