Friday, November 15, 2024

మత్స్యరంగం అభివృద్ధి మార్గాలు

- Advertisement -
- Advertisement -

Telengana State Fisheries Department

భారతదేశంలో మత్స్యరంగానికి సంబంధించి అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ట్రాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుని అమలు పరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి మత్స్యరంగాన్ని సర్వోతోముఖాభివృద్ధి దిశలో తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలుపరిచేందుకు సర్వసన్నద్ధమవుతున్నది. ఉమ్మడి రాష్ట్ర ఉనికి కాలంలో పూర్తి నిర్లక్ష్యానికి, బుద్ధిపూర్వక విస్మరణకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యపారిశ్రామిక రంగం గడచిన ఆరున్నరేళ్ల ప్రత్యేక రాష్ట్రపాలనా కాలంలో వేగపంతమైన పురోభివృద్ధిలో పరుగులుతీస్తున్నది. ఇప్పటి వరకూ తెలంగాణ మత్స్యరంగ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మౌలికవసతుల కల్పనపైననే ఎక్కువగా దృష్టిని సారించి, చేపల పెంపకానికి అనువైన నీటి వనరులను సమకూర్చేందుకు సంబంధించిన కార్యాచరణను అమలుపరిచింది.

ఈ వనరుల సౌలభ్యంతో చేపల పెంపకంలో గణనీయమైన అభివృద్ధికి తెలంగాణలో ఆస్కారం ఏర్పడిరది. కాళేశ్వరంతో పాటుగా దానికి అనుబంధం అందుబాటులోకి వచ్చిన జలాశయాలు, నిరంతర నీటి లభ్యత తదితర పరిణామాల ఫలితంగా రాష్ట్రంలో మత్స్యరంగాన్ని ఉరకలెత్తించడానికి అనువైన వాతావరణంనిర్మితమయ్యింది. అయితే ఇందుకు తోడుగా తెలంగాణ మత్స్యరంగాన్ని జాతీయ స్థాయి లో ఉన్నతంగా నిలబెట్టడానికి అవసరమైన సంస్థాగత నిర్మాణాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని సారించవలసి ఉన్నది.

తెలంగాణ రాష్ట్ర మత్క్యరంగం అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు, సంస్థాగత నిర్మాణం, అవసరమైన కార్యాచరణలకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించడంలో ‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ గడచిన మూడు సంవత్సరాలుగా దేశంలోని పదమూడు రాష్ట్రాలు, ఇతర దేశాలలో స్వచ్ఛందంగా పలు అధ్యయనాలను నిర్వహించింది. ఈ అధ్యయనాలు, పరిశీలనల ఆధారంగా తెలంగాణ మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశలో పురోగమింపజేసేందుకు సంస్థాగత నిర్మాణపరంగా మూడు ప్రధానమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతిపాదిస్తున్నది. మత్స్యశాఖ, మత్స్యసహకార సొసైటీల సమాఖ్య, మత్స్య అభివృద్ధి కార్పోరేషన్ అనే మూడు ప్రధాన విభాగాలను నిర్మాణపరంగా బలోపేతం చేసి, మూడంచెల విధానంతో విధివిధానాలను రూపొందించి ఆచరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను అమలుపరచడం ద్వారా తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశాలున్నాయి. ముఖ్యం గా దేశ వ్యాపితంగా సముద్ర జలవనరుల నుండి చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటుగా సమాంతరంగా ఉపరితల జలవనరుల చేపల పెంపకంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో… సముద్రతీరం లేని తెలంగాణ రాష్ట్రం ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలోనే మూడవ స్థానంలో నిలిచి ఉండటం మన రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి మరో సానుకూల అంశంగా కనిపిస్తున్నది.

అయితే రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధి పరచడానికి అనుగుణంగా ఆ రంగానికి ఆయువుపట్టుగా ఉపకరించే పాలనా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన మత్స్యశాఖను బలోపేతం చేయడానికి అన్నిరకాల చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి పలుమార్లు ప్రకటించారు. ఈ దిశలో కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టారు. అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశాలను కల్పించారు. ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయల భారీ నిధులతో అమలులోకి తీసుకువచ్చిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ మత్స్యరంగానికి మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఉపకరించడంతో పాటుగా సుమారు 65 వేల మంది మత్స్యకారులకు మోపెడ్ వాహనాలను సమకూర్చిగలిగారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వినూత్నమైన రీతిలో 2016 నుండి అమలుపరుస్తున్న ‘ఉచిత చేప పిల్లల సరఫరా’ పథకాన్ని విజయవంతంగా అమలు పరచగలుగుతున్నారు. ఫలితంగా గతంలో ఎవ్వరూ కనీసం పట్టించుకోని మత్స్యశాఖకు ఒక గౌరవప్రదమైన హోదా దక్కడంతో పాటుగా, ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగ, అధికార వర్గాలలో నూతనోత్సాహం కనిపిస్తున్నది. అయితే మత్స్యరంగంలో అభివృద్ధిని సాధిస్తున్న ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ మత్స్యశాఖలో పాలనాపరంగా ఇంకా అనేకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తున్నది.

ముఖ్యంగా ఇప్పుడున్న ఉద్యోగుల సంఖ్యను కనీసం రెట్టింపు చేయడం ద్వారా ఈ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను పర్యవేక్షించడం, చేపల ఉత్పత్తిలో ఉత్పాదకతను పెంచుకోవడం, ఉపయోగంలోలేని నీటి వనరులతో పాటుగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన జలాశయాలలో చేపల పెంపకాన్ని నిర్వహించడం, చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం, చేపల ఆహార వినియోగాన్ని పెంచడం లాంటి తప్పనిసరి పనులను సులభంగా నిర్వహించేందుకు వీలుకలుగుతుంది. అందువల్ల తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖను పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా ఆధునీకరించుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది.

రాష్ట్రంలో మత్స్యసహకార సంఘాల వ్యవస్థ ఇప్పటికే చాలా బలంగా వేళ్లూనుకుని ఉన్నది. సాంప్రదాయ మత్స్యకారులందరూ ఈ సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4639 మత్స్యసహకార సొసైటీలలో 3,39,465 మంది గుర్తింపు పొందిన మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3949 మత్స్యసహకార సంఘాలు కాగా, 598 మహిళా మత్స్యసహకార సొసైటీలు, 11 మత్స్య మార్కెటింగ్ సహకార సంఘాలు, 81 సొసైటీలు రిజర్వాయర్లకు సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్న మత్స్యకారుల సొసైటీలు ప్రత్యేకించి ఉన్నాయి. ఈ సహకార సంఘాలన్నీ సహకార చట్టం పరిధిలో పని చేస్తున్నాయి. గ్రామస్థాయి సొసైటీతో పాటుగా జిల్లా స్థాయిలో మత్స్యసహకార సంఘం, వీటన్నింటినీ సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో మత్స్యసహకార సంఘాల సమాఖ్య పని చేస్తున్నాయి. రాష్ట్రంలోని మత్స్యసహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న సుమారు నాలుగు లక్షల మత్స్యకారుల సంక్షేమం, ఉపాధిలతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యరంగ అభివృద్ధిలో భాగంగా అమలుజరిపే వివిథ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు జరిపే బాధ్యతలను ఈ సొసైటీలు నిర్వహిస్తాయి. రాష్ట్రంలోని సాంప్రదాయ నీటివనరుల్లో చేపల పెంపకం ద్వారా మత్స్యసహకార సొసైటీల సభ్యులందరూ జీవనోపాధిని పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నీటి వనరులను ‘మిషన్ కాకతీయ’ ద్వారా పునరుద్ధరించడం, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఎల్లకాలం నీటిని నిలువచేయడం లాంటి పరిణామాల వల్ల సాంప్రదాయ మత్స్యకారుల ఆదాయాలు పెరగడంతో మత్స్యసహకార సొసైటీలలో సభ్యత్వానికి డిమాండు చాలా పెరిగింది. అయితే రాష్ట్రస్థాయిలో మత్స్యసహకార సంఘాల సమాఖ్యను నిర్మాణపరంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో గతంలో ఉనికిలో ఉన్న పది జిల్లాలను 33 జిల్లాలుగా విస్తరించిన నేపథ్యంలో మొత్తం జిల్లాలలో జిల్లాస్థాయి సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. తదనుగుణంగా ‘మత్స్యసహకార సంఘాల సమాఖ్య’ కు కూడా పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంవల్ల క్షేత్రస్థాయిలో మత్స్యసహకార సంఘాలతో మరింత మెరుగైన పద్ధతిలో సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుంది. కేవలం చేపల పెంపకం, అమ్మకం లాంటి కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన మత్స్యసహకార సంఘాల పాత్రను ఇతర కార్యక్రమాలకు సైతం విస్తరించుకోగలిగితే మత్స్యరంగం అభివృద్ధిలోనూ, భవిష్యత్తులోనూ, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలోనూ ఈ సహకార సంఘాల వ్యవస్థ మరింతగా బలోపేతం కావడానికి అవకాశాలు మెరుగుపడతాయి.

ప్రపంచ వ్యాపితంగా అన్ని రంగాలలో మాదిరిగానే మత్స్యపారిశ్రామిక రంగంలోనూ అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మత్స్యరంగానికి సమాంతరంగా ‘ఆక్వా కల్చర్’ రంగం వేగపంతంగా అభివృద్ధి చెందుతున్నది. అయితే కేవలం చెరువుల్లోనూ, సాంప్రదాయ నీటి వనరుల్లోనూ చేపల పెంపకానికి మాత్రమే పరిమితమైన మత్స్యసహకార సంఘాల పని తీరుకు భిన్నమైన పద్ధతుల్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, ఉపరితలంలోనూ ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకంతోపాటుగా, దీనికి ఫిష్ ప్రాసెసింగ్, వాల్యూ ఆడిషన్, ఇతర దేశాలకు ఎగుమతులు, చేపల పెంపకానికి అనుబంధంగా చేప విత్తనాల ఉత్పత్తి, చేపల దాణా ఉత్పత్తిలాంటి విస్తృతమైన కార్యకలాపాలను ప్రైవేటు భాగస్వామ్యం తో వ్యాపార రీత్యా నిర్వహించేందుకు ‘ఫిషరీస్ డెవెలప్మెంట్ కార్పోరేషన్’ ఎంతగానో దోహదం చేస్తుంది. దేశంలో మత్స్యరంగం పురోగమిస్తున్న అన్ని రాష్ట్రాలలోనూ ‘ఫిషరీస్ డెవెలప్మెంట్ కార్పోరేషన్’ లు ప్రధాన పాత్రను నిర్వహిస్తున్నాయి. చేపల ఆహార వినియోగాన్ని గణనీయంగా పెంచడంలోనూ, చేపల ఆహారాన్ని ఆధునిక పద్ధతుల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలోనూ ఈ కార్పోరేషన్ ముఖ్యభూమికను నిర్వహిస్తుంది. ముఖ్యంగా చేపల ఉత్పత్తిలో ఆధునిక విధానాలను అమలు పరచడం ద్వారా ఉత్పాదకతను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలోనూ కార్పోరేషన్ ఉపకరించగలుగుతుంది. అంతర్జాతీయంగా ప్రతి హెక్టారు నీటి విస్తీర్ణంలో గరిష్ఠంగా ఐదు మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి చేస్తుం టే, మన రాష్ట్రంలో కనీసం ఒక మెట్రిక్ టన్నును కూడా సాధించలేకపోవడానికి ఇంకా సాంప్రదాయ చేపల పెంపకం పద్ధతులను మాత్రమే పాటించడం ప్రధాన కారణమవుతున్నది. అందువల్ల మత్స్యరంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడంలోనూ, ఈ రంగానికి సంబంధించిన అన్ని అంశాలను ఆచరణలోకి తీసుకురావడంలోనూ, ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను ఆచరించడంలోనూ మన రాష్ట్రం లో ‘ఫిషరీస్ డెవెలప్మెంట్ కార్పోరేషన్’ సంస్థనూ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్నది.

పిట్టల రవీందర్
99630 62266

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News