Friday, November 8, 2024

జాతి గర్వించదగ్గ మహాకవి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రసిద్ధి కొఱకు రక్తమ్ము గార్చిన
కవిని నేను గాంధికవిని నేను
బడలి బడలి తల్లిబాస కూడెము సేయు
కవిని నేను దేశికవిని నేను.
‘సర్వతంత్ర స్వతంత్రుడౌ సత్కవీంద్రు డెన్నడో కల్పమున కొక్కడే లభించు’- తెను గులెంక, అభినవ తిక్కన, గాంధి ఆస్థానకవియైన తుమ్మల సీతారామమూర్తి గారు తెలుగు జాతికి, సాహిత్యమునకు 20వ శతాబ్దము నందు లభించిన అపూర్వమైన కానుక. వారు కవితా హిమాలయము. పాండితీ మేరునగము. వారు ప్రతిభావంతులే గాదు, వ్యుత్పన్సులు కూడ. వారు ఆకారములో ఆంధ్రుడు ధర్మములో భారతీయుడు భావములో విశ్వమానవుడు. వారు ధర్మ సంరక్షణార్ధము కవితలల్లిన ఋషితుల్యులు. వారు ప్రాత క్రొత్తల మేలు కలయిక. ఆధునికాంధ్ర సాహితీ జగత్తులో వారు యుగ ధర్మమును గుర్తించి, స్వతంత్ర మార్గమున పయనించి, యుగ కవితను సృష్టించిన యుగకవులు. వారి కవితలో యుగధర్మమును విశ్వరూపమున గాంచగలము. వారు కవిత్వమును సమాజ సేవా సాధనముగా భావించి, “సామాజిక కళ్యాణము కామించెద నవ్య భవ్య కవితా
ఈ మేనెంత నలంగిన
నా మనుగడ లోక సేవనమ్మున కిడెదన్
సామాజిక కల్యాణము
కామించెద నవ్యభవ్య కవితా సృష్టిన్.
సృష్టిన్‌” అని ప్రకటించి, వారు రాజకీయ, మత, సాంఘిక, ఆర్ధిక, నైతిక విలువల పరిరక్షణ కొరకు చైతన్యవంతమైన కవితను సృజించిన సాహితీ ప్రవక్తలు. వారు ఆంధ్రావళి మోదము కొరకు జగద్దితమైన కవితను కళాన్వితముగ గానము చేసినారు. వారి కవిత వ్యవస్థలన్నింటికీ సంగమ స్థలము, సమ ధర్మము సహజ ధర్మమని నమ్మి, సమకాలీన సమస్యలను స్వీకరించి, వాటికి పరిష్కార మార్గములను సూచించుటయే గాక, సార్వకాలీనత నిచ్చినారు. వారి కవితాశయము ఆంధ్రుల అభ్యుదయము, భారతీయుల ప్రగతి, సమగ్రతలు, మానవ జాతి కల్యాణము. సం-ప్రదాయము, సర్వోదయము, సార్వజనీనత, సౌందర్యము, సౌలభ్యములు వారి కవితా లక్షణములు. వారి కవితకు గాంధిధర్మము పట్టుగొమ్మ, గాంధేయ సిద్ధాంతములు భారతీయ ధర్మస్వరూపములని, సర్వోదయ సిద్ధాంతములు విశ్వమానవ కల్యాణ కారకములని వారు విశ్వసించినారు.
కళ కొఱకే కవిత్వమని గంతులు వేయక, రోతరోతగా / వలపులు నింపి కబ్బములు వ్రాయక, విశ్వజనీన బోద్ధృతా /లలిత ముదారవృత్తము కలాకమనీయము సంస్కృతి ప్రభా / మిళితమునైన సృష్టి నెద మెచ్చితి జాతికి కాన్కలిచ్చితిన్.
వారి రచనలు సత్యం శివం సుందరం అను ధర్మములకు నెలవులు. వారి కవితలో మానవతా పరిమళములు వెదజల్లు విశ్వ సంస్కృతి కలదు. అది మానవుని సంస్కారవంతునిగా జేసి, సమాజమును ఉన్నతీకరించును. వారి కవితలో జాతి జీవనము సర్వతోముఖముగ ప్రతిబింబించుచుండును. వారి ప్రతి పద్యము నందు సాంఘిక స్పృహ కలదు. అంతేగాదు తెలుగు కవితా సొగసుల పరిమళములు గుబాళించు చుండును. వారి కవిత వంద సం॥ల భారతదేశ చరిత్రకు దర్పణము. వారు జన్మించినది 1901- మరణించినది 1990. అందువలన వారి కావ్యములు ఆంధ్రుల, భారతీయుల నవయుగ హృదయ స్పందనలకు రమణీయమైన అక్షర రూపములు. నవీనాంధ్ర సాహిత్య చరిత్రలో 20వ శతాబ్దమును ‘తుమ్మల యుగము’ అని పేర్కొనవచ్చును. వారి కవిత పాఠకులకు భావప్రసన్నతను, హృదయ వికాసమును ఆనందపారవశ్యమును, మానసిక ప్రశాంతతను కలిగించును. త్యాగరాజు సంగీతము, తమ్మల సాహిత్యము ఒకే కోవకు చెందినది. అనగా అవి వినినకొలది ఇంకను వినవలెననియు, చదివినకొలది మరల మరల చదువవలెననియు అనిపించును. అవే నిజమైన కళలుబీ అజరామరమైనవి. వారిద్దరి సంగీత సాహిత్యములు రసికలోకపు తఱుగని సిరులు.
తుమ్మలవారు కవిగా ఎంత ఉన్నతులో, వ్యక్తిగా అంతకంటే ఉన్నతులు. వారి జీవితమే ఒక సందేశమ. -వారు జీవించిన కాలమునందు జీవించుటే మహాభాగ్యమని సమకాలికులు భావించిరనిన అతిశయోక్తి గాదు. విశ్వజనీనమైన యుగకవితను సృష్టించిన, ఆదర్శవంతమైన జీవితమును గడపిన మహాకవి 20 వ శతాబ్దము నందు తుమ్మలవారు గాక మరొకరు లేరనుట తెగువ గాదు. ‘తుమ్మలవారు’ నా అమూల్య సంపద, నా గౌరవ పతాక’ అని జాతి గర్వించదగిన విశిష్టమైన మహాకవులు, ‘తుమ్మల 20వ శతాబ్ది యుగకవి 21వ శతాబ్దం యుగకర్త’.

గుంటూరు కల్యాణి
9573858063

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News