ప్రపంచంలోనే తొలి లిఖిత సాహిత్యం సంస్కృత భాషలో ఉంది. సంస్కృత భాషను అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి అని వివిధ పేర్లతో పిలుస్తారు.భారతదేశంలో 2001 లెక్కల ప్రకారం పద్నాలుగు వేల నూటముప్పై మంది సంస్కృతాన్ని మాట్లాడుతున్నారు. ప్రజల వాడుకలోలేని భాషను మృతభాష అంటారు. భారతదేశంలో సంస్కృత భాష సాహిత్యపరంగా నిద్రాణమై ఉంది. ప్రజల వాడుకపరంగా మృతభాషగా ఉంది.భారతీయ సాహిత్యమంతా మా యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక అలమారులోని ఒక అరతో సరిపోతుంది అన్నాడు మెకాలే. ఈయన భారతీయ ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఆనాటి మత, సాంఘిక, సామాజిక, ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. శాస్త్రీయ విద్యను భారతీయ ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించి మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ కీలక విద్యాపత్రాన్ని 1835లో తయారు చేశాడు. భారతదేశంలో ఆంగ్లేయ విద్యావిధానాన్ని అమలు చేయడంతో ఆంగ్ల విద్యా బోధనకు పునాది, సంస్కృత భాషకు సమాధి కట్టబడింది. వలసపాలనలో పరిపాలనా భాషగా ఆంగ్లం ప్రోత్సహించబడింది. అప్పటివరకు భారతీయ విద్యాబోధనలోనున్న సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలు కనుమరుగయ్యాయి. సాధారణ ప్రజల వ్యవహారంలో లేకపోవడం, అందరికీ విద్య అందుబాటులో లేకపోవడం, సంస్కృత భాషకు దైవత్వం ఆపాదించడం వంటివి సంస్కృత భాష భారతదేశంలో అంతరించడానికి మరికొన్ని కారణాలు. భారతీయ భాషల పుట్టుకను కాల్డ్వెల్ ఆర్య భాష, ద్రవిడ భాషగా నిర్ణయించాడు. విశాల భారతీయ భాషా కుటుంబం ఆధిపత్య ఆంగ్ల భాషా ప్రభావం చేత ఛిన్నాభిన్నమైంది.
తెలంగాణ ప్రాంతంలో చారిత్రకంగా సంస్కృత భాష ప్రాచీన కాలంలో ప్రాకృత భాషను మింగేసింది. నిజాం సంస్థానంలో తెలుగు భాషను ఉర్దూ మింగేసింది. ఆధునిక కాలంలో ఆంగ్లం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజల నిత్యజీవిత వ్యవహారాలు, విద్యావసరాలు, సాహిత్య సృష్టి, సాంస్కృతిక, చారిత్రక, రాజకీయ, ఆత్మగౌరవ చిహ్నంగా భాష ఉన్నన్ని రోజులు అమృత భాషగా ఉంటుంది. స్వాతంత్య్రం తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాషాత్మగౌరవం చూపింది మనమే. తెలుగు భాషకు ప్రాచీన హోదా గుర్తింపునకు తెలంగాణ శాసనాలే ఆధారమయ్యాయి. తెలుగు భాషకు గొప్ప చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక వైభవం ఉంది. సంస్కృత భాషకు సమానమైన ప్రాచీన హోదా, రాజ్యాంగ గుర్తింపు ఉంది. ఆధునిక సాంకేతిక ఉపకరణాలన్నీ చక్కగా తెలుగును ధరించాయి. కృత్రిమ మేధ సైతం తెలుగు భాషను చక్కగా అర్ధం చేసుకుంటుంది. మారగలిగే స్వభావమున్న భాష ఎప్పటికీ నిలబడగలుగుతుంది. సులువుగా వ్యాప్తి చెందుతుంది. ఆధాన ప్రధానాలతో తెలుగు భాష చక్కగా విస్తరించి, 2011 లెక్కల ప్రకారం దేశంలో అధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ, బెంగాలీ తరువాత రెండవ స్థానంలో ఉంది. సైద్ధాంతికతకు సంబంధించినది భాష అంటాడు హెగెల్. మానవ జ్ఞానాన్ని, అనుభవాలను తరువాత తరానికి అందించేది విద్య. ఇది భావితరానికి చుక్కాని. జ్ఞాన ప్రసారానికి వాహిని భాష. మాతృభాషలో జ్ఞానప్రసారం జరిగితే సృజనాత్మక శక్తి పెరుగుతుంది. దేశవ్యాప్తంగా పన్నెండవ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఇంటర్మీడియట్ బోర్డును 1971లో స్థాపించారు. విద్యార్ధులకు ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, తమిళం, కన్నడ, ఒరియా, మరాఠి, తృతీయ భాగంగా ఆప్షనల్ సబ్జెకట్స్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణలో తెలుగు ద్వితీయ భాషగా, ఆప్షనల్ భాషగా విద్యార్ధులు ఎంపిక చేసుకోవడమేమిటని చాలాకాలంగా విద్యావేత్తలు, మాతృభాషాభిమాన సంస్థలు, వ్యక్తులు ఆందోళనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా విద్యావిధానం, ఉపాధి అవకాశాలు, తల్లిదండ్రుల ఆశలపేరుతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు బోధించే అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. సంస్కృత భాషా బోధనకు అధ్యాపకులు లేరు. తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు సంస్కృత భాషను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా తీసుకునే విద్యార్ధుల సంఖ్య, అవసరమయ్యే సంస్కృత అధ్యాపకుల సంఖ్య కోసం విచారిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 2000 సంవత్సరం తరువాత రాష్ట్రంలో విద్య వేగంగా ప్రైవేటీకరణకు గురైంది. కార్పొరేట్ విధానంతో తల్లిదండ్రులను ఆకట్టుకోవడంలో సఫలమైంది. ఇంటర్మీడియట్ విద్య మరింత వ్యాపార గుత్తాధిపత్యంతో ఒకరు ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రైవేటు కళాశాలల్లో దాదాపుగా ద్వితీయ భాషగా సంస్కృత భాషనే ఉంది. విద్యార్ధులు మార్కుల కోసం తెలుగును కాదని సంస్కృత భాషనే ఎంచుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. విద్యలో శాస్త్రీయత ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం 2020లో కూడా మాతృభాషకే పట్టం కట్టింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంగ్లాన్ని ప్రథమభాషగా, ద్వితీయ భాషగానున్న తెలుగు స్థానంలో సంస్కృత భాషకు చోటిస్తే తల్లి భాషను శాశ్వతంగా పిల్లల నుండి వేరవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాష బోధనలో పిల్లలు సాహిత్య, సామాజిక, సాంఘిక, నైతిక విలువలు, చక్కటి సంభాషణా నైపు ణ్యం, సమాచార లేఖనా నైపుణ్యం అలవడుతాయి.మాతృభాష బోధనలో అర్థ్ధవంతమైన నైపుణ్యం, సృజనాత్మకత, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి వంటివి అలవడుతాయి.
– శీలం భద్రయ్య
98858 38288