Thursday, January 23, 2025

జలమండలి సిబ్బందిపై దాడి చేస్తే సహించేదిలేదు

- Advertisement -
- Advertisement -

తెల్లాపూర్ మేనేజర్ పై దాడి… ఖండించిన జేఈఏ
దాడులు చేసేవారిపై కేసు నమోదు చేయాలి: జలమండలి ఎంప్లాయిస్‌యూనియన్

మన తెలంగాణ / హైదరాబాద్: నగర ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న జలమండలి సిబ్బందిపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే సహించేదిలేదని జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ మండిపడింది. శుక్రవారం జలమండలి మేనేజర్‌పై జరిగిన దాడికి నిరసనగా ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జేఈఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఈసంఘం నాయకులు మాట్లాడుతూ జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ 24 తెల్లాపూర్‌లో మురళీ కృష్ణ మేనేజర్‌గా పని విధులు నిర్వహిస్తున్నారని బుధవారం డ్యూటీలో ఉన్న ఆయనపై క్షేత్ర తెల్లాపూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ లలిత భర్త సోమి రెడ్డి మేనేజర్ మురళీ కృష్ణను కులం పేరుతో దూషిస్తూ చేయి చేసుకున్నాడని తెలిపారు. ఈ దాడిపై మేనేజర్ సదరు సోమిరెడ్డిపై జలమండలి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. ఇటీవల కాలంలో జలమండలి ఇంజినీర్లపై దాడులు పెరుగుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని అన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే శాంతియుతంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా, ఇంజినీర్ల రక్షణ కోసం బోర్డు సీనియర్ ఇంజినీర్లతో ఒక కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు ఎండీ దాన కిశోర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.

జలమండి సిబ్బందిపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్
నగర ప్రజలకు సకాలంలో నీటి సరఫరా చేస్తున్న సిబ్బందిపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఈసంఘం అధ్యక్ష, కార్యదర్శులు చవ్వా సతీష్‌కుమార్, రాఘవేందర్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే చాలా చోట్ల సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసి తన మాటా వినకుంటే దూషించి, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మేనేజర్ మురళీకృష్ణపై దాడి చేసిన సోమిరెడ్డిపై కేసు నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు చూడాలన్నారు. తమ యూనియన్ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చిన అండగా ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News