Saturday, December 21, 2024

అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగు వైద్యుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ఓ తెలుగు వైద్యుడు దుండగుల కాల్పులకు బలయ్యారు. శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన పేరెంశెట్టి రమేశ్‌బాబు అక్కడ దుండగుల కాల్పుల్లో స్పాట్‌లోనే మృతి చెందారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో తెలియలేదని ఆయన స్నేహితులు వెల్లడించారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైద్యుడు రమేశ్‌బాబు అమెరికాలో పలు చోట్ల ఆస్పత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించడమే కాక పలు రకాలుగా సేవలందించారు. టస్కలూసా ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకున్న రమేశ్‌బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరు కూడా పెట్టారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు ఆయన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. రమేశ్‌బాబు తిరుపతి ఎస్వీ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు.

జమైకాలో ఎమ్మెస్ పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా డాక్టరే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం మొత్తం అగ్రరాజ్యంలోనే స్థిరపడ్డారు. కరోనా సమయంలో రమేశ్‌బాబు విశేష సేవలందించి పలు పురస్కారాలను సైతం అందు కున్నారు. రమేశ్‌బాబు తాను చదువు కున్న ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళం అందించారు. అలాగే, స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు ఇచ్చారు. ఈ నెల 15న నాయుడుపేటలోని బంధువుల వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్తతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన తల్లి, తమ్ముడు తిరుపతిలో, సోదరి నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News