Tuesday, January 7, 2025

త్వరలో టెలికామ్ చార్జీల మోత!

- Advertisement -
- Advertisement -

టారిఫ్‌లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్‌టెల్‌ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక

న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచనున్నట్టు యాంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం మొబైల్ సర్వీస్ టారిఫ్‌లను 15- నుంచి 17 శాతం పెంచే అవకాశముంది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్ తమ ప్రీమియం వినియోగదారులకు అపరిమిత డేటాను అందించడాన్ని నిలిపివేయవచ్చు. జూన్-, జూలై నెల నాటికి కంపెనీలు టారిఫ్‌ల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని నివేదిక వివరించింది. మరికొందరు నిపుణులు మొబైల్ ఫోన్ సేవలు 20 శాతం ఖరీదైనవిగా మారుతాయని భావిస్తున్నారు.

అదే సమయంలో 4జితో పోలిస్తే 5జి సేవ కోసం 5- నుంచి 10 శాతం ఎక్కువ చార్జీలు వసూలు చేయవచ్చు. మార్కెట్ వాటా పరంగా దేశంలోని రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతి ఎయిర్‌టెల్ మూడేళ్లలో ‘రివెన్యూ పర్ యూజర్’ (ఆర్‌పియు) అంటే ఒక్కో వినియోగదారుడి సగటు సంపాదనను రూ.208 నుండి రూ.286కి పెంచాలనుకుంటోంది. దీనికోసం కంపెనీ టారిఫ్‌ను రూ.55 వరకు పెంచవచ్చు. ఈ ఏడాది జియో తన టారిఫ్‌లను సగటున 15 శాతం పెంచవచ్చు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 5జి స్పెక్ట్రమ్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశాయి. పోల్చి చూస్తే, ఆర్‌ఒసిఇ (రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్), అంటే ఖర్చులకు ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అపరిమిత ప్లాన్‌ల కారణంగా కంపెనీల ఆదాయం ఇప్పటి వరకు తక్కువగానే ఉంది.

మొబైల్ టారిఫ్‌లలో చివరి పెరుగుదల 2021 నవంబర్‌లో జరిగింది. ఆ సమయంలో వోడాఫోన్ ఐడియా సుమారు 20 శాతం, భారతీ ఎయిర్‌టెల్, జియో 25 శాతం టారిఫ్‌లను పెంచాయి. నివేదిక ప్రకారం, భారతీయులు 1జిబి డేటా కోసం సగటున 13.34 రూపాయలు చెల్లించాలి. భారతదేశంలో టెలికాం కంపెనీల ఖాతాల సంస్థ అయిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఫిబ్రవరి 2024 డేటా ప్రకారం, 2024 జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 39,30,625 మంది మొబైల్ వినియోగదారులు పెరిగారు. జనవరిలో దేశవ్యాప్తంగా 116.07 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా, ఫిబ్రవరిలో వారి సంఖ్య 116.46 కోట్లకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News