Monday, December 23, 2024

ఖమ్మం నడిబొడ్డున జూలై 2వ తేదీన తెలంగాణ జనగర్జన

- Advertisement -
- Advertisement -
అదే రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం
సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జూలై 2వ తేదీన తెలంగాణ జనగర్జన ఖమ్మం నడిబొడ్డున నిర్వహిస్తున్నామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగే జనగర్జన సభా ప్రాంగాణాన్ని రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని పొంగులేటిని పలు దఫాలు ఆహ్వానించామని, కానీ, ఆయన అభిమానుల సూచనల మేరకే ఆయన ఎటు వెళ్లాలో నిర్ణయించుకుంటారన్నారు. కేంద్రంలోని పార్టీ ఆయన్ను పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిందని, పొంగులేటి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని 85 శాతం మంది నిర్ణయించారని రేవంత్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ఆయన ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, కాంగ్రెస్ జాతీయ నాయకులు ఖమ్మం నగరానికి వస్తున్నామని, అక్కడ ఒక సభ ఏర్పాటు చేయాలని ఆదేశించారని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి రెండు కళ్లు…
అందుకే నేడు తాము ఇక్కడకు వచ్చి సభా ప్రాంగణాన్ని పరిశీలించామని, ఇక్కడకు వచ్చేముందు తాను ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వాలని అనుకున్నానని రేవంత్ అన్నారు. కానీ ఇక్కడ పకడ్బందీగా సూచనా ప్రాయంగా పనులు చేస్తున్నారన్నారు. తమ కార్యకర్తలు అభిమానులకు బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా నడుచుకుంటూ వచ్చయినా సభను విజయవంతం చేస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో సభ ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన ప్రజల కంటే ఎక్కువమందినే తీసుకుని వస్తారని, తమ సభ కంటే ఎక్కువ మంది కదం తొక్కుతారని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి రెండు కళ్లు అని, తమ మూడో కన్ను శ్రీనివాస రెడ్డి అని రేవంత్ చెప్పారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. సభ ఏర్పాటు కోసం అవసరం అయితే వి.హనుమంత్ ఖమ్మంలోనే ఉంటారని, ఢిల్లీలోని జాతీయ మీడియా మొత్తం ఖమ్మంకు వస్తుందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పుకుంటే ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటానని చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ బిజెపి చీఫ్ ఓ బిత్తిరి సత్తి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరుగుతోన్న భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు. భట్టి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ నెల 2వ తేదీన జరగనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భట్టి పాదయాత్ర కాంగ్రెస్ కాదనీ, యావత్ తెలంగాణకు మేలు చేస్తుందన్నారు. భట్టి పాదయాత్ర నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మేల్కొలిపిందన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఖమ్మం సభ నుంచే రాహుల్ సందేశం ఇవ్వబోతున్నారని, ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ ముఖ చిత్రం మార్చబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిజెపి చీఫ్ ఓ బిత్తిరి సత్తి అని, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News