హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని వివరించింది. తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని తెలిపింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు ఫిల్మ్ ఛాంబర్ అప్పగించింది.
రాజకీయాల కంటే సినిమా వాళ్లకే ఆదరణ ఎక్కువ నటుడు మాజీ ఎంపి మురళీ మోహన్ తెలిపారు. రాజకీయ నేతలకు పదవీకాలం పూర్తయితే ప్రజల్లో ఆదరణ ఉండదన్నారు. మద్రాసులో ఉన్నప్పుడు తాము సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్లమన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు మురళీమోహన్, రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకులు సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరలు హాజరయ్యారు.