రచన నా స్వయంకృత చికిత్స. అది నా అస్తిత్వ పునర్నిర్మాణ ప్రక్రియ. అది నా ధిక్కార స్వరం. ఇదినైజీరియన్ సాహిత్య సింహం (The Literary Lion) వోలే షోయింకా స్వగతం. వోలే షోయింకా (Akinwande Oluwole Babatunde Soyinka) నైజీరియాకు చెందిన గొప్ప ఆంగ్ల కవి, నవలాకారుడు, వ్యాస రచయిత, నాటక కర్త. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆఫ్రికన్. విస్తృత సాంస్కృతికదార్శనికతతో జీవన నాటకాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించినందుకు పురస్కారం ఇవ్వడంజరిగిందని నోబెల్ కమిటీప్రకటించింది. పురస్కార సభలో ఈ గతం వర్తమానాన్ని సరిదిద్దాలి అంటూ అత్యంత ఉద్వేగంతో తన ధిక్కారస్వరాన్ని వినిపించి, తన ఉపన్యాసాన్ని నెల్సన్ మండేలాకు సమర్పించుకున్నాడు. షోయింకా నాటి బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న అప్పటి అబయకూటా ( ఒగున్ స్టేట్, నైజీరియా) లోని యొరూబాకుటుంబంలో 1934 లో జన్మించాడు. అతని పూర్వీకులు ఇసారా ప్రాంత పరిపాలక వంశస్తులు. తండ్రి ఆంగ్లికన్(Protestant) మతాధికారి, హైస్కూల్ హెడ్మాస్టర్. తల్లి ఛాందస ఆంగ్లికన్. మహిళామండలి నిర్వాహకురాలు. మత ప్రాధానమైన సంపన్న కుటుంబంలో పెరిగాడు.
అతనిపై చిన్న నాటి నుండే క్రిస్టియన్, యొరూబా సంస్కృతుల సమప్రభావం ఉండేది. ఇంటిలో బైబిల్, ఆంగ్లసాహిత్య పుస్తకాలతో పాటు గ్రీకు క్లాసిక్ గ్రంథాలు ఉండేవి కనుక, చిన్ననాటి నుండే అతనికి విశ్వ సాహిత్యాభిలాషఅలవడింది. గ్రీకు మైథాలజీకి యొరూబా జానపద మౌఖిక సాహిత్యానికి అనేక పోలికలు ఉన్నవని అంటాడు. అతన్ని ముస్లిమ్ సంస్కృతి, యొరూబా తెగ మతాచారాలు ఆకర్షించాయి. నైజీరియన్ క్రిస్టియన్లలో భూతప్రేతవిశ్వాసాలు ఈనాటికీ సర్వసామాన్యం. కాని, చివరకు అతను నాస్తికుడుగా మారిపోయాడు. షోయింకా మౌలికంగా నాటకకర్త. నటుడు కూడా. నైజీరియీ లోని ఇబడాన్ ప్రభుత్వ కాలేజీలో, ఇంగ్లండ్ లోనిలీడ్స్ యూనివర్సిటీలో చదివాడు. లండన్ రాయల్ కోర్ట్ థియేటర్ లో పనిచేశాడు. ఆతడు రాసిన రేడియోనాటికలు ఇంగ్లండ్ లో, ఆఫ్రికాలో విజయవంతంగా విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. షోయింకా మాస్క్‌లు-1960 మరియు ఒరిజున్-రిపెటెరి అనే థియేటర్ గ్రూపులను సృష్టించాడు. అమెచ్యూర్ డ్రామా థియేటర్ అభివృద్ధికి దోహదపడ్డాడు. ఇబాడాన్ విశ్వవిద్యాలయంలో డ్రామా స్కూల్‌కు దర్శకత్వం వహించాడు. నాటక దర్శకుడిగాఅతని సింహం మరియు ముత్యం, చిత్తడి నేలల నివాసులు, అటవీ నృత్యం, జెయింట్స్ గేమ్ వంటి మరికొన్నినాటకాలు ఆంగ్ల థియేటర్లలోకి ప్రవేశించాయి. అతని ౄeath and the King’s Horseman నాటకం యొరూబాభాషలో వచ్చిన మొట్టమొదటి మూవీ. నెట్ ఫ్లిక్స్ ద్వారా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.
సాహిత్యంలో బ్రిటిష్ బుకర్ ప్రైజ్ అందుకున్న బెన్ ఓక్రి, ఊదా రంగు మందార నవల యువ రచయితచిమమండ న్గోజీ అడిచీ, నాటక రచయిత తోలు అజయ్ షోయింకా సమకాలీనులు. షోయింకా సాహిత్యకారుడే కాక విప్లవ కారుడు. నైజీరియా స్వార్థ రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎదిరిస్తూవచ్చాడు. ఎలెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వెస్టర్న్ నైజీరియా బ్రాడ్కాస్టింగ్ స్టూడియోను ముట్టడించాడు. బ్రిటిష్ అధికారం నుండి విముక్తి పొందేందుకు సాగిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించాడు. అతడుఅచ్చమైన అభ్యుదయ వాది. దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న జాతివివక్షతను (Aparthied), జింబాబే లోని ముగాబేక్రూర పరిపాలను గట్టిగా విమర్శించాడు. నైజీరియన్ పాలకుల అవినీతిని ఎండగట్టి జేలుపాలయ్యాడు. 1967 నైజీరియన్ సివిల్ వార్ (Biafra War) ను ఆపేందుకు స్వచ్ఛంద మద్యవర్తిత్వం వహిస్తానని ముందుకువచ్చినందుకు యాకుబ్ గోవాన్ ప్రభుత్వం రెండేళ్ళ గృహనిర్భందంలో ఉంచింది. నైజీరియన్ నియంత సానీఅబాచా కాలంలో జైలు నుండి సైకిల్ మోటర్ పై తప్పించుకొని నైజీరియా నుండి పారిపోయాడు.
వోలే షోయింకా బహు గ్రంథకర్త. 30 కి పైగా నాటకాలను, 3 నవలలు, 3 లఘు కథానికలు, 5 స్మతి రచనలు, 8 కి పైగా కవితా సంపుటాలు, పలు వ్యాస సంపుటాలు, 3 చలనచిత్రాల రచనలు, అనేక అనువాద సంపుటాలనువెలువరించాడు. షోయింకా తొలి నవల Chronicles from the Land of the Happiest People on Earth. నైజీరియన్ నియంతృత్వ పాలకులపై నిప్పులు గుప్పిన గొప్ప నవల.
షోయింకాకు సాహిత్యంలో నోబెల్ బహుమతే కాక, మరెన్నో పురస్కారాలు లభించాయి. అందులో కొన్ని – రాయల్ సొసైటీ వారి Benson Medal, అకాడెమీ Golden Plate అవార్డ్, Anisfield-Wolf అవార్డ్, 2012 జీవనసాఫల్య పురస్కారం.
వోలే షోయింకా కవిత్వం అత్యంత జటిలమైనది. నేను పెరిగిన వాతావరణంలో పదాలు విడదీయరాని నాసంస్కృతీ భాగాలు అని అంటాడు. అతని బహుముఖ ప్రజ్ఞకు అద్దంపట్టేవి అతని కవితలే కనుక, అతనికవితలను పొందు పరుస్తున్నాను. ఇవి నా అనువాదాలు. ఈ అనువాద కవితలు నా అనుస్వరం (2015 ప్రచురణ) లోనివి – ఒకింత సవరింత తో:
1. రేయి : (Night by Wole Soyinka )
నిశీథినీ!/ బరువైనది/ నా భృకుటి మీద నీవు మోపిన హస్తం!/ పాదరస మంటి మేఘంలా పరచుకోలేను; / నీ నాగలి దున్నిన నిగూఢ రహస్యాలను విప్పలేను./ చంద్రవంకలా వంపుతిరిగిన తీరం అంచున / అల్చిప్పలా ముడుచుకుని పడిఉంది ఆమె./ చూస్తున్నాను / సాగర తళత్తళలను ముంచేస్తున్న / అసూయ నిండిన నీ నయనాన్ని, / అలుపెరుగని అలల మీద నీ నాట్యాన్ని. / ఉప్పునూ, నెత్తురునూ ఇంకించుకుని/ తరంగాల తాకిడికి తల ఒగ్గుతున్న ఇసుక దిబ్బలా / కడలి ఒడ్డున నీరసంగా నేను;/ నా మూలాలను నేను వెదుక్కుంటూ./ నీలయామనీ!/ చీకటి ఆకుల గుండా నీవు వర్షిస్తున్న/ రంపపుకోతల రాత్రినీడలలో తడిసి ముద్దౌతూ/ మసకబారుతున్నవి నీ వెచ్చని జీవాణువులు;/ ఆ అనుభవ వేదనలు / రాత్రిదొంగల్లా నిశ్శబ్దంగా నన్ను బాధిస్తున్నవి./ చొచ్చుకొచ్చేస్తున్నారు/ ధాత్రిని వెంటాడే వెలుతురు సోకని రేతిరి బాలలు; / మనసొప్పదు వాళ్ళ మాటలను వినడం. / శార్వరీ!/ దాచేసేయి నన్ను/ ఈ నిశ్శబ్ద ప్రసవ వేళ;/ ఈ హిమ పూతల అణుసమూహం / నన్ను ఆసాంతం తిరుగదోసి / నన్ను దిగంబరున్ని చేసేట్టున్నది. / యొరూబా తెగల వారికి ‘ఒగున్’ ఇనుముకు (Iron) దేవుడు. అందుకు సంబంధించిన షోయింకా ప్రసిద్ధ కవిత.
2. ‘ఋతువు’ : (Season)
తుప్పు – తుప్పంటే పరిపక్వత / తుప్పంటే ముదిరిన మొక్కజొన్న / తుప్పంటే పతనమై పండే పంట కోత./ పరపరాగ సంపర్క సమయం ఇది;/ పంట చేల పైరగాలిలో వానకోయిలు/ నృత్యాలను అల్లుతున్నవి/ తూలికల బాణాల లాంటి, / ఎగిరే వెలుగు రేఖల వంటి / జొన్న పొత్తుల కేసరాలతో. / ప్రియమైనవి / మాకు పిల్లగాలలు వినిపించే పదబంధాలు, / గుచ్చుకునే వెదురు పొదల వెండి ఆకుల చప్పుళ్ళు, / జొన్న కర్రల కరకు రాపిళ్ళ సవ్వళ్ళు./ రైతులం మేము& కంకుల కేసరాలు కపిల వర్ణంగా మారాలని / పోగేసుకున్నాం పొడుగాటి సాయంసంధ్యా నీడలను, / గడ్డి తాళ్ళను పేనుకున్నాం తాటి నెగళ్ళ పొగలతో./ చీడ తెచ్చే మార్పు కోసం, / తుప్పు ఇచ్చే భరోసా కోసం వేచి ఉన్నాం. / (నైజీరియన్ ఒగున్ మైథాలజీలో ‘ తుప్పు’ పతనానంతర ప్రగతికి ప్రతీక).
3. నేల దృశ్యం : (Landscaped)
ఉప్పెన అంత ఉధృతంగా ఉన్నందుకే / ఊడ్చివేయ బడ్జాము; /ఆ పొగరుబోతు కాంతి ముందు / అన్ని వెలుగులూ దిగదుడుపే. / బలిసిన ఆ విద్యుత్ వాక్కు / ఆదిని మింగిన అంతం;
/ అవశేషం నవాశ్రు కణం./ అయినా, / కాలాన్ని కబళిస్తూనే వున్నవి పిపీలికాలు!/ దండి వ్వహారమేదే దాగివుంది సంగీతంలో;/ పేలనున్న అనుశాసనం ఏదో వెదచల్ల బడింది ఆర్ద్ర భూముల్లో. / గ్రహించే ఉంటావు నీవు / నా నీడలు బద్దలైన చీకట్లలో నగరం ఆరిపోక తప్పదని, / ఈ ముందస్తు హెచ్చరిక గుచ్చుకోక తప్పదని./ మకిల పట్టిన వెండి రూకలను / కుక్కల చావడిలో ఉంచడమే ఉచితం./ నవ్వు ఒక్కొక్క నిశ్శబ్ద క్షణంలోంచి నడచి వెళ్తున్నది. / (గత నియంతలపైశాచికతతో, సివిల్ వార్లతో అతలాకుతలమైన నైజీరియా దృశ్యమే ఈ నేల దృశ్యం) ఇప్పుడు షోయింకా వయసు 88. దేశదేశాల విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెల్తుంటాడు. ట్రంపు గెలుపుకు నిరసనగా గ్రీన్ కార్డ్ను చించేసి అమెరికాను వదిలాడు. 3 వివాహాలు చేసుకున్నాడు. ఇదుగురుపిల్లలు. అబయకూటా లోని అటవీ కుటి (Forest House) అతని ఇల్లు. జటిల భావ సంక్లిష్ట రూప కవన సృజనుడు వోలే షోయింకా! నల్ల కొలనులో నీలి కలువ షోయింకా!
నాగరాజు రామస్వామి