Monday, December 23, 2024

కుశల ప్రశ్నలుగా మోడీ ఇంటర్వ్యూలు

- Advertisement -
- Advertisement -

ప్రధాని పీఠంపై ఉన్న వ్యక్తిని కారణం లేకుండా ఎవరూ నిందించరు. ఆ నిందను నివృత్తి చేయవలసిన బాధ్యత ఆయనపై ఉంటుంది. తాను తప్పే చేయను అన్న అహంభావం ఆయన మాటల్లో ఉంది. రాముణ్ణి, కృషుణ్ణి వదలని వారు మోడీని వదులుతారా అని దానికి హిందూ మనోభావాన్ని జోడించారు. ఒక వైపు మోడీకి కీర్తించడం, మరో వైపు కాంగ్రెస్ పార్టీని, నేత లను విమర్శించే కోణంలోనే ఈ ఇంటర్వ్యూలు సాగాయి. విలేకరులు అడిగే ప్రశ్నల్లోనే కాంగ్రెస్‌పై వ్యంగ్యముంది. ఒకే దెబ్బతో రాహుల్ గాంధీ దేశంలోని పేదరికాన్ని పారద్రోలుతానంటున్నారు. అదెలా సాధ్య మని ఒక ప్రశ్న. అరవై ఏళ్లలో సాధించనిది చిటికెలో చేస్తారా అని ప్రధాని నవ్వు. ముఖ్యమంత్రిగా తన గుజరాత్ పాలనను పిట్ట కథలు చెబుతుంటే ఒక్కరూ ఆయన్ని వర్తమానానికి తెచ్చే ప్రయత్నం చేయలేదు.

హిందూ దినపత్రికలో 5వ తేదీ నాడు సౌమ్యదీప్ సిన్హా ఒక కార్టూన్ వేశారు. ‘ఇప్పుడు నేను మీ పనిని సులభం చేశాను. ప్రశ్నలు వేసే అవసరం లేకుండా నేను చెప్పింది వింటే చాలు’ అని ప్రధాని మోడీ విలేకరులతో అంటున్న ట్లు అందులో ఉంది. ఈ మధ్య ఒక తెలుగు టివి ఛానల్, ఒక తెలుగు దినపత్రిక మోడీని విడివిడిగా ఇంటర్వ్యూ చేశాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ కార్టూన్ వేశారో లేదో కానీ ఈ రెండు ఇంటర్వ్యూలకు ఆ కార్టూన్ వ్యాఖ్య సరిగ్గా సరిపోతుంది.

ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసానికి తొలుత టివి ఛానల్‌కు చెందిన అయిదుగురు వెళ్లి సుమారు గంటన్నర సేపు ఆయనతో రౌండ్ టేబుల్ చర్చను సాగించారు. ఆ తర్వాత మోడీ ఇంటికి తెలుగు దినపత్రికకు చెందిన ఇద్దరు వెళ్లి కొన్ని ప్రశ్నలు వేసి ఆయన జవాబులు రాసుకొచ్చారు. టివి ఛానల్ మాత్రం ఇది ఎవరూ సాధించని ఘనకార్యమని జబ్బలు చరుచుకుంది. ఈ టివి ఛానల్ బిజెపికి సమీప వ్యక్తికి చెందినది. ఆయనకు బిజెపి రాజ్యసభలో స్థానం కల్పిస్తామన్నా తెలంగాణ ప్రభుత్వంతో తమ వ్యాపారాలకు ఇబ్బంది రావద్దని తలచి ఆ ఆఫర్‌ను అందుకోలేదు.

ఇక దినపత్రిక విషయానికొస్తే దాని యజమాని ప్రధాని మోడీని ఢిల్లీలో కలిశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు హైదరాబాదు వచ్చినపుడు ఆ పత్రికాధిపతి ఇంటికెళ్లారు. ఇలా ఆ రెండు ప్రసార మాధ్యమాలకు మోడీతో, బిజెపితో సత్సంబంధాలున్నాయి. ఎప్పుడూ పాత్రికేయులను దూరంగా ఉంచే మోడీకి ఇప్పుడు తన రిమోట్ సంస్థల కోసం ఈ ఇంటర్వ్యూలకు సిద్ధపడ్డారు. ప్రశ్నలన్నీ మోడీ గొప్పను, విపక్షాల ఎద్దేవాను లక్ష్యం చేసుకున్నాయి. వాటికీ మోడీ మరింత మసాలా అద్ది తన పదేళ్ల పాలన కన్నా ముందు అంతా శూన్యమే అన్నట్లు సుదీర్ఘ వివరణలిచ్చారు. ప్రతి జవాబులోను మోడీ తనకు తాను ఈ దేశానికి, ప్రజలకు లభించిన గొప్ప తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా అభివర్ణించుకున్నారు. దానిని అంగీకరిస్తున్నట్లు చిరునవ్వులతో తలలు అందించడమే పాత్రికేయుల పనిగా సాగింది.

టివి ఛానల్ వారి తొలి ప్రశ్న పూర్తి కాకుండానే తన దిన చర్య ఇలా మొదలవుతుందో చెబుతూ మోడీ తన భాషణ చాతుర్యంతో అందరినీ తన్మయత్వంలోకి తీసికెళ్లారు. తాము ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చామన్న విషయం మరిచిపోయి వాళ్లు మోడీకి జై కొట్టారు. అంతా ప్రీ ప్లాన్డ్ డ్రామాలా అనిపిస్తుంది. మీరు అభివృద్ధి చేసినా విపక్షాలు మిమ్మల్ని నిందిస్తుంటాయి అని ప్రశ్నిస్తే జవాబుగా మోడీ నవ్వుతూ డిక్షనరీలో ఉన్న తిట్లన్నీ అయిపోయి వారు కొత్త తిట్లు సృష్టించే అవసరం వచ్చింది అన్నారు. ఇన్ని తిట్లు పడిన నేతల్లో వరల్డ్ రికార్డ్ తనదే అన్నారు. శివుడు గళంలో గరళం దాచుకున్నట్లు తాను వాటిని మింగకుండా గొంతులో ఉంచానన్నారు.

మోడీని తప్పుపట్టడమే తప్పు అన్నట్లుగా ఉంది ఆ సమర్థన. ప్రధాని పీఠంపై ఉన్న వ్యక్తిని కారణం లేకుండా ఎవరూ నిందించరు. ఆ నిందను నివృత్తి చేయవలసిన బాధ్యత ఆయనపై ఉంటుంది. తాను తప్పే చేయను అన్న అహంభావం ఆయన మాటల్లో ఉంది. రాముణ్ణి, కృషుణ్ణి వదలని వారు మోడీని వదులుతారా అని దానికి హిందూ మనోభావాన్ని జోడించారు. ఒక వైపు మోడీకి కీర్తించడం, మరో వైపు కాంగ్రెస్ పార్టీని, నేతలను విమర్శించే కోణంలోనే ఈ ఇంటర్వ్యూలు సాగాయి. విలేకరులు అడిగే ప్రశ్నల్లోనే కాంగ్రెస్‌పై వ్యంగ్యముంది. ఒకే దెబ్బతో రాహుల్ గాంధీ దేశంలోని పేదరికాన్ని పారద్రోలుతానంటున్నారు. అదెలా సాధ్యమని ఒక ప్రశ్న. అరవై ఏళ్లలో సాధించనిది చిటికెలో చేస్తారా అని ప్రధాని నవ్వు. ముఖ్యమంత్రిగా తన గుజరాత్ పాలనను పిట్ట కథలు చెబుతుంటే ఒక్కరూ ఆయన్ని వర్తమానానికి తెచ్చే ప్రయత్నం చేయలేదు. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్ష సాక్షి అయిన ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ జైల్లో ఎందుకున్నారు అని ఎవరూ ప్రశ్నించలేదు.

పదేళ్ల పాలన ట్రైలరే. అసలు సినిమా ముందుంది అని కాంగ్రెస్ వాళ్ళను నిద్రకు దూరం చేశారు అని ఒకరి ప్రశ్న. ట్రైలర్ కాలంలో అక్టోబర్ 2020లో హత్రాస్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ కవరేజికి వెళ్లిన రిపోర్టర్ సిద్దిఖీ కప్పన్‌ను ఉపా కేసు పెట్టి రెండేళ్లు జైల్లో ఎందుకు ఉంచారు అని సాటి విలేకరిగా ఒక్కరూ ప్రశ్నించలేదు. మణిపూర్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేదు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ‘భ్రమ’ ప్రజల్లో ఉంది అని ఓ ప్రశ్న. దాన్ని భ్రమగా విలేకరి ముద్ర వేయడం వింతగా ఉంది. గుజరాత్‌లో సిఎంగా ఉన్నపుడు రాజ్యాంగం 60 ఏళ్ల సమారోహంగా రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఉరేగించానని, అదీ తనకు రాజ్యాంగంపైనున్న గౌరవమని మోడీ అన్నారు. 1976లో 42వ సవరణగా రాజ్యాంగ పీఠికలో చేర్చిన ‘సెక్యులర్’ అన్న పదాన్ని తీసేస్తామని రాజ్‌నాథ్ సింగ్ అంటున్న విషయం ప్రస్తావనకు రాలేదు.

సెక్యులర్ అన్నపదం బిజెపికి ఎందుకు ఇష్టం లేదో అడిగేదెవరు? కాంగ్రెస్‌లో యువ నేతలంతా వెళ్ళిపోయి మావోవాదులు అందులో చేరారని అందుకే ఉన్నవారి ఆస్తులు లాక్కొని పంచుతామని అంటున్నారని మోడీ అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న మావోవాదుల పేర్లు చెబితే బాగుండేది. వెస్ట్ బెంగాల్ గొప్పతనాన్ని ఎర్ర పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ చెడగొట్టాయి. దాని పూర్వవైభవాన్ని తిరిగి తెస్తామన్నారు మోడీ. ప్రజలు ఇష్టపడి ఎన్నుకుంటేనే ఎవరైనా పాలించేది. విపక్షాలకు ఓటేయడమే తప్పు అన్నభావన ఆయన మాటల్లో ఉంది. తమకు ఇంతకాలం ఓటు వేయనందుకు బెంగాలీయులను తప్పు పట్టారాయన. మాటల సందర్భంగా దేశంలోని మహిళలను ఆకాశానికి ఎత్తిన ఆయన మహిళా బిల్లును నామ్ కే వస్తేగా చివరి పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకు తెచ్చారని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. కర్ణాటక అసెంబ్లీ ఓటమిని ప్రస్తావిస్తే ఒక్కోసారి ఓటరు కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు అవినీతి పార్టీలే అన్నారు. ఆ పార్టీల్లోంచి వచ్చినవారికి ఎంపి సీటు ఎందుకిచ్చారు అనే ప్రశ్నే రాలేదు. చివరగా ఆ టివి ఛానల్‌ను మెచ్చుకుంటూ ‘దేశానికి నష్టం జరిగే వార్తలు ఎందుకు వేస్తున్నారు అని మీ ఛానల్‌ను అడిగే అవసరం తనకు ఒక్కసారి కూడా రాలేదు’ అని ప్రధాని అన్నారు. అలాంటప్పుడు బోల్తా హిందూస్తాన్ లాంటి యూ ట్యూబ్ ఛానళ్ళను ఎందుకు మూసివేస్తున్నారని ప్రశ్న అడిగేందుకు నోరెలా వస్తుంది. దిన పత్రికకు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో రామప్పకు వచ్చిన వారసత్వ హోదాను మోడీ తన ఖాతాలో వేసుకున్నారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు మంజూరు చేశామన్నారు. ఇంతకాలం తొక్కిపెట్టి ఎలక్షన్ల ముందే బోర్డును ఎందుకు ప్రకటించారు అనేది అడగాల్సిన ప్రశ్న.

మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ 2014 వరకే ఉంది. దాని గురించి ఇప్పుడే విన్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమిటీ హామీ ఈయడం ఎన్నికల స్టంట్ కాదా! ప్రధాని పేషీలో ఎస్‌సి అధికారులెందరున్నారు అని అడగరెందుకు? ఎపి ప్రత్యేక హోదాపై దాటవేసే ధోరణి కనబడింది. విభజన హామీలు రెండు రాష్ట్రాల మొండి వైఖరి వల్లే ముందుకు సాగడం లేదన్నారు. ప్రపంచాన్ని శాసించే అవకాశం భారత్‌కు రాబోతోందని గొప్పగా అన్నా రు. ఇతర దేశాలను శాసించే అవసరం మనకెందుకు? మన దేశంలో మత సహనాన్ని పాదుకొలిపి, అందరికీ ఉపాధి కల్పించి పేదరికాన్ని సమూలంగా రూపుమాపితే చాలు. ఓటు ద్వారా దేశస్థులు కోరుకునేది అదే. మోడీపై పూల బాణాలు వేసి వచ్చిన జర్నలిస్టులు వారి వృత్తికి న్యాయం చేసినట్లుగా లేదు.

బి.నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News