Thursday, January 16, 2025

నేటి నుంచి సినిమా షూటింగ్‌లు షురూ..

- Advertisement -
- Advertisement -

వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న సినీ కార్మికులు గురువారం ఆందోళన విరమించారు. వేతనాలను పెంచుతామని నిర్మాతల మండలి హామీ ఇవ్వడంతో శుక్రవారం నుంచి సినిమా షూటింగ్‌లకు సినీ కార్మికులు హాజరవుతామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఇక వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కి వస్తామని రెండు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండగా… మరోవైపు సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపు విషయాన్ని చర్చిస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలితో విడివిడిగా చర్చలు జరిపారు.

అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో కలిసి ఆయన జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ సమస్య పరిష్కారమైంది. 2 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవడంతో శుక్రవారం నుంచి షూటింగ్‌లలో పాల్గొంటామని సినీ కార్మికులు చెప్పారు. ఈ సందర్భంగా కార్మికుల వేతనాల పెంపు కోసం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై నిర్మాతలందరితో చర్చలు జరిపి విధివిధానాలను ప్రకటిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చెప్పారు. ఇక శుక్రవారం నుంచి యథావిధిగా సినిమా షూటింగ్‌లు జరుగుతాయని, షూటింగ్‌లకు సినీ కార్మికులు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు. అన్ని సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుంటామని ఆయన అన్నారు.

Telugu Film workers call off Strike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News