Sunday, September 8, 2024

ఎపి, తెలంగాణ సిఎస్ ల భేటీ

- Advertisement -
- Advertisement -

9, 10 షెడ్యూల్ సంస్థలపైనే చర్చ
చర్చల సారాంశాన్ని సిఎంల దృష్టికి తీసుకెళ్లి
మరోసారి భేటీ కావాలని నిర్ణయం

Bifurcation

 

మనతెలంగాణ/హైదరాబాద్:  విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల అధికారులు గురువారం సమావేశమయ్యారు. నగరంలోని బిఆర్‌కే భవన్‌లో తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్, ఎపి సిఎస్ నీలం సాహ్ని భేటీ అయ్యారు. తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు సమావేశమయ్యారు. ఈనెల 13వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్ర శేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు 9, 10 షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు రాష్ట్రాల సిఎస్‌లు హైదరాబాద్‌లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గురువారం జరిగిన భేటీలో 9,10 షెడ్యూల్ కింద ఉన్న సంస్థలు, ఉద్యోగులు, ఆస్తులకు సంబంధించిన వాటిపై చర్చించినట్టుగా తెలిసింది. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎపి, తెలంగాణలకు చెందాల్సిన ఆస్తులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై సానుకూల పద్ధతిలో సిఎస్‌లు సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది. అవసరమైతే మరోసారి చర్చలు జరపాలని కూడా ఇరు రాష్ట్రాల సిఎస్‌లు నిర్ణయించినట్టుగా తెలిసింది. గురువారం చర్చించిన విషయాలను ఇరు రాష్ట్రాల సిఎంల దృష్టికి తీసుకెళ్లి మరోసారి భేటీ అయి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సిఎస్‌లు చర్చించినట్టుగా తెలుస్తోంది.

29 శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమై నివేదిక తయారు

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 9,10 షెడ్యూల్ సంస్థల విషయంలో విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని గతంలో ఇరురాష్ట్రాల సిఎంలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో దీనిపై సమగ్రంగా చర్చించి పూర్తి స్థాయి నివేదికను తయారు చేసింది. గతంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో 9,10 షెడ్యూళ్లకు సంబంధించి 29 శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమై పూర్తి స్థాయి నివేదికను తయారుచేశారు. ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనతో పాటు బకాయిలు, ఆదాయాల పంపకాలకు సంబంధించిన తదితర సమస్యలకు సంబంధించి ఈ నివేదికలో రాజీవ్‌శర్మ పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఎపి భవన్ ఆస్తుల విభజన, ఇతర నిధుల పంపకాల విషయంలో కొంత సందిగ్ధత నెలకొనడంతో వాటిని సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సిఎస్‌లు నిర్ణయించినట్టుగా సమాచారం.

9వ షెడ్యూల్‌లో 91 సంస్థలు ఉండగా, 10 షెడ్యూల్‌లో 142 విశ్వ విద్యాలయాలు

గతంలో 9,10 షెడ్యూల్ సంస్థలకు సంబంధించి షీలాభిడే కమిటీ చేసిన ప్రతిపాదనలపై గతంలో ఇరు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదో షెడ్యూల్‌లో ఉన్న హెడ్ క్వార్టర్ అంశంపై వివాదం నెలకొనగా, ఈ రెండు షెడ్యూల్‌లోని సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలిసింది. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎపి అధికారులు కొన్ని ఆస్తులపై మెట్టుదిగక పోవడంతో సుహృద్భావ వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలు ఉండగా, 10 షెడ్యూల్‌లో 142 విశ్వ విద్యాలయాలు, విద్య, శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి జరిగే భేటీలో ఈ షెడ్యూల్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల సిఎస్‌లు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇరు రాష్ట్రాల విభజన వ్యవహారాల కార్యదర్శులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు, ఐఎఎస్ (ఫైనాన్స్), ఎల్.ప్రెంచంద్ర రెడ్డి, IAS (రిటైర్డ్) తదితరులు పాల్గొన్నారు.

 

Telugu States CS Meeting on Bifurcation Issues
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News