- Advertisement -
అవును
సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు
ఆకాశం అదే
అలలు వస్తుంటాయి పోతుంటాయి
సముద్రమూ అదే
సముద్రం నువ్వయితే
నీలో మునిగి ఈదాలనుకునే చేపని నేను
అన్ని వైపులా కాపలాకాసే
ఆకాశానివి నువ్వయితే
నీ నుండి పారిపోలేని
అశక్తుణ్ని నేను
అన్నింటికీ ఆలవాలమైన భూమివి నువ్వయితే
నీలోనే కలిసిపోయే
ప్రాణిని నేను
కనిపించని గాలివి నువ్వయితే
నిన్నే శ్వాసతో నింపుకుంటున్న
శరీరాన్ని నేను
చీకటిని పారద్రోలే కాంతివి నువ్వయితే
నీ వెలుగుతో చూడగలుగుతున్న కళ్లను నేను
అవును
నువ్వు ఎవరైనా, నేను ఎవరైనా
ఎక్కడైనాఎప్పుడైనా
అదే
ముకుంద రామారావు
- Advertisement -