Wednesday, January 15, 2025

‘నానీల తీరాన’ కవితా ఝరులు

- Advertisement -
- Advertisement -

ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యానికి డాక్టర్ ఆచార్య ఎన్. గోపి అందించిన అద్భుత సాహిత్య ప్రక్రియ నానీలు. నాలుగు పాదాలలో తక్కువ పదాలతో విశాలమైన భావజాలంను కురుపించేవి నానీలు. ఆకర్షణీయమైన మెరుపుతో సాహితీ ప్రియులను ఆకట్టుకుంటూ జనబహుళ్యంలోకి శరవేగంగా దూసుకెళ్తున్న ‘నానీలు‘ ప్రక్రియలో ఇప్పుటికే పలువురు కవులు పుస్తకాలను వెలువరించారు. ఇలా గత పాతిక సంవత్సరాలుగా నానీల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆ ప్రహహంలో వచ్చిన మరో కెరటమైన ఎన్. లహరి కూడా ‘నానీల తీరాన‘ అంటూ తన అంతరంగంలో కదలాడే భావాలకు అందమైన అక్షరాకృతిని కల్పిస్తూ చక్కని కవిత్వాన్ని అందించారు.
నానీల లక్షణాలను సంపూర్ణంగా అవగాహన చేసుకున్న లహరి ‘నానీల తీరాన‘ సంపుటిలో నానీలను అలవోకగా అల్లగలిగారు. ఆత్మీయతానుబంధాలు, ప్రేమాభిమానాలు, మానవ సంబంధాలు, తాత్వికత, హాస్యం, వ్యంగ్యం, వాస్తవిక జీవన చిత్రణలతో చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పారు. పల్లె సొగసును, ప్రకృతి అందాలను, రైతు కన్నీళ్లను, అమ్మ జ్ఞాపకాలను, మాతృభాష మధురిమను ఇలా ఒకటేమిటి అనేక అంశాలను ఇందులో స్పృశించారు కవయిత్రి. కొన్ని నానీలు సాధారణాంశాలకు భిన్నంగా ఉండి పాఠకులను ఆలోజింపజేసెల ఉన్నాయి. ప్రతి నానీ కూడా అర్థవంతమైన పదాల కూర్పుతో ఉండటం వలన ‘నానీల తీరాన‘ పుస్తకం ఆసాంతం చదివేలా ఉన్నది.
‘మా గురువుతో/ మాట్లాడాను/ వంద పుస్తకాల జ్ఞానం/
వచ్చేసింది’
అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి బోధనలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ గురువుకు సాటివచ్చేది ఏది లేదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు అపార జ్ఞానమును కలిగి ఉంటాడు. అందుకే ఒకసారి గురువుతో మాట్లాడితే వంద పుస్తకాల జ్ఞానం వస్తుందని గురువు ప్రాధాన్యతను పై నానీలో కవయిత్రి చాల గొప్పగా తెలిపారు.
‘ముఖానికి/ ముసుగు వేస్తావు/ లోపలి వ్యథకు/
వేయగలవా’
నేటి సమాజంలో అనేక మంది ముందు ఒకలాగ, వెనుక మరోలాగ మాట్లాడుతూ జీవితంలో నటిస్తున్నారు. మనిషి ముసుగు వేసుకొని తన ముఖాన్ని దాచుకోవచ్చు. రంగులు మార్చవచ్చు కానీ మనిషి తన లోపల ఉన్న బాధను మాత్రం తొలగించలేడు. ఒకవేళ అణచాలని చూసిన అది ఏదో ఒక రూపకంగా బయట పడుతుంది. కాబట్టి మనిషి తన మనసు లోపల ఉన్న బాధను మాత్రం ఏ ముసుగు వేసి కూడా తీసివేయలేడనే అతి పెద్ద జీవిత సత్యాన్ని ఈ చిన్న నానీలో కూర్చిన తీరు బాగుంది.
‘భూమాత / బోసిపోయింది/ కొండల అభరణాలు/
మాయమయ్యాయి కదా’
ప్రస్తుతం ప్రభుత్వ భూములు అనేక రకాలుగా అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువులు, గుట్టలు అన్నిటినీ ఆక్రమించుకొని పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు. అందుకే భూమాత బోసిపోతుందని లహరి ఆవేదన చెందారు. భూమిపై సహజ సిద్ధంగా ఉన్న కొండలు, చెట్లు, నదులు మొదలగునవి మనకు ఎంతో ఉపయోగపడతాయి. కానీ నేడు అభివృద్ధి పేరుతో భూమాతకు అభరణంగా ఉన్న కొండలను కూడా చదును చేసి ఫ్యాక్టరీలు కడుతున్నారు. రానున్న కాలంలో భూమిపై కొండలనేవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దాని ద్వారా ప్రజలతో పాటు పశుపక్ష్యాదులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే కొండలను కాపాడుకోవాలనే సందేశాన్ని కవయిత్రి సామాజిక బాధ్యతగా ప్రజలకు చేరవేశారు.
‘రెక్కలొచ్చేదాక/ అమ్మ ఒడిలో/ వీసా విహంగాలపై/
విదేశాలకు’
ఆధునిక వాస్తవిక పరిస్థితులకు దర్పణం ఈ నానీ. ఒక వయసు వచ్చే వరకు అమ్మ ఒడిలో ఒదిగిన పిల్లలు, ఆ తర్వాత చదువు పేరుతో, ఉద్యోగాల పేరుతో విదేశాలకు పయనం అవుతున్నారు. మలి వయసులో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. తమను కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్దాశ్రమాల్లో వేస్తున్నారు. ఇది చాలా బాధాకరం.
‘బెల్లం లేకుండానే/ భక్ష్యాలు చేస్తారు/ ఓటుకోసం/
ఇంటికొచ్చిన నేతలు’
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనేక గారడీలు చేస్తారు. ఇల్లిల్లు తిరిగి రకాల రకాల పనులు చేస్తూ ఫోటోలకు పోజులిస్తారు. ఎన్నో హామీలు కురిపిస్తారు. ఓట్ల పండుగ అయ్యాక ముఖం చాటేస్తారు. అలాంటి రాజకీయ నాయకులను ఉద్దేశించి వ్యంగ్యంగా రాస్తూ, ఎవరెన్ని చెప్పిన ఓటరు తన సొంత ఆలోచనతో, జాగ్రత్తగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అంతర్లీనంగా ఈ నానీలో తెలిపారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉన్న నానీలన్నీ ఒకదానిని మించి మరోటి అన్నట్టు లోతైన భావంతో ఉన్నాయి. నానీల సృష్టికర్త డా. గోపిగారు అన్నట్టు చెప్పదలుచుకున్న విషయాన్ని నాలుగు పాదాల్లో చెప్పడం చాలా కష్టమైన పని. కానీ ఆ పనిని సులువుగా చేసింది లహరి. కవయిత్రి తన అనుభవాలను అనుభూతులను వర్ణిస్తూ పాఠకులను నానీల తీరపు కవితా ఝరిలో ఆహ్లాదంగా విహరింపజేశారు. సందర్భానుగుణంగా నానీలకు ప్రతి పేజిలో చక్కని బొమ్మలు కూడా ఉన్నాయి. సామాజిక హితంగా మున్ముందు మరింత పదునైన కవిత్వంతో ఎన్. లహరి మన ముందుకు వస్తుందని ఆశిస్తూ అభినందనలు.

కందుకూరి భాస్కర్
9441557188

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News