Tuesday, January 7, 2025

పెట్టుబడులతో రండి

- Advertisement -
- Advertisement -

విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి సిఎం రేవంత్‌రెడ్డి పిలుపు

ప్రపంచంలో అత్యున్నత నగరంగా
ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం
తెలంగాణ రైజింగ్ నినాదంతో
విజన్ 2050 ఎన్ని రంగాల్లో
రాణించినా మాతృభాషను
మర్చిపోవద్దు తెలుగు రాష్ట్రాలు
అభివృద్ధిలో ప్రపంచంతో
పోటీపడాలి ప్రభుత్వ జిఓలు
తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం
జాతీయ రాజకీయాల్లో
తెలుగువారి పాత్ర సన్నగిల్లింది
ప్రపంచ తెలుగు మహాసభల
ముగింపు సమావేశంలో సిఎం
వ్యాఖ్యలు నా ఉన్నతికి తెలుగు
వెలుగే కారణం: మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో ముం దుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూ చర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. విదేశాలకు వెళ్లిన తెలుగువారంతా ఒకే వేదిక మీదకు రావడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నా రు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా 3 రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి సీఎం ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైందని,ఈ మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉం దన్నారు.

దేశంలోనే హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అన్నారు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు,ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని, కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గిందని అన్నారు. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దని కోరారు. పరభాషా జ్ఞానం సంపాదించాలి కానీ మన భాషను గౌరవించాలన్నారు. తెలు గు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్ర భుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయ త్నం చేస్తున్నామన్నారు.

తాను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు తనను కలిశారని, వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు. విదేశాలకు వెళ్లిన వారికి తెలుగుతో అనుబంధం తగ్గిపోతోందని, నాలెడ్జ్ కోసం ఏ భాష నేర్చుకున్నా తెలుగును తక్కువ చేయవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని, నగరాభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసి సాంకేతిక నైపుణ్యాన్ని అందించారని, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కంప్యూట ర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు.

ఐటీని వే గంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతమంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృ ద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలు కల్పిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధిపథం వైపు నడిచేందుకు ఉపయోగపడుతోంది. అందుకు కొనసాగింపుగా వైఎస్‌ఆర్, చంద్రబాబు హయాంలో ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులతో మరింత ముందుకు తీసుకెళ్లారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని 30వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఈ అభివృద్ధిలో అక్కడి తెలుగువారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆకాంక్షించారు. విడిపోయి పోటీపడేకన్నా కలిసి అభివృద్ధిలో రాణిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కలిసిచర్చించుకుని పరిష్కరించుకుందామన్నారు.

జాతీయ రాజకీయాల్లో తగ్గిన తెలుగువారి పాత్ర

తెలంగాణ ఆదాయంలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోంది. అందుకు కారణం ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలన్నారు. దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు ఎంతో కీలకంగా వ్యవహరించారని, ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించారన్నారు. రెండు, మూడు తరాలకు మధ్య చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్ ప్రభావం చూపించినా ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందన్నారు.

సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ, ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డి రాణించిన సందర్భాల నుంచి చట్టసభల్లో ఎవరైనా తెలుగు వారు మాట్లాడుతారా చూద్దామని ఎదురుచూసే పరిస్థితి నెలకొందని చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్‌లో 35 శాతం మన హైదరాబాద్ నుంచి తెలుగువాళ్లే ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది మనందరికీ గర్వకారణమని రేవంత్‌రెడ్డి అన్నారు. మనమేంటే కరోనా సమయంలో ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్ ప్రపంచానికే అందించగలిగామని చెప్పారు. కొన్ని రంగాల్లో ఉనికిని కోల్పోతున్నామని అప్పుడప్పుడు అనిపిస్తుందని, సినిమా రంగంలో మాత్రం తెలుగు వారు హాలీవుడ్‌తో పోటీపడుతున్నారని, దేశంలోనే వారు ఆదర్శంగా నిలబడుతున్నారని కొనియాడారు. రాజకీయాలు కానీ, ఆర్థిక రంగంలో కానీ, ఏ రంగంలో నైనా రాణించడానికి ఏ భాషనైనా నేర్చుకోండి..కానీ ఇంట్లో తెలుగు భాషను మాట్లాడుతూ మన భాషను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

తెలుగు భాషకు తమ ప్రభుత్వ పరిపాలనలో అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో రైతు రుణమాఫీ జీఓను తెలుగులోనే ఇచ్చామని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని శాఖలను కూడా తెలుగులోనే పాలనాపరమైన ప్రత్యుత్తరాలు కొనసాగేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులోనే రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇక్కడ వక్తలు ఎంతోమంది ప్రాథమిక విద్యలో బాలశిక్ష ప్రవేశ పెట్టాలని కోరారని, ఈ అంశాన్ని తప్పకుండా తాను విద్యా కమిషన్‌తో చర్చించి పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలుగువారు అన్ని రంగాల్లో రాణించడం చాలా ఆనందదాయకమన్నారు.

ఒకప్పుడు మళయాళీలు ఎక్కడికెళ్లినా ఉండేవారని చెప్పుకునేవారని, చివరకు హిమాలయాలకు వెళ్లినా అక్కడ వారు టీకొట్టు నడిపేవారని చెప్పుకునేవారమన్నారు. ఇప్పుడు తెలుగువారు వారిని అధిగమించారని అన్నారు. ముఖ్యమంత్రిగా తాను అమెరికా సిలికాన్ వెళ్లినపుడు తెలుగువారిని చూసి ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని చూసి గొప్ప అనుభూతి పొందానని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మనవారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో గుజరాత్, వెస్‌బెంగాల్, మహారాష్ట్ర ప్రచారానికి తెలుగువారు ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి వెళ్లాలనని చెప్పారు. ఈవేదిక మీద నుంచి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తున్నానని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నలక్షంతో మెట్రో విస్తరణ, పలు విమానాశ్రాయాలు,వాటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.

నా ఉన్నతికి తెలుగు వెలుగే కారణం : ముప్పవరపు వెంకయ్యనాయుడు

తెలుగు భాషకు మనమంతా వారసులమని..దానిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన మాతృభాషను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారని ఆయన ప్రశ్నించారు. మాతృభాషలో మాట్లాడడం అందరికీ అలవాటుగా మారాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. తన ఉన్నతికి తెలుగు వెలుగే కారణమన్నారు. దేశంలో గొప్ప పదవుల్లో ఉన్నవారంతా మాతృభాషలో చదువుకున్నవారేనని చెప్పారు.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఈ సభలను అమెరికాలో ప్రారంభించారు. ఆనాటి సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. దేశ విదేశాల్లో తెలుగువారిని ఒకే వేదికపై తీసుకురావడం హర్షణీయం. కళారూపాలు సామాజిక పునాదులుగా నిలుస్తాయి. కళలు ప్రజలను కార్యోన్ముఖులను చేస్తాయి. వాటిని ముందు తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనదే. ప్రతి భాషకు ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు మరింత విలక్షణమైంది. అలంకారాలు తెలుగు భాషకు ఎంతో అందాన్ని తెచ్చాయి. జీవిత అర్థాన్ని తెలిపే ఎన్నో సామెతలు తెలుగులో ఉన్నాయి. మాతృభాష..మన సంస్కృతిని తనలో ఇముడ్చుకుంది. 2012లో ప్రపంచంలో రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచింది. మనదేశంలో 450 భాషలు ఉన్నాయి.

ఇంగ్లీష్‌పై వ్యామోహంతో కొన్ని భాషలు అంతరించిపోతున్నాయి. భాష ఆగిపోతే.. శ్వాస ఆగిపోయినట్లే. మాతృభాష మర్చిపోతే.. మాతృబంధం విడిచిపోయినట్టే. మన వేషభాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలని, ప్రాథమిక విద్యను తెలుగు భాషలో అందించాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ముగింపుసభలో సినీ ప్రముఖులు జయప్రద, జయ సుధ, అశ్వనీదత్, మురళీమోహన్‌తో పాటు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వాహకురాలు ఇందిరాదత్ కృషిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. కవితా దత్ వందన సమర్పణతో మూడు రోజుల పాటు జరిగిన మహాసభలు ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News