Monday, December 23, 2024

ఎన్నీల ముచ్చట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భాష సాహిత్య, సాంస్కృతిక చారిత్రక ఆస్తిత్వంలోంచి పురుడుపోసుకున్న ‘తెలంగాణ రచయితల వేదిక‘ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నది. తెరవే ద్వారా అనేక మంది రచయితలు తెలంగాణ గుండె చప్పుడును తమ కలాల ద్వారా వినిపించి, ప్రజల్లో చైతన్యం రగిలించారు. రచయితలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఎందరో మహా కవులకు, కళాకారులకు, రచయితలకు పుట్టినిల్లైన కరీంనగరం నిత్య చైతన్య చరణశీలత గల ప్రాంతం. ఇది అనేక పోరాటాలకు, ఉద్యమాలకు ఊపిరిపోసింది. అలాంటి ఉద్యమాల ఖిల్లా అయిన కరీంనగర్ లో ’తెరవే’ కవుల సంగమంగా ‘ఎన్నీల ముచ్చట్లు‘ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కాళోజీ ఇంట్లో పురుడుపోసుకున్న ‘మిత్ర మండలి‘ని స్ఫూర్తిగా తీసుకొని, తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ప్రతి నెల పున్నమి వేళ ‘ఎన్నీల ముచ్చట్లు‘ అనే సాహితీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రతి పున్నమి రోజు నగరంలో ఒక కవి, రచయిత లేదా సాహిత్య అభిమాని ఇంటి దాబా మీద కవులు సమావేశం అవుతారు. ఇక ఎవరి ఇంటి మీదనైతే ఎన్నీల ముచ్చట్లు ఉంటాయో ఆ కవి ఆ రోజు ఆతిథ్యం ఇస్తాడు. అక్కడ కవులు గుండ్రంగా కూర్చొని తమ కవిత్వాన్ని చదవడంతో పాటు, ఇతరులు చదివిన కవితలను విని ఆనందించి, ఆస్వాదించే కార్యక్రమం ఎన్నీల ముచ్చట్లు. ఈ ముచ్చట్లు అనేకమంది నూతన కవులకు ప్రోత్సాహాన్ని కలిగించి, ఎంతో మంది గృహిణులు, ఉద్యోగులు సాహిత్యంలోకి రావడానికి అవకాశం ఇచ్చింది.
తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ వారు గత పది ఏళ్లనుండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ సమావేశం అయిన కవులందరూ తమ నిజ జీవితంలో కలిగే అనుభవాలను, అనుభూతులను సాహితీ రూపంలో వ్యక్త పరుస్తారు.

ఇలా పండు వెన్నెలలో కూర్చోని కవిత్వాన్ని చదువుకొని, మంచి చెడులను మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ప్రతి నెల ‘ఎన్నీల ముచ్చట్ల‘లో చెప్పిన కవితలను సాహితీ సోపతి కరీంనగర్ సంకలనాలుగా తీసుకువచ్చింది. అలా వచ్చిన ఇరవై అయిదు సంకలనాలపై చేసిన సమీక్ష వ్యాస సంకలనమే ’జల్లెడ’ పుస్తకం. కవి, రచయిత, వక్త, కథకుడు, విమర్శకుడు, తెలుగు భాష ఉపాధ్యాయుడు అయిన కూకట్ల తిరుపతి రచించిన జల్లెడ తెలంగాణ సాహిత్య, సంస్కృతిని ప్రతిబింబజేస్తుంది. ఇందులో 2013 నుండి 2015 వరకు 25 నెలల పాటు వచ్చిన ఎన్నీల ముచ్చట్లు కవిత్వ పుస్తకాలపై చక్కని సమీక్ష చేశారు రచయిత కూకట్ల తిరుపతి. ఇందులోని వ్యాసాలన్ని ఇది వరకే వివిధ పత్రికల్లో రావడం జరిగింది.
బహుభాషా వేత్త డా. నలిమెల భాస్కర్, నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్, తెరవే కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య తదితరులు ఎన్నీల ముచ్చట్ల విస్తృతికి తోడ్పడి ముందుకు తీసుకెళ్తున్నారు.

లబ్ధ ప్రతిష్టులైన సాహితీవేత్తలతో పాటు ఎందరో యువ కవులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. కొత్త పాతల మేలు కలయికగా కలాల కవాతు ప్రగతి పథంలో కొనసాగుతుండడం సమాజానికి మేలు చేస్తుంది (పేజీ 129) అని ఎన్నీల ముచ్చట్ల గురించి రచయిత కూకట్ల తిరుపతి పేర్కొనడాన్ని బట్టి కొత్త కవులను ప్రోత్సహించడం, వారి కలాలకు మరింత పదును పెట్టడం ఎన్నీల ముచ్చట్ల ప్రధాన ఉద్దేశమని చెప్పవచ్చు. అంతేకాక ఎన్నీల ముచ్చట్ల కవితలన్నీ సమాజ హితాన్ని కోరుకున్నవేనని భావించవచ్చు.ఎన్నీల ముచ్చట్ల నిర్వాహకుడిగా, శ్రోతగా, రచయితగా అనుభూతి చెందిన కూకట్ల తిరుపతి ఈ పుస్తకంలో పలు అంశాలను సవివరంగా అక్షర బద్దం చేశారు. కవులు చదివిన ప్రతి కవితలోని వస్తు విశిష్టతను, అభివ్యక్తిని, శిల్ప నిర్మాణాన్ని, భాషా సౌందర్యాన్ని జల్లెడ పట్టి మనకు గ్రంథ రూపంలో అందించారు. ఇందులో తెలంగాణ పలుకుబడుల గుభాళింపు అడుగడుగునా కనిపిస్తుంది.

ఎన్నీల ముచ్చట్లలోని కవిత్వాన్ని వాఖ్యానించి, అందులోని మంచి చెడులను నిర్మొహమాటంగా చెప్పారు. కొత్త కవులు సమాజంతో పాటు సాహిత్య అధ్యయనం చేయాలని, మునుముందు ఇంకా బలమైన కవిత్వం కోసం కృషి సల్పాలని కూకట్ల కోరుకున్నారు (పే. 9). అంతేకాక కవులు లోతైన అధ్యయనంతోనే పదును దేలుతారని అంటారు (పే.14). ఎంత మంది సత్కవులుగా మారితే సమాజానికి అంత ప్రయోజనం (పే.20) జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆశించారు. ఈ గ్రంథ రచయిత స్వయంగా కవి కావడం వలన మంచి కవిత్వం రావడం కోసం తాను పడిన తాపత్రయం ఇందులో కనపడుతుంది.
అర్థం లేని చదువు వ్యర్థ మన్నట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా రాసి పడేసి ఇదే కవిత్వమంటే బుద్ధి జీవులు చీదరించుకుంటారు. పైపైరాతలు వట్టిగనే పేలిపోతాయి (పే. 41) అని సారం లేని కవితలు రాసే కవులకు చురకలు అంటించారు.

అందుకే కవి మిత్రులు, కవయిత్రులు స్ఫష్టమైన సామాజిక స్పృహను, అంతకు మించిన క్రియాశీలక చైతన్యాన్ని అలవరచుకోవలసిన అవసరం ఉంది (పే. 101) అని కూకట్ల అంటారు. అవును మరి తిరుపతి చెప్పినట్టు పేరు కోసమో, అవార్డుల కోసమో, సన్మానాల కోసమో కవిత్వం రాయకూడదు. నూతనంగా కలం చేబూనిన వారు నిబద్ధతతో కవిత్వం రాయాలి. కవులు సామాజిక స్పృహను కలిగి, సామాజిక చైతన్యంతో, సామాజిక బాధ్యతతో వ్యవహరించినప్పుడే సాహిత్యంలో రానిస్తారు.1వ ఎన్నీల ముచ్చట్ల నుండి, 25వ ఎన్నీల ముచ్చట్ల వరకు గల కవితా గాన సంకలనాల సమీక్ష వ్యాసాలు ఇవి. 189 గొంతుకుల ప్రతిబింబం ఇది. ‘జల్లెడ‘ లోని వ్యాసాలు ఎన్నీల ముచ్చట్లలో పాల్గొన్న కవుల అంతరంగాన్ని ఆవిష్కరించింది. కూకట్ల తిరుపతి ఎన్నీల ముచ్చట్లలోని సారవంతమైన కవిత్వాన్ని మనకు జల్లెడ పట్టి ఇచ్చాడు. కరీంనగర్ జిల్లా నుండి 2013 నుండి 2015 వరకు వెలువడిన కవిత్వాన్ని అంచనా వేయడానికి ఈ పుస్తకం చాలా ఉపకరిస్తుంది. పరిశోధన చేయాల్సినంత నిడివి గలిగిన సాహిత్యం ఎన్నీల ముచ్చట్లు సొంతం.

జల్లెడ సాహితీ వ్యాసాల పుస్తకమొకటి చదివితే, 25 పుస్తకాల సారం బోధపడుతుంది. తెలంగాణ ఉద్యమ సమయం మరియు తెలంగాణ ఆవిర్భావ సమయంలోని విషయాలను ఇందులో చక్కగా పొందుపరచారు రచయిత కూకట్ల. ఎన్నీల ముచ్చట్ల సాహిత్యంపై పరిశోధన చేసే వారికి జల్లెడ ఇతోధికంగా తోడ్పడుతుంది. ఈ పుస్తకానికి తొలిపలుకులుగా తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి ఆచార్య డా. జుర్రు చెన్నయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. నలిమెల భాస్కర్, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఎం. నారాయణ శర్మ గార్లు అందించిన అమూల్యమైన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవి పుస్తకానికి మరింత అదనపు ఆకర్షణగా నిలిచాయి.

ఎన్నీల ముచ్చట్ల సమీక్ష వ్యాస సంపుటి ’జల్లెడ’ ఎన్నీల ముచ్చట్లకు మరింత బలం, బలగం చేకూర్చి వన్నె తెస్తుందని ఆశిద్దాం. 25 నెల్ల సాహిత్య చరిత్రను నమోదు చేసిన పుస్తకమిది. ప్రతి సాహిత్యకారుడు చదువాల్సిన గ్రంథమిది. ఇరవైఐదు ఎన్నీల సంకలనాల ముఖ చిత్రాలను జల్లెడ పుస్తకానికి ముఖచిత్రంగా కూకట్ల సాయి భారవి కూర్చిన సమగ్ర చిత్రం బాగుంది. పుస్తకం చివరి పుటలో సాహితీ సోపతి ప్రచురణల జాబితాను అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News