Tuesday, April 8, 2025

తెలంగాణ యువతను నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దుతాం: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అన్ని రంగాల్లో అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్‌ఐసీ)లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులకు చిరునామాగా తెలంగాణను మార్చాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవ లేదని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్‌లో శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతారని అన్నారు. పరిశ్రమలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కోర్సుల రూపకల్పనలో పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులపై ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. కోర్సు పూర్తయ్యే నాటికి అభ్యర్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యా, పరిశోధన, టాస్క్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఓఎస్డీ చమాన్ మెహతా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News