Thursday, January 23, 2025

అరుదైన విమర్శకుడు

- Advertisement -
- Advertisement -

రచనలను మరింత తీర్చిదిద్దడానికి సాహిత్య విమర్శ రచయితలకు తోడ్పడుతుంది. కథ, కవిత రాయడం ఒక మనోచింతన ప్రక్రియ అయితే రచనా విశ్లేషణ మేధోమధన చర్య. కొన్ని రచనలు చేసినా రచయిత కావచ్చు కాని ఎన్నో చదివితే తప్ప విశ్లేషకులు కాలేరు. అందుకే రచయితలతో పోల్చితే సాహితీ విమర్శకుల సంఖ్య అతి తక్కువగా ఉంటుంది. రచయితలకొచ్చే గు ర్తింపుతో సరిచూసినా విమర్శకులకు దక్కేది తక్కువే. కథ, నవలలకున్నంత పాఠకశ్రేణి విశ్లేషణాత్మక రచనకు ఉండదు. రచనను తూకమేయడమే తప్ప రచయితను తృప్తిపరచడం నిబద్ద విశ్లేషణ అనిపించుకోదు. అందువల్ల విశ్లేషకులు రచయితల అలక, కోపతాపాలకు కూడా గురి కావచ్చు. ఇలా పూలు, ముళ్ళు ఉన్న క్షేత్రం ఇది. ఇవేవి లెక్క చేయకుండా తనదారిన తాను పోతున్న సాహితీ విమర్శకులు కె పి అశోక్ కుమార్. ప్రస్తుతం తెలుగు సాహితీ విమర్శకులలో ఏ కొలమానంలో చూసినా ఆయన తొలివరుసలో కనబడతారు. వందలాది పుస్తక సమీక్షలు, సాహిత్య విశ్లేషణలు చేసిన అశోక్ కుమార్ తన రచనల్లోంచి కొన్ని వ్యాసాలను ఎంపిక చేసి రెండు పుస్తకాలుగా తీసుకొచ్చారు. వాటిలో ఒకటి కథలకు సంబంధించిన ’కథావిష్కారం’ కాగా మరోటి నవలలపై లోతైన విశ్లేషణలతో కూడిన ’తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం’. రెంటిలోనూ భిన్నమైన రచనల ఎంపికతో, తెలుగు రచయితలెందరికో తెలియని సాహిత్య ప్రస్తావనతో తన అనుభవసారాన్ని పాఠకులకు అందించారు. ప్రత్యేకంగా వర్ధమాన రచయితలకు పునాదిగా పనికొచ్చే సమాచారం వీటిలో ఎంతో ఉంది.
2019 లో వచ్చిన ఈ గ్రంథాల్లో ఒకటైన ’తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం’ వరుస పురస్కారాలతో విశేష గౌరవాన్ని అందుకుంటోంది. పుస్తకం వచ్చిన సంవత్సరంలోనే సృజనాత్మక రచనలకు, విమర్శనాత్మక గ్రంథాలకు ఇచ్చే నూతలపాటి సాహితి పురస్కారం లభించింది. ఆగష్టు 2021లో ఉత్తమ విమర్శనా గ్రంథంగా తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారాన్ని పొందింది. ఈ ఫిబ్రవరిలో కొలకలూరి రామయ్య అవార్డును అందుకుంది. ఇదే వరుసలో ’తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం’ అద్దేపల్లి రామమోహనరావు సాహిత్య విమర్శ పురస్కారానికి ఎంపికైంది. సెప్టెంబర్ పదవ తేదీన కాకినాడలో ఈ పురస్కారప్రదానం జరుగుతోంది.
1956 లో జన్మించిన అశోక్ కుమార్ చదువు సికింద్రాబాద్ లో సాగింది. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్ర సారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇరువై అయిదేళ్ల పాటు హైదరాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో గ్రంథపాలకుడిగా పనిచేశారు. అభిరుచికి తగ్గ ఉద్యోగంలో ఆయనకు పుస్తకపఠనానికి తగినంత సమయం దొరికిందనవచ్చు. చదివి వదిలేయకుండా వాటిపై సమీక్షలు, విమర్శనాత్మక వ్యాసాలు రాయడం, అవి పలు పత్రికల్లో రావడంతో సాహితీ విమర్శకుడిగా నిలదొక్కుకొని గుర్తింపు పొందారు. సాహిత్యం , సినిమాలు ఆయన అభిమాన వ్యాపకాలు. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు సమీక్షలు రాసి వాటిని తెలుగువారికి పరిచయం చేశారు. రెండు వేలకుపై పుస్తక సమీక్షలు రాయడంలో ఆయనదే రికార్డు.
‘తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం’లో 25 సాహిత్య వ్యాసాలున్నాయి. తెలుగు నవలా రచయితలు చేసిన ప్రయోగాలు లక్ష్యంగా వీటి ఎంపిక జరిగింది. నవీన్ అంపశయ్య నుంచి అంతస్స్రవంతి వరకు, శీలావీర్రాజు నవలలో శిల్పరీతులు, జేమ్స్ జాయిస్ కోవలో ఆరుద్ర గ్రామాయణం, అడవి బాపిరాజు నవలలు – బహుముఖీన ప్రతిభ, తొలి ముస్లిం మైనారిటీ నవల వెండి మేఘం, వాసిరెడ్డి సీతాదేవి నవలల్లో సామాజిక వాస్తవికత – మనోవిశ్లేషణ తదితర వ్యాసాల్లో లోతైన చర్చ చూడవచ్చు. వినుకొండ నాగరాజు, ఎం. వి. తిరుపతయ్యల రచనలు, జీవన వివరాలు తెలుసుకోదగ్గవి. ప్రజా చైతన్యమే వ్యాపార నవలలకు అడ్డుకట్ట అనే వ్యాసంలో 1980 దశకంలో వచ్చిన క్షుద్ర సాహిత్యంపై తీవ్రమైన విమర్శ ఉంది. సామాజిక ప్రయోజనాన్ని ఆశించే నవల ఇంత పతనం కావడానికి అమ్ముడుపోయిన రచయితలు, పత్రిక సంపాదకులు కారణమంటూ వారి పేర్లను ఉటంకిస్తూ తూర్పార పట్టారు. అశోక్ కుమార్ వ్యాసాల్లో విస్తార విషయపరిజ్ఞానం, సూక్ష్మ పరిశీలన, వివరణ నైపుణ్యం, విశ్లేషణా సామర్థ్యం, నిష్పక్షపాత వైఖరి కనబడతాయి. తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ మొదలు ఆత్మ కథనాత్మక ధోరణి వరకు రచయితలు చేసిన ప్రయోగాలను ఈ వ్యాసాల్లో ఆవిష్కరించారు. అతనిలోని అధ్యయన విస్తృతి, పరిశోధన దృష్టి వీటిలో ప్రతిఫలించాయి. అశోక్ కుమార్ ప్రణాళికాబద్ధ రచనా క్రమంలో వ్యాసమైనా, సమీక్ష అయినా, పరిశోధనా పత్రమైనా సమగ్ర సమాచారంతో నిండుదనాన్ని ప్రదర్శిస్తుంది. ప్రముఖ రచయితలు భిన్న కాలాల్లో తమ నవలల్లో చేసిన భిన్న ప్రయోగాలు.. వాటి వల్ల తెలుగు నవలకు అందిన వైవిధ్యం చివరి వ్యాసంలో రచయిత సోదాహరణంగా వివరించారు.
తెలుగులో ప్రారంభ దశలో వచ్చిన నవలలు నీతి గ్రంథాల వలె ఉండేవని, తర్వాత పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు నవలా రచయితల ఆలోచన సరళి మారి వారి రచనల్లో వస్తువు, ఇతివృత్తం,పాత్ర చిత్రణ, సన్నివేశ నిర్మాణం, శైలి శిల్పాల్లో ఎంతో వైవిధ్యం సంతరించుకుందన్నారు. ఈ క్రమంలో మనోవిశ్లేషణాత్మక, అస్తిత్వవాద, వైజ్ఞానిక, సమాచారాత్మక,పేరడీ, ఫాంటసీ, సిక్వెల్, యాత్రా నవలలు తెలుగులో వచ్చాయని ఆయా నవలలు, రచయితల వివరాలతో పేర్కొన్నారు. తెలుగు నవల ప్రయోగ వైవిధ్యంపై విస్తృతంగా చర్చించిన ఈ పుస్తకానికి తగిన స్పందనగా పురస్కారాలు దక్కడం విమర్శనా గ్రంథాల రాకకు ప్రోత్సహక పరిణామం. కె పి అశోక్ కుమార్ తార్కిక గ్రంథ రచన మరింత ముందుకు సాగేందుకు ఈ గౌరవం ఉత్ప్రేరకంగా పనిచేయాలని అభిలషిస్తూ, రచయితలు అభినందనలు.

బి.నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News