Monday, December 23, 2024

కొవిడ్ మూలాల గురించి మీకు తెలిసింది చెప్పండి

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాలను కోరిన డబ్లుహెచ్‌ఒ

జెనీవా : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అడపాదడపా కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి అదుపు లోనే ఉంది. అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి ఇన్ని దేశాలకు పాకిందనే దానిపై కచ్చితమైన సమాచారం మాత్రం ఇంతవరకు లభించలేదు. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందని తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమవ్వగా, దానిపై అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది.

కొవిడ్ 19 మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని డబ్లుహెచ్‌వొ అన్ని దేశాలను కోరింది. ‘ కరోనా మూలాల గురించి ఏ దేశం వద్ద అయినా సమాచారం ఉంటే , దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ , అంతర్జాతీయ సైన్స్ సంస్థలకు వెల్లడించాలి. ఇది అత్యావశ్యకం. దీనిని సేకరించేది ఏ ఒక్కరినో నిందించడానికి కాదు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా, ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారాన్ని కోరుతున్నాం. కరోనా మూలాన్ని గుర్తించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ డబ్లుహెచ్‌ఒ వదిలేయదు’ అని ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ జన్మస్థానం చైనాలో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్టుమెంట్ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ల్యాబ్ లీక్‌పై ఓ నిర్ణయానికి వచ్చింది. ది ఎనర్జీ డిపార్టుమెంట్‌లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటంతో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకొంది. అమెరికాలో జాతీయ పరిశోధన శాలలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. వీటిల్లో కొన్ని అత్యున్నత స్థాయి జీవ పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. ఇదొక దుష్ఫ్రచారం అని కొట్టి పారేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News