అద్దె ప్రాతిపదికన ఆర్‌టిసికి బస్సులు
అందించనున్న మహిళా సంఘాలు
తొలి విడతలో 150 మహిళా సంఘాలకు
150 బస్సులు మంత్రి సీతక్క వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: మహిళల అభ్యున్నతి ద్వారా నే తెలంగాణ ప్రగతి సాధ్యం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం 17 రకాల వ్యాపారాల్లో మహిళాలను ప్రో త్సహిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల ద్వారా టిజిఎస్ ఆర్టీసి అద్దె బ స్సులను నడప బోతున్నామని వివరించారు. మహిళా సం ఘాలకు ఆర్టీసి అద్దె బస్సులు నడిపేందుకు అనువుగా మంగళవారం ప్రభుత్వం జివో జారీ చేసిన సందర్భంగా మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడుతూ మొదటి విడతలో 150 ఆర్టీసి బస్సులను, దశల వారీగా మరిన్ని బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయించి ఆర్టీసికి అద్దెకు ఇచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు.
భవిష్యత్తులో అన్ని ఆర్టీసి అద్దె బస్సులు మహిళలకు కేటాయించే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో పాటు మరిన్ని వ్యాపారాల్లోకి మహిళలను ప్రొత్సహించేలా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. మార్చి 8న పరెడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి- 2025 ద్వారా తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు రూ. 77, 220 అద్దె ఆర్టీసీ చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఆర్టీసి అద్దె బస్సుల పథకం వివరాలు
మొదటి విడతలో 150 మండల మహిళా సమాఖ్యలకు మొత్తం 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయింపు జరుగుతోంది. ఒక్కో బస్సు విలువ రూ.36 లక్షలు ఉంటుంది. ఒక్కో మండల సమాఖ్య, ఒక్కొ బస్సును కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దె ఇస్తుంది. ఇందుకు గాను నెలకు అద్దె రూపంలో మండల సమాఖ్యకు ఆర్టీసి రూ.77, 220 చెల్లిస్తుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా డిపోలకు ఆయా బస్సులను వినయోగిస్తారు. మొదటి విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న 150 మండల సమాఖ్యలను ఎంపిక చేసిన ప్రభుత్వం పరెడ్ గ్రౌండ్ వేదికగా మార్చి 8న మహిళా బస్సులను ప్రారంభించనుంది. ఇందిరా మహిళా శక్తి ప్రాధాన్యతను చాటి చెప్పెలా బస్సుపై డిజైన్లు రూపొందించారు.