తలకిందుల ప్రపంచంలో ఉన్నాం. అవకతవక, అసంబద్ధ పరిస్థితులనే అతి సాధారణమనుకోవలసిన నిర్బంధంలో పడిపోయాం. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దే నిపుణులం, మనమే, అధికార హూంకరింపులకు అల్లాడిపోతూ ఆత్మన్యూనతలోకి జారుతున్నాం. ఉదాహరణకు, మూడు సన్నివేశాలను చూద్దాం. పదహారు నెలలనుంచి తెలంగాణలో అధికారంలో ఉంటున్న పార్టీ, భాషలో సంస్కారం గురించి, సున్నితత్వం గురించి, మనోభావాల గురించి మాట్లాడుతుంది. హద్దుమీరుతున్న మీడియా గురించి ఆవేదన చెందుతుంది. ఎవరు జర్నలిస్టులో ఎవరు కారో తనకు ఇప్పుడే తెలిసితీరాలి అని పంతం పడుతుంది. కొరడాలెవరికో, కొరతలు వేసేది ఎవరికో నిర్ణయిస్తామంటుంది. మందలో దూరిన తోడేళ్లను గొర్రెల కాపరులే అప్పగించాలని హెచ్చరిస్తుంది.
మొన్నమొన్నటిదాకా తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయపక్షం, కొత్తగా భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. మీడియా హక్కుల గురించి మాట్లాడుతుంది.
కడుపుమండితే జనం నోటినుంచి వచ్చే మాటల సహజత్వం గురించి పాఠం చెబుతుంది. వారు మాట్లాడితే మనం వినాలి, అంతే. మనకేవైనా గతంలోని విషయాలు గుర్తుకు వచ్చినా అపస్మారకంలోకి వెళ్లిపోవాలి తప్ప, వాటిని ప్రస్తావించకూడదు. రెండు పక్షాలు వీనులవిందుగా ఇటువంటి చర్చలూ, వాదోపవాదాలూ చేసుకుంటూ ఉంటే, జర్నలిస్టు సమాజం, తప్పంతా తనలోనే ఉందేమో, ప్రింటు టివి జర్నలిస్టుల వరకు మర్యాదగా ఉన్న పాత్రికేయం, పిదపకాలపు యూట్యూబర్లు వచ్చే సరికి భ్రష్ఠుపట్టిపోయిందేమో అనుకుని అనుమానంలో పడిపోతుంది. రాజకీయ ప్రపంచంలో పూర్తి డీమానిటైజ్ అయిపోయిన ‘విలువలు’ అనే మాటను, చెక్కకత్తిలాగా ఝళిపించి, తాను ఇంకా పూర్తిగా దిగజారిపోలేదని నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెడుతుంది. గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యూట్యూబర్ల మీద గతంలో కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత ప్రభుత్వ వైఖరి తెల్లవారుజాము అరెస్టుల దాకా అభివృద్ధి చెందింది. గౌరవనీయ పూర్వ ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రత్యేకంగా కొత్తతరం మీడియా మీద మాటలు గురి పెట్టలేదు కానీ, వ్యతిరేక పోస్టులు పెట్టిన నెటిజన్లు, యూట్యూబర్ల మీద దండోపాయమే ప్రయోగించేవారు.
ప్రభుత్వం, ప్రతిపక్షాలు సరే. కానీ, జర్నలిస్టు సమాజం కూడా కొత్త తరం మీడియాను బోనులో నిలబెడుతోందా? నూరేళ్ల వయస్సు దాటిన తెలుగు రాజకీయ పాత్రికేయంలో ప్రతి కొత్త మార్పు స్వాగతాన్ని చవిచూసింది, నిరసననూ ఎదుర్కొన్నది. తమ తరంలోనే విలువలున్నాయని, అనంతరం పడిపోయాయని అందరూ చెబుతూనే ఉంటారు. మేగజైన్ జర్నలిజం విస్తరించినప్పుడు, దినపత్రికలు విస్తృతమైన నెట్ వర్క్‌తో జోన్‌ల వారీ వార్తలు ఇచ్చినప్పుడు, న్యూస్ టీవీ వచ్చినప్పుడు కూడా అనేక అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. సమాజంలో కనిపించే ప్రతికూల మార్పులకు మీడియా కారణమనే విమర్శలు వచ్చేవి. అట్లాగే, ఇప్పుడు, పరికరాల రీత్యా స్మార్ట్ మొబైల్, విషయం రీత్యా సామాజిక మాధ్యమాలు పాపాల భైరవుల లాగా తయారయ్యాయి. వాటిని బోనులో నిలబెట్టడం ద్వారా సంప్రదాయ మీడియా తనను తాను పవిత్రంగా నిలబెట్టుకోవాలనుకుంటున్నదేమో తెలియదు.
మంచి చెడ్డలు ఎంచే ముందు, ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సమాచారాన్ని పంచేవారు పాత్రికేయులు. సంఘటనలు, సంవాదాలు, అభిప్రాయాలు, పరిణామాలు, ధోరణులు అన్నీ సమాచారం కోవకిందికే వస్తాయి. చేతితో పంపుతారా, నోటితో అరుస్తారా, పావురాయి ఎగరేస్తారా అన్నదానితో నిమిత్తం లేదు. వార్తాహరుల పని వార్తలను అందించడమే. పత్రికల ద్వారా చేసినా, టీవీ ద్వారా చేసినా, యూట్యూబ్ వంటి డిజిటల్ వేదిక ద్వారా వీడియో రూపంలో అందించినా, సమాచారం అందించే పని చేస్తూ ఉంటే వారు పాత్రికేయులే. ఇందులో పెద్దగా తర్జనభర్జన పడవలసింది కానీ, పండిత చర్చ చేయవలసింది కానీ ఏముంది? మరి, ఇవాళ డిజిటల్ మీడియాలో కనిపిస్తున్న అరాచకం, బాధ్యతారాహిత్యం సంగతేమిటి? దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దా? అన్న ప్రశ్నలు వస్తాయి. యూట్యూబర్లలో మాత్రమే అరాచకం ఉందా? వాళ్లొక్కళ్లే బాధ్యత లేకుండా ఉన్నారా? పత్రికలు, శాటిలైట్ టీవీలూ చొక్కంగా ఉన్నాయా? నిగ్రహం, నియమం పాటించే సంప్రదాయ మీడియా ఉన్నట్టే, నాణ్యమైన ఆరోగ్యకరమైన డిజిటల్ చానెళ్లు లేవా? ఎందుకు ఒక సాంకేతిక ప్రసార పద్ధతికి ప్రత్యేకంగా ప్రతికూల విలువలను అంటగడుతున్నారు?
స్పష్టంగా కనిపించే కారణం, సంప్రదాయ మీడియాకు ఉన్నట్టుగా కొత్త మీడియాకు పాలనాపరమైన రెగ్యులేషన్ లేకపోవడం. నమోదు, నిర్వహణ, మంచిచెడ్డలను చెప్పే చట్టం ప్రత్యేకంగా ఏదీ లేకపోవడం, ఏ వడపోత వ్యవస్థా లేకుండా సమాచారాన్ని, అభిప్రాయాలను ప్రసారం చేయగలగడం, నెలకొల్పడానికి, నిర్వహించడానికి పెద్దగా పెట్టుబడులు అవసరం లేకపోవడం వంటి అనేక అంశాలు, కొత్త మీడియా విస్తృతికి, విజృంభణకు కారణాలు. దాని విశృంఖలత్వానికి భయపడేవారు కొందరైతే, దాని ప్రజాస్వామికతకు సంబరపడేవారు మరికొందరు. సమాచార ప్రకటనకు, భావ వ్యక్తీకరణకు కొత్త తలుపులు తెరిచిన సామాజిక వార్తామాధ్యమాలు, రాజకీయాది పరిణామాలలో కేవలం ప్రత్యక్ష సాక్షులు మాత్రమే కాదు, పాత్రధారులు కూడా.
కొత్త మీడియాకు ఉన్న ఈ శక్తిని ప్రజలే కాదు, పాలక వర్గాలూ, ప్రభుత్వాలూ కూడా గుర్తించాయి. దేశంలోని ప్రధానస్రవంతి సంప్రదాయ మీడియా తనకంత సుముఖంగా ఉండదని గుర్తించిన భారతీయ జనతా పార్టీ, దాన్ని అదుపులోకి తెచ్చుకోవడంతో పాటు, నూతన మీడియాను ప్రభావవంతంగా వినియోగించుకోగలిగింది.
అక్షరాస్యత, కొనుగోలుశక్తి వంటి పరిమితులు లేని నూతన మాధ్యమాలు విశాల ప్రజానీకాన్ని చేరతాయి, వారిలో అనేక అనుకూల, ప్రతికూల అభిప్రాయాలను నిర్మించగలుగుతాయి.కాంగ్రెస్ పార్టీ కూడా ఆలస్యంగా అయినా నూతన మీడియాను ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. రాజకీయంగా ప్రత్యేకంగా నియమించుకున్న సామాజిక మాధ్యమాల నిపుణులు, తమ సిబ్బంది ద్వారా, నిత్యం ప్రజలను ప్రభావితం చేసే విధంగా సమాచారాన్ని, సంవాదాన్ని నడుపుతుంటారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తలు, రేవంత్ రెడ్డి బృందం మీడియాను రంగంలోకి దింపారు. అనేక యూట్యూబ్ చానెళ్లు వారి తరఫున పని చేయడం మొదలుపెట్టాయి. తమ ఓటమి ఆ చానెళ్ల వల్లనే అన్నట్టుగా బిఆర్‌ఎస్ నాయకులు కెటిఆర్ అనేక సందర్భాలలో అన్నారు. తాను కూడా అదే మార్గంలోకి వెళ్లక తప్పదన్న సూచన చేస్తూ, ఆయన కూడా అనేక చానెళ్లను మోహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. వ్యక్తిగత యూట్యూబర్లే వ్యక్తీకరణల్లో రెచ్చిపోతుంటే, రాజకీయ దన్ను, ధనం ఉన్న చానెళ్లు చెలరేగిపోకుండా ఉంటాయా? రాజకీయ సంవాదాన్ని సంస్కారపు హద్దులు దాటించి, అసభ్య తీరాలలో విహరింపజేస్తున్న రాజకీయ పార్టీలు, ఇప్పుడు దుర్భాషలలోని దుర్మార్గం గురించి, స్వేచ్ఛా వ్యక్తీకరణల్లోని ప్రజాస్వామికత గురించి మాట్లాడడమెంత హాస్యాస్పదం? వారి ప్రవచనాలను మహాప్రసాదంగా జర్నలిస్టులు స్వీకరించవలసిరావడం ఎంతటి దౌర్భాగ్యం?
నూతన మీడియాకు అధికశక్తి ఉన్నమాట నిజమే కానీ, సంప్రదాయ మీడియాకు కూడా ఎంతో కొంత ప్రభావశీలత ఉన్నది కదా? దశాబ్దం కిందటి వరకు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దే పని ఆ మీడియానే చేస్తూ వచ్చింది. మరి దాన్ని మాత్రం ఈ రాజకీయపక్షాలు వదిలిపెట్టాయా? దినపత్రికలు, చానెళ్లు పార్టీల వారీగా చీలిపోలేదా? ఆయా సాధనాలలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు చవకరకం రాజకీయనాయకుల తిట్ల స్థాయికి దిగిపోలేదా? పక్షపాతాలు పచ్చిగా వ్యక్తం కావడం ఎన్‌టిఆర్ రాజకీయ ప్రవేశంతో మొదలు కాగా, ఆ రెండు పత్రికలు అని వైఎస్సార్ నిందించడంతో మీడియా వైరం బాహాటం అయింది. పక్షపాత పత్రికలకు పోటీగా నేరుగా రాజకీయపక్ష పత్రికలు రావడం మొదలయింది. వార్తాచానెళ్లూ అంతే. వార్తా ప్రాధాన్యాలూ, చర్చలూ అన్నీ పార్టీల లైన్‌నే అనుసరిస్తాయి. స్థానిక మీడియా యాజమాన్యాలు రావడం, వారి సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకూ ఆయా పార్టీల విధానాలకూ లంకె కుదరడం, పత్రికా విలువలు అన్నిటి కంటె తక్కువ ముఖ్యమైనవిగా మారిపోవడం గత రెండు దశాబ్దాలలో చూడవచ్చు. మరి ఏ రకంగా సంప్రదాయ మీడియా నూతన మీడియా కంటె ఉన్నతమైనది, మెరుగైనది? భాషలో, వ్యక్తీకరణలో, శీర్షికల అలంకరణలో అవి ఏమైనా కనీస విలువలను పాటించడం చూస్తున్నామా? రాజకీయ నేతల ముఖతః ఏ దుర్భాష వస్తే దాన్నే పత్రికలు తమ ముఖాలకు పులుముకుంటున్నాయి!
మన స్వేచ్ఛను మనం నిర్వచించుకుంటే, అదే మన హద్దులను కూడా చెబుతుంది. స్వేచ్ఛను ప్రజాప్రయోజనం కోసం ఉపయోగించుకోకపోతే, అది ఎందుకు? ప్రత్యేకంగా హద్దుల అవసరమేమిటి? పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణకు లొంగి ఉండడం కాదు, ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటే, అదే సంస్కారయుతంగా ఉంటుంది. పాత్రికేయం అనేది ఫలానా రకం వేదికకు పరిమితం కాదు. అచ్చు నుంచి యూట్యూబ్ దాకా వేదికలు మాత్రమే. మనం ఏమి చేస్తున్నామనేదే మనం జర్నలిస్టులమా కాదా అన్నది నిర్ణయించే ప్రాతిపదిక. దాని గురించి ముఖ్యమంత్రులకో, ప్రతిపక్ష నాయకులకో మనం అండర్ టేకింగ్ ఇచ్చుకోనక్కరలేదు. రాజకీయవాదులు మీడియాలోకి తప్పుడు ధోరణులు ప్రవేశపెట్టి, తిరిగి జర్నలిస్టులనే తప్పుపడుతుంటే ఆ మాయాజాలానికి లోనుకానక్కరలేదు. విశాల పాత్రికేయ సమాజం, దానిలోని సంఘాలు అన్నీ, నూతన మీడియా మిత్రులకు స్వాగతం చెప్పి, కలుపుకోవాలి. వారిని ఎట్లా అధికారికంగా భాగం చేసుకోవాలో ఆలోచించాలి. జర్నలిస్టులలో కొందరిని వేరుచేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తే, మనం కూడా దానికి లోబడి, న్యూమీడియా మిత్రులను తక్కువ శ్రేణివారిగా చూడకూడదు. మంచిచెడ్డలు పాతకొత్త మీడియాలు రెంటిలోనూ ఉన్నాయి. పాత్రికేయ శక్తి, ప్రజాస్వామికత కొత్తమీడియాలో అధికంగా ఉన్నాయి కూడా. అవలక్షణాల మీడియా, అది ఏదైనా, బాధ్యతాయుత మీడియా ముందు వెలవెలబోతుంది, పాఠకులు, వీక్షకుల చేత నిరసనకు గురి అవుతుంది. అంతకు మించిన నియంత్రణ మరొకటి అవసరం లేదనుకుంటాను.
కె. శ్రీనివాస్