Monday, January 20, 2025

సిబిఐ కిచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న తెలంగాణ

- Advertisement -
- Advertisement -

CBI and Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర పరిశోధన సంస్థ(సిబిఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఏ కేసుకాకేసు వారీగానే, అది కూడా తెలంగాణ ప్రభుత్వ ముందస్తు సమ్మతితోనే సిబిఐ పరిశోధించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు రెండు నెలల క్రితమే జారీ అయినప్పటికీ అది శనివారం వరకు పబ్లిక్ డొమైన్‌లో బహిర్గతం కాలేదు. ముగ్గురు ఎంఎల్‌ఏలను కొనుగోలు చేయాలనుకున్న కుట్రపై సిబిఐ విచారణను కోరుతూ బిజెపి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పుడు విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజి) తెలంగాణ హైకోర్టుకు ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. సిబిఐ విచారణలకు ఇదివరలో ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని తెలిపారు. అనేక విషయాలలో బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలయ్యాక ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలోకి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కె. కవిత పేరును కూడా బిజెపి లాగే ప్రయత్నం చేసింది. అయితే తనకు ఆ కుంభకోణంతో ఎలాంటి సంబంధంలేదని కవిత ఇదివరకే తేల్చి చెప్పింది. ఢిల్లీ మద్యం కుంభకోణంను సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) విచారిస్తున్నాయి. కవితను వివాదంలోకి లాగి యాగీ చేయాలని బిజెపి నాయకులు తెగ ప్రయత్నించారు. వారికి తాబేదారులుగా ఉన్న కొన్ని టివి ఛానళ్లు, యూట్యూబర్లు కూడా… మసిపూసి మారెడు కాయచేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆగస్టు 31న బీహార్ రాజధాని పాట్నాలో అన్ని రాష్ట్రాలు సిబిఐకి ఇచ్చిన ‘జనరల్ కాన్సెంట్’(సమ్మతి)ని ఉపసంహరించుకోవాలని సూచించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిజెపి తన రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర పరిశోధన సంస్థలను దుర్వినియోగం చేస్తూ వేధించే ప్రయత్నం చేస్తోందని కూడా తెలిపారు. “పోలిసింగ్ అనేది ఆయా రాష్ట్రాల వ్యవహారం” అని తేల్చి చెప్పారు.

ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(డిఎస్‌పిఈ) చట్టం 1946లోని 6వ సెక్షన్ కింద సిబిఐ తన విచారణకు, పరిశోధనలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ సాధారణ సమ్మతి(జనరల్ కాన్సెంట్) ఉపసంహరించుకున్న పక్షంలో ఆయా రాష్ట్రాల అనుమతిని తీసుకున్నాక పరిశోధనలు, దర్యాప్తులు, విచారణలు చేపట్టాల్సి ఉంటుంది.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా ఎనిమిది రాష్ట్రాలు జనరల్ కాన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. మహారాష్ట్ర ఇదివరలో సమ్మతిని ఉపసంహరించుకున్నప్పటికీ, తర్వాత మళ్లీ పునరుద్ధరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News