Friday, November 15, 2024

బాధిత బహుజన జీవితాల చిత్రణ

- Advertisement -
- Advertisement -

‘శప్త భూమి’ పేరులోనే ఏదో పౌరాణిక వాసన.ఏ భూమి?ఎవరిచే శపించ బడింది? ఎందుకు శపించారు?ఇలాంటి ప్రశ్నలు కదలాడాయి.ముఖపత్రాన్ని సగం ఆక్రమిస్తూ ఓ చిత్రం.ఆ చిత్రానికి నేపథ్యం పౌరాణికమా? చారిత్రకమా? అని మరో రెండు ప్రశ్నలు. అశ్వదళం మధ్య నురగలు కక్కుతూ దుముకుతున్న ఓ జవనాశ్వంపై ప్రళయ భీకరంగా అరుస్తూ బల్లెం విసరడానికి ఉద్యుక్తుడౌతున్న యోధుడు.నడుం క్రిందినుండి తొడలను మాత్రమే కప్పుతున్న ఓ పంచె.ఆరు పలకలుగా తేరిన బంగారు కడ్డీకి కోరమీసాలు,జులపాలు. గత చరిత్రకు ఆనవాలుగా ఉన్న వ్యక్తి చిత్రం.ఒక యోధుడి కథ ఆధారంగా కక్షలు కార్పణ్యాల మధ్య నలిగిన సీమ చరిత్రే ఈ నవల అనిపించే ప్రతీకాత్మక చిత్రమది.తన తండ్రిని చంపిన వాణ్ణి మల్లయుద్ధంలో ఓడించి రణం కుడుపు ఆరగించిన జవ్వని దిగంబరంగా గొడ్డలి పైకెత్తి గుర్రాన్ని దూకిస్తున్న చిన్ని చిత్రం చివరి అట్టపై ఉంది.

లోపలికి అడుగు పెట్టగానే టైవ్‌ు మిషన్‌లోలా రెండువందల ఏభై ఏళ్ళ వెనక్కి మనం తోసుకు పోతాం. ఆనాటి రాయలసీమ లోని చారిత్రక,సామాజిక పరిస్థితులను ఆధారం చేసుకొని బండి నారాయణస్వామి రాసిన 255 పుటల నవల ఇది. కురవలు.బోయలు,మాలలు,మాదుగులు,కోమట్లు,విప్రవినోదులు,మోడీ వారు ఇలా ఎంతో మంది బాధిత బహుజన జీవితాల్ని చిత్రించారు. ఒక స్త్రీ సిడిమాను ఎక్కడం, గాలిదేవర,దేవరపోతు, ఏడుగురు భర్తలను మార్చిన గౌడసాని ఇలా ఆనాటి ఆచారాలను కళ్ళకు కట్టింది ఈ నవల.రాయలసీమలోని మఠాలు ,తాంత్రిక విద్యలు, పరసువేది వేదాంత చర్చ రేఖామాత్రంగా రాశారు. సహగమనం చేస్తే స్వర్గంలో భర్తపక్కనే భోగించవచ్చన్న నమ్మకాన్ని సమాజంలోని స్రీలలో బలంగా నాటారు.అదే విషయాన్ని మంగలి గైరమ్మ చెబుతుంది.వీరగల్లు మీద తన భర్త ప్రక్కనే తనను కూడ చెక్కించు కుంటుంది. తంజావూరికి రాయలసీమకు మధ్య కళా సాంస్కృతిక వారధి పద్మసాని. దేవదాసీలు చెరువులు తవ్వించడం,తమ అధికారం క్రిందనున్న గ్రామమాన్యంలోని ప్రజల్ని పాలెగాండ్ర కంటే మిన్నగా రక్షించుకోవడం ఇందులో చదవ వచ్చు. కులవ్యవస్థ, వైదిక మతంలోని దురాచారాలనుండి తప్పించుకోడానికి వీరశైవాన్ని, ముస్లిం, క్రైస్తవ మతాలను బడుగులు ఆశ్రయించడాన్ని మనం గమనించ వచ్చు.స్త్రీని ఆటవస్తువుగా,మగవాడి ఆస్తిగానే పరిగణించే ఘట్టాలు కోకొల్లలు. ప్రేమ, కామం, అనుభూతి వంటి అవస్థలను విరివిగా చిత్రించారు రచయిత. నాటి అగ్రహారాల లోని భయంకరమైన కట్టుబాట్లను, దురంతాలను నాగప్పప్రెగడ ద్వారా తెలుసుకోవచ్చు. అన్న చనిపోగానే ఆస్తికోసం వదినను వశపరచుకుంటాడు.

ఈడేరని ఆమె కుమార్తె విధవ అయితే బలవంతాన సహగమనం చేయిస్తాడు. సహగమనం ఎంత హృదయవిదారకమో ఓ చలన చిత్రంలా ఈ నవలలో చదవవచ్చు. పిల్లలు లేని కాపు ఇల్లాళ్ళను పంచరాత్ర పూజపేరున కోవెలలో వశపరచుకొని నాగప్పప్రెగడ అనుభవించడాన్ని చూడొచ్చు. ఆమెను వశం చేసుకోడానికి కుంతి, మాద్రి కుమారుల్ని కనడం, వ్యాసునికి కౌరవులు పుట్టే చరిత్రను పౌరాణిక ఫక్కికలో చెబుతాడు. గణ దేశాధీశ్వరులే పాండవుల పుట్టుకకు కారణమన్న పర్వ నవలలోని చారిత్రకాంశాలు ఇక్కడ గుర్తుకొచ్చాయి. వెలివాడలో నున్న మాదిగలను, మాలలను శాశ్వత బానిసలుగా చేసుకొని ఒక పాలెగాని స్థాయిలో అధికార దర్పాలను, భోగాలను అను భవిస్తాడు. ఆగ్రహార యజమానికి రాజ్యాధికారం కంటే అధికమైన అధికారా లుంటాయని రచయిత కంఠోక్తిగానే చెబుతాడు. తెలుగు నేలంతా విస్తరించిన అగ్రహారాలలో ఇంత ఘోరాలు జరుగుతుండేవా? అని ఆశ్చర్య పోతాం.రాత్రి వేళ నీటికోసం చెరువు కట్ట తెగ్గొట్టడానికి వచ్చిన దొంగల్ని గొర్రెల మంద కాస్తున్న కురవ యువకుడు పట్టుకొని దివాణానికి అప్పగిస్తాడు. నాటి సాహసం కారణంగా ఆ నూనూగు మీసాల కురవడు ఎల్లప్ప జెట్టిగా,అమర నాయకుడిగా మారి అనంతపురం హుండేవారి దివాణానికి కంటికి రెప్ప అవుతాడు.అదే దివాణం బీగాలు గుత్తి నవాబుకు స్వాధీనం కాకూడదని మొక్కుకొని శ్రీశైలం మల్లన్న సన్నిధిలో వీరమంటపం ఎక్కి శరీరాన్ని ముక్కలుగా అర్పించు కుంటాడు నడివయసులో. నీటి కోసం ప్రారంభమైన కథ నీటికోసమే అంతమౌతుంది.‘ కరువు కాటకాలూ,పాలెగార్ల కొనసాగింపే కదా ఇప్పటికీ ఈ శప్త భూమి గాథ’.అంటూ ముగిస్తాడు రచయిత. టైం మిషన్ నుండి బయట పడి ఓ నిట్టూర్పు విడుస్తాం

మనం జాలిగా!

ఈ నవల కోసం రచయిత ఎంతోమంది మేధావులను, ఎన్నో గ్రంథాలను పరామర్శించారు.అందులో ఆముక్త మాల్యద ఉండడం నన్నానంద పరిచింది.విష్ణుచిత్తుడి ఇంట్లో వేసవి,వర్ష,శీతకాలాలలో ఆయా కాలాలకు అనుగుణమైన భోజనాలు అతిథులకు పెడతాడని రాయలవారు ‘గగనము నీటి బుగ్గకెనగా ..’ అనే పద్యంతో ప్రారంభించి ఋతువుకు ఒక పద్యం వంతున మూడు పద్యాలలో (ఆముక్తమాల్యద 1ఆ80,81,82) రాశారు. అది ద్రవిడదేశం. అయినా రాయలవారు రాశారుకదా!అందుకని నవలా కాలానికంటే రెండున్నర శతాబ్దాల క్రిందటి వంటకాలను నారాయణస్వామి వాడుకొన్నారు.‘వానాకాలం వస్తే కలమాన్నమూ,ఒలిచిన పప్పు, నాలుగైదు పొగసిన కూరలు,వరుగులు,పెరుగు వడియాలు,నెయ్యి అతని భోజనం.వేసవి కాలంలో నులివెచ్చని అన్నము,తియ్యని చారులు,మజ్జిగ పులుసు,చెరకు పాలు,అతిరసములు,వడపిందెల యూరగాయ అతని భోజనం.చలికాలంలో పుణుకు బియ్యపు అన్నం, మిరియపు పొడుల ఉడుకు కూరలు, ముక్కుకు ఎక్కు ఘాటు పచ్చళ్ళు, పాయసాన్నములూ,ఉడుకు నెయ్యి అతని భోజనం.”శప్తభూమి పుట119.ఇంకా రాయలవారి ‘తారుణ్యాతిగ చూత నూత్న’ఆము2ఆ68వ పద్యం లోని విషయాన్ని ‘ఆ దినం చేప తునకలలో మామిడి కాయ ముక్కలు వేసి తాళింపు చేసిన భోజనము ముందు కూర్చున్నాడు.తిన్నాడు.

’ కాసేటి తరువాత ‘ భోజనం గొంతు దిగలేదు.ఒడలంతా చమటలు పడుతూ ఉంది. తడిసిన ఇసుకలో పూడ్చిన టెంకాయ నీరు తాగి పైకి లేచినాడు’శప్త132.గా వాడుకున్నారు. అసిమి సంచిశప్త218పుట,ఆముక్తమాల్యదలోని ఇలాంటి వస్తువుల్ని, పదాల్ని ఇందులో చాలా చూడవచ్చు.‘ఉన్నది ఒక్కటే..రెండులేవు’అంటూ తిరుగుతూ ‘నిన్ను నీవు తెలుసుకో.దేవుడు లేడు,జీవుడే తప్ప’ అనే సిసలు యోగి తిక్కస్వామి, “ చెప్పురా కాఫర్! దేవుడు ఉన్నాడని చెప్పు!!” అని పఠాణీకుడు రక్తం కారేట్టు కొట్టినా చలించడు.మతవాదులకు ప్రతినిధి పఠాణీ. శివుడికి ఆత్మార్పణ చేసుకున్నా ప్రకృతి వర్షించలేదని చెప్పడం ద్వారా రాయలసీమ దుర్భర నీటి పరిస్థితులు ఒక పక్క ప్రస్ఫుటం అవుతుంటే, ప్రకృతిశక్తికి మించిన దైవశక్తి ఏదీ లేదని, దేవుడి పేరన జరిపే కర్మకాండ అంతా డొల్ల అని రచయిత స్పష్టం చేసినట్టైంది.తెలంగాణ ఏర్పడిన తరువాత అక్కడి అస్తిత్వ వాదాన్ని రాయలసీమ సొంతం చేసుకున్న దన్నది నిజం.ఇంతవరకూ తెలుగు విమర్శకులకు పేరొందిన రామలసీమ నుండి ప్రాంతీయాభిమానంతో కూడిన కథలు, నవలలు ఇతోధికంగా వస్తున్నాయి.ఆ ఉరవడిలో వచ్చిన గొప్పనవలే శప్తభూమి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News