Thursday, January 23, 2025

అస్తిత్వపు దారుల్లో బహుజన బావుటా

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘ కవిత ‘బహుజనబావుటా’. ఆత్మగౌరవ పోరాటాన్ని, కుల నిర్మూలన ఉద్యమాన్ని ఒక ఉద్యమంగా నడిపి అట్టడుగు వర్గాల బతుకుల్లో విద్యా కాంతుల్ని ప్రసరింపజేసిన విప్లవ యోధుడు మహాత్మ జ్యోతిబాపూలే గురించి రాయబడిన దీర్ఘ కవితయే ‘బహుజన బావుటా’. భారతదేశంలో అంటరానితనంపై, కుల వివక్షపై, విద్య ఆవశ్యకతపై గళమెత్తిన మొట్టమొదటి సంఘసంస్కర్త, యుగపురుషుడు మహాత్మ జ్యోతిరావు పూలే. ఆయన స్థాపించిన సత్య శోధక్ సమాజంతో మహారాష్ట్రలో పలు మార్పులు సంభవించాయి. సమానత్వం కోసం, మానవీయ విలువల పరిరక్షణ కోసం నిరంతరం పరితపించిన మహనీయుడు జ్యోతిబాపూలే. ఆయన చేసిన అపార పోరాట పటిమను గూర్చి త్యాగమయ జీవనాన్ని గూర్చి, సంఘసంస్కరణ దృక్పథాన్ని గూర్చి వనపట్ల సుబ్బయ్యఈ దీర్ఘ కవిత ద్వారా తెలియజేశాడు. సుబ్బయ్యకు ఇప్పటికే ఆరు దీర్ఘ కవితలు రాసిన అనుభవం ఉంది. ఇది ఏడవ దీర్ఘకావ్యం. దీన్నిసాహిత్య అకాడమీ ప్రచురించింది. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నట్లు పాఠకుల్ని తన వెంట నడిపించే గుణం సుబ్బయ్య కవిత్వానికి ఉంది.
ఈ కావ్యం ప్రారంభంలోనే ఈ విధంగా చెప్పి పాఠకుల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేటట్లు కవి చేసిన విధానం బాగుంది-కుల సర్పాలు/ బతుకు సూర్యుడిని మింగినప్పుడు/ ఒక వేగుచుక్క పొడిచింది/కుల మతవైశమ్యాలు సామాన్యుల బతుకును బుగ్గిపాలు చేసినప్పుడు ఒక వేగుచుక్కలా జ్యోతిబాపూలే ఉదయించాడు అని కవిత్వీకరించినవిధానం బాగుంది. అంధకారానికి అక్షరమే ఆయుధమని అడుగడుగున చదువులను పంచి, దేహాన్ని చెలిమె చేసి అట్టడుగు జనుల దూప తీర్చిన మహోన్నతమూర్తిగా జ్యోతిబాపూలేను కీర్తించాడు. తన భార్యయైనసావిత్రిబాయికి చదువు నేర్పించి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబాపూలేకు దక్కుతుంది. మనువాదపు పునాదులను కూల్చి, కింది కులాల విముక్తికై కాల సంకెళ్ళను తెంచి, స్వేచ్ఛకు పురుడు పోసి, మానవ హక్కులను దోసిట్లకు వొంపిన ఆధునిక సామాజిక విప్లవ పితామహుడు జ్యోతిబాపూలే.
జ్యోతిబాపూలే రాసిన గులాంగిరి ద్వారా పురాణాల్లో ఉన్న వాస్తవాల్ని, అవతారాల రహస్యాల్ని, మనువాద ఉన్మాదాన్ని బట్ట బయలు చేసిన విధానాన్ని కవి ఇలా చెప్పాడు- అంటు ముట్టు మంటల్ని/ పురాణాల అవతారాల్ని/ పౌరాణిక క్రూర రూపాల్ని/ దోపిడీ వర్గ కువ్వారాల్ని/అడుగడుగున పొట్టుపొట్టు పల్గజీరి/ సామాజిక వికాసానికై/గళమెత్తిన మహాజన ధ్రువతార అంటూ దోపిడీ వర్గ కుతంత్రాలని చీల్చి చెండాడిన విధానాన్ని స్పష్టంగా తెలియజేశాడు.‘గులాంగిరి’ని వర్ణ వ్యవస్థల గుండెల్లో డైనమెట్ గా అభివర్ణించాడు. నల్లకలువల నవ్వులకై, గడ్డిపూల గెలుపుకై, గిజిగాళ్ళ పలుకుకై, హద్దులు లేనిపోద్దుకై గుండె చూపినడిచిన త్యాగాల తొలి అడుగు, తొలి వేగుచుక్క జ్యోతిబా పూలే అని ప్రస్తావించడం బాగుంది. మనిషిని దేవునిగా ప్రేమించిన వాడు, అసత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని సత్యంగా శోధించినవాడు, స్వచ్ఛమైన మనిషి, అచ్చమైన మనిషి, మట్టి మనిషి, మహా మనిషి జ్యోతిబాపూలే అని ఆయన సహజ వ్యక్తిత్వాన్నికళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. అంధవిశ్వాసాలు రాజ్యమేలుతున్న రోజుల్లో వాటిని నిర్మూలించాలంటే విద్య అనే వెలుగు అవసరమని భావించి అట్టడుగు వర్గాల వారికి బడులను ఏర్పాటు చేసి విద్యను నేర్పించి జ్ఞానమయ జీవులుగా తీర్చిదిద్ది వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసిన జ్ఞాన భాస్కరుడు. ఇదే విషయాన్ని కవిత్వీకరిస్తూ కవి ఇలా అంటాడు- మూఢనమ్మకాల పెను చీకట్లపై/చైతన్యాన్ని రగిలించి/దశావతారాల లోగుట్టును తూర్పార బట్టి/ సత్యాన్ని సూర్యుడిలా వెలిగించిన మహాదేవుడు అని అద్భుతంగా చెప్పాడు.
కాళ్లకు కత్తులు కట్టుకొని కాటేస్తున్న కుల ఉన్మాదాన్ని కూకటివేళ్లతో పెకలించి కర్మసిద్ధాంతం కాదు, బతుకు సిద్ధాంతం కావాలని, తలరాతలు కాదు బతుకు రాతలు మారాలన్న మహోదయుడుగా జ్యోతిబాపూలేను కీర్తించిన విధానంలో ఏమాత్రం అవాస్తవం లేదు. నేలకు పున్నమి వెలుగుగా, తొలి హరితగీతంగా, తొలి యుద్ధగానంగా పూలేను కీర్తించాడు. ఆకాశానికి పూసిన సూర్యపుష్పంగా, నాగభూమిలో మొలిచిన జ్ఞానపరిమళంగా, ఆధునిక వైతాళికుడిగా పూలే కీర్తించబడ్డాడు. బ్రాహ్మణీయ సమాజం విద్యను సామాన్యులకు దక్కకుండా చేసిన దుర్మార్గపు కాలంలో బానిసలుగా సామాన్యులు బతుకు ఈడుస్తున్న సందర్భంలో ఎంతటి దుర్మార్గాన్నైనాకూల్చేసే ఆయుధం విద్యయేనని, ఆ విద్యను అందరికీ నేర్పించడం కోసం పాఠశాలలు నెలకొల్పడం, ముఖ్యంగా వంటింటికే పరిమితమైన మహిళలకు ప్రత్యేకంగాపాఠశాలల్ని నెలకొల్పి వారికి విద్యను అందించి చైతన్య వంతుల్ని చేసిన ఘనత పూలే సొంతం. వర్ణ కట్టుబాట్లను బద్దలు చేసిన పూలేను మనువాదులు హెచ్చరించి భయపెట్టి వెలేసినా బహుజనులకు చదువు చెప్పి వారికి బంధువుగా మారి భారత దేశ చరిత్రను మార్చినవాడు జ్యోతిబాపూలే. నిమ్న వర్గాలకు జ్ఞాన ద్వారాల్ని తెరిచిన ఆధునిక భారతీయ తొలి సామాజిక తత్త్వవేత్తగా తేల్చి చెప్పాడు.
అక్షరమక్షరం శరమై బ్రాహ్మణవాద దుర్నీతిని చీల్చినవాడుగా, అవతారాల గుట్టు విప్పిన బహుజన తాత్త్వికుడుగా, స్త్రీల ఆత్మగౌరవ ప్రభోధకుడుగా, అసత్యాలను సమాధి చేసిన సత్యమూర్తిగా, సమతా మూర్తిగాజ్యోతి బాపూలేను కీర్తించాడు. స్త్రీల హక్కులే మానవ హక్కులని విప్లవించిన సామాజిక వైతాళికుడు పూలే. చీకటికి నిప్పంటించి నిచ్చెన మెట్లకండ్లు తెరిపించి దురాచారాలకు పొగబెట్టి శాస్త్రీయతకుపాదువేసిన తొలి సంఘసంస్కర్త జ్యోతిబాపూలే. ఆయన ఈ దేశ ఆధునిక వైతాళికుడు, అస్తమించని రవి చంద్రుడు, మహర్షి, మహాత్యాగి, కర్మయోగి, క్రాంతదర్శి. భారతావనిలో ఒక వెలుగు పుట్టినరోజుగా, తిరుగుబాటు జెండా ఎత్తిన రోజుగా, పేదల స్వప్నం ఫలించిన రోజుగా పూలే పుట్టినరోజును అభివర్ణించాడు .
పూలే సతీమణి సావిత్రిబాయి జన్మ నేపథ్యాన్నిఇలా ప్రస్తావించాడు -అజ్ఞానాంధకారం/ చిత్రహింసలతో ధరణి తల్లడిల్లుతున్న సమయం/దిగ్గున ఓ మెరుపు మెరిసింది/ ప్రశ్న నేరమైన చోట/ ఒక పువ్వు పూసింది/ మాట్లాడడమే విషాదమైన చోట/ ఒకధిక్కారం తలెత్తిందిఅనిసావిత్రిబాయి జననాన్ని కవిత్వీకరించిన విధానం బాగుంది. స్త్రీలకు చదువు చెప్పడానికి వెళుతున్న సావిత్రిబాయి పూలేను రకరకాల అవమానాలకు గురి చేశారు. మతిదప్పిన చాందసవాదులు ఆమెపై పేడ చల్లిండ్రు, అనరాని, వినరాని బూతులు తిట్టినప్పటికీ ఏమాత్రం చలించకుండా తాను మాత్రం స్త్రీలకు చదువు చెప్పడంలో సఫలీకృతురాలైంది. సావిత్రిబాయి పోరాటాన్ని కీర్తిస్తూ, బహిష్కృతులకు బతుకు దీపమై/ అందని అక్షరాన్ని నేలకు దింపింది/ అలల మీద పడవై వేదాగ్నిలోసావిత్రియై/అట్టడుగు ఆత్మగౌరవాన్ని ఆకాశంపై నిలిపింది. అనిఅంటాడు.ఈ దంపతుల చరిత్రను ఎన్నో ఏళ్లు కప్పివేయడం జరిగిందని, వారు ఇంకా ఇప్పుడిప్పుడే తమ అస్తిత్వం కోసం పాటుపడుతున్నారని చెప్పడం జరిగింది. మానవీయం మోడు వారిన భూమిలో/ మానవత్వ వనాల్ని పూయించి/ధర్మంలేని భరత భూమిన/తన కొంగే ధర్మసాల/ వితంతువుల గర్భాలకు పురుడు పోసిన మాతృమూర్తి అంటూ సావిత్రిబాయి వ్యక్తిత్వాన్ని చక్కగా చాటిచెప్పారు.
చాతుర్వర్ణ వ్యవస్థ గురించి కవి ఇలా అంటాడు-.. మేమెవరి కాళ్ల నుండి/ చేతుల నుండి పుట్టలేదు/మేమెవరి మొఖాల నుంచి/నోర్ల నుంచి బొడ్ల నుంచి ఊడిపడలేదు అంటూ కితాబిచ్చారు. బహుజన వెలుగు బావుటాగా, సాంస్కృతిక విప్లవంగా, దీనజన బాంధవునిగా జ్యోతి బాపూలేను ప్రస్తావిస్తూ అస్తిత్వపు దారుల్లో బహుజన బావుటాను ఎగిరేసిన సుబ్బయ్య సర్వదా అభినందనీయుడు.

డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య
9704731346

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News