మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ మహిళా ఆర్మీ ఆఫీసర్ గుజరాత్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పెద్దపెల్లి జిల్లా గోదావరి ఖని ఇండస్ట్రియల్ ఏరియాకి చెందిన బల్ల గంగా భవాని నాలుగేళ్ల క్రితం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి దేశంలో అనేక రాష్ట్రాల్లో సరిహద్దుల వద్ద ఆమె విధులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 8 నెలల క్రితం నార్త్ బెంగాల్ లో విధులు నిర్వహించిన గంగాభవాని ఆ తర్వాత గుజరాత్‌కు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి గుజరాత్ బోర్డర్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల రాఖీ పండుగ నేపథ్యంలో ఇంటికి వచ్చిన గంగా భవాని సెప్టెంబర్ 1వ తేదీన విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్ళారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీ విధులు పూర్తి చేసుకుని గాంధీనగర్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌కు తిరిగొచ్చిన గంగాభవాని అదే రోజు తన క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం తెలుసుకున్న అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆమె కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
కాగా ఇప్పటికీ మృతికి సంబంధించిన కారణాలు బయటకు రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం గంగా భవాని మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్పెషల్ ఫ్లైట్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు తీసుకొచ్చినట్లు సమాచారం. పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మృతికి గల పూర్తి కారణాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.