Sunday, December 22, 2024

కులం పెనం నుంచి మతం పొయ్యిలోకి

- Advertisement -
- Advertisement -

సిక్కులలో, ముస్లింలలోవుండే సోదర భావం హిందువులలో అసాధ్యం. ఎందుకంటే కులాలు అటువంటి మతపర సోదర భావాన్ని అసాధ్యం చేస్తాయి అంటాడు అంబేడ్కర్ (అనిహిలేషన్ ఆఫ్ కేస్ట్). కుల ఐక్యత లాగే మత ఐక్యత కూడా సెక్టేరియన్, అది సర్వ సమానత్వం ఏమీ కాదు. మతపర సమానత్వం పెద్ద సమూహం ఆవిర్భావానికి కారణమవుతుంది. అలాగే ఆ సమూహాన్నిమరింత విస్తరించుకోవడానికి ఆస్కారం యిస్తుంది. అది మత జాతీయతకి దారి తీస్తుంది. అంతేకాని సంకుచితత్వానికి ఇతరుల పట్ల ద్వేషానికి అది ముగింపు ఏమీ కాదు. నిజానికి అంబేడ్కర్ కూడా అటువంటి సర్వ సమానత్వం గురించి మాట్లాడలేదు. జాతీయత గురించి మాట్లాడాడు. ముస్లిం జాతీయత లాగే హిందూ జాతీయత సాధ్యం కాకపోవడానికి చింతించాడు. దానికి కుల వ్యవస్థ కారణం అన్నారు.

ఈ హిందూ జాతీయతా దృష్టితోనే హిందువులు చరిత్రలో నిరంతరం ఓటమికి గురికావడానికి, హిందువులలోని కులపరమైన అనైక్యత కారణం అన్నాడు. ఆసియాలో ఒక జాతిగా రూపొందిన బౌద్ధమతంలోకి మారాడు. అంబేడ్కర్ కూడా హిందూ జాతీయ తర్కాన్నే ఆశ్రయించాడు. హిందూ జాతీయత అసాధ్యం అని అంబేడ్కర్ అన్నాడు. సాధ్యమే అని హిందూవాదులు అన్నారు. అంబేడ్కర్, హిందూవాదులు ఇద్దరూ హిందూ జాతీయత, ఆవశ్యకతను గుర్తించారు. ఆధునిక సమానత్వ భావన ఇలా జాతీయవాదంతో మిళితమైపోవడం నిజమైన సమానత్వానికి దారికాకపోవడమే కాదు రాజ్య నియంతృత్వానికి రహదారి.అలాగే బహుళత్వానికి ముప్పు. ఎంతగా హిందూ జాతీయవాద ముసుగులో ఫాసిజం చొచ్చుకురావడానికి ప్రయత్నించినా అనేక మత రాజ్యాల మధ్య భారత దేశం ‘మతాతీతం’గా నిలిచింది.

కనీసం ప్రత్యక్షంగా రాజ్యంతో మతాన్ని ముడివేయడం సాధ్యం కాలేదు.రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చవలసి వచ్చింది. దీనికి కారణం భారత ఖండంలో కులం వుంది కాని మతం లేదు. కులం కూడా వ్యవస్థీకృతం కాదు. బ్రిటీష్ వాళ్ళ డాక్యుమెంటేషన్ తర్వాత కులం కూడా ఘనీభవించింది. ఈ డాక్యుమెంటేషన్ వివిధ అస్తిత్వాలు ఒక దానిలో మరొకటి కలిసిపోకుండా గోడకట్టింది. కృత్రిమ స్థిర అస్తిత్వాలని సృష్టించింది జనాభా గణన డాక్యుమెంటేషన్. నిజానికి భారత సంస్కృతి నుంచి, పేగన్ కల్చర్ నుంచి దూరం గా వుండాలనే ఇంగ్లీషు వాడి పరాయీకరణ భావం నుంచి భారత దేశపు సెక్యులరిజం ఆవిర్భవించింది అంటాడు న్యాయవేత్త అభినవ చంద్రచడూ (రిపబ్లిక్ ఆఫ్ రెలిజియన్). నిజానికి ఇంగ్లండులో ఇటీవల వరకు ప్రొటెస్టంటు మత రాజ్యమే కొనసాగింది. ఇతర మతాలకి ప్రచార హక్కు లేదు. దైవ నిందకి శిక్ష వుండేది. దైవ నింద అంటే క్రైస్తవ నిందే. ఇతర మతాలకి ఈ చట్టం వర్తించదు.

ఇంతగా మతపరమైన సంస్కృతి నుంచి వచ్చిన ఆంగ్లేయులపై మిషనరీల పట్టు కొనసాగింది. అందువల్ల ఇక్కడ ఇండియన్ కల్చర్స్ పట్ల దూరంగా వున్నారు. అంటే వాళ్ళని వారి వారి పర్సనల్ రెలిజియస్ చట్టాలకి వదిలిపెట్టారు. ఆ చట్టాలని గ్రంథాల అనువాదాల ద్వారా ప్రవేశపెట్టారు. సంస్కృత ధర్మశాస్త్ర గ్రంథాలని అనువదించడం ద్వారా ‘హిందూ లా’ ని సృష్టించారు. ఇందుకోసం బ్రాహ్మణ పండితులపై ఆధారపడ్డారు. గ్రామాలు, గూడాలలోని మౌఖిక చట్టాలని పట్టించుకోలేదు. ఇక్కడ ‘గ్రంథం’ పట్ల బ్రిటిష్ వారు ఆసక్తి కనబరచారు. వారు రెలిజియన్ ఆఫ్ బుక్‌కి చెందిన వారు మరి. (హిందూ సామ్రాజ్యవాద చరిత్ర స్వామి ధర్మతీర్థ) అయితే అంబేడ్కర్ కూడా బ్రిటిష్ తర్కానికి లోబడి మనుస్మృతిని హిందూ మతానికి పర్యాయపదంగా మార్చాడు. మనుస్మృతి దహనం హిందూమత దహనంగా భావించాడు.

బ్రిటిష్ వారి ప్రభావం వల్ల సంస్కృతి, మతం,ధర్మాలకి గ్రంథం పర్యాయ పదంగా మారింది. మౌఖిక సంస్కృతులు గుర్తింపు కోల్పోయాయి. దీనివల్ల సెక్యులరిజం పేరుతో పరోక్షంగా మత ప్రమేయం ప్రారంభమైంది. దళితుల్ని, గిరిజనుల్ని, అందర్నీ హిందూ ఐడెంటిటీలో భాగం చేసింది. రాజ్యాంగం. రిజర్వేషన్లు, ప్రత్యేక సౌకర్యాలు కులంతో కాదు మతంతోనే ముడివేయబడ్డాయి. హిందువులకే రిజర్వేషన్లు వర్తిస్తాయి.

దేశ విభజన వల్ల వచ్చిన అసమ్మతిని నిమ్మదింప చేయడం కోసం కావచ్చు స్వాతంత్య్రానికి ముందు వున్న మతపర నియోజక వర్గాలని ముస్లింలు వదులుకొన్నారు. కాని దళితులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. ఈ రిజర్వేషన్ సౌకర్యం ‘హిందూ’ అస్తిత్వంతో ముడిపడింది. మతాంతరీకరణ చెందనంత వరకే రిజర్వేషన్ సౌకర్యంవర్తిస్తుంది. అంబేడ్కర్ బౌద్ధ మతం స్వీకరించడం ద్వారా తనతో పాటు మతాంతరీకరణ చెందే దళితులకి రిజర్వేషన్ సౌకర్యాన్ని తిరస్కరించినట్లైంది. నవబౌద్ధులకి కూడా రిజర్వేషన్ సౌకర్యం వర్తించేలా కృషి చేస్తానని అంబేడ్కర్ అన్నాడు. అంబేడ్కర్ మరణానంతరం బౌద్ధులకి, సిక్కులకు కూడా ఎస్‌స్ రిజర్వేషన్ ఉద్ధరించబడింది. అంటే హిందూ దళితులతో పాటు బౌద్ధ, సిక్కు దళితులకీ రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుంది. కాని అతి పెద్ద మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవ దళితులకి ఈ సౌకర్యం కల్పించబడలేదు.

బౌద్ధ స్థానికమూ హిందూ మతంతో పోలిక కలిగినది కావడం వల్ల అంబేడ్కర్ ఆ మతంలోకి వెళ్ళాడు అని కొందరు వాదిస్తారు. దానితో నిజం వున్నా లేకపోయినా ఫలితం మాత్రం ‘హిందూ’ ఐడెంటిటీ ఉద్ధరణకి ఉపయోగించింది. అసలు హిందూ అంటే ఏమిటి? హిందూ మతం అంటే ఏమిటి? హిందువు అంటే ఎవరు? ఈ ప్రశ్నలకి ‘హిందూత్వ’ సృష్టికర్త సావర్కర్ ఇచ్చిన నిర్వచనం చివరికి విజయం సాధించింది. ముఖ్యంగా ముస్లింలకి (కొంతవరకు క్రైస్తవులకి) భిన్నమైన వాళ్ళే హిందువులు. జైన, బౌద్ధ, సిక్కు మతస్థులు కూడా ‘హిందూ’ ఐడెంటిటీలో భాగమే.

ఎందుకంటే వారి పుణ్యభూమి భారతమే. అందుకే గుజరాత్ హిందూ ప్రభుత్వం ఇటీవల మతాంతరీకరణకి అనుమతించిన వారు బౌద్ధులు మాత్రమేనని ఆకార్ పటేల్ రాశారు. (మన హైందవ రాజ్యం ఆకార్ పటేల్) అంటే రాజ్యాంగం మత ప్రమేయం లేనిదిగా కనిపిస్తున్నా, మతం ముసుగులో రాజ్యంలోకి చొరబడి పోయింది. బహుళత్వం, పేగనిజంలని ఆరాధిస్తున్నట్లు కనబడిన సావిత్రీదేవి ‘ముస్లిం అదర్’ని సృష్టించింది. అలాగే బహుజన హితం పేరుతోనే ఏకశిలా సదృశ మత అస్తిత్వం (హిందుత్వ) బలపడ్తోంది. కొందరు నన్ను అడుగుతుంటారు. ఇప్పటికీ బహు దేవతారాధన వుంది. బహుళ సంస్కృతులు వున్నాయి. సంస్కృతి మోనోపలికి దారి తీస్తోంది అనే వాదనలో వాస్తవం ఎంత? ఔను.

అవన్నీ పైకి కనిపిస్తున్నాయి. కాని అవన్నీ ఒకే మూసలోకి వొదిగిపోతున్నాయి. అదే హిందూత్వ. ఒకే దేవుడు రాముడు, ఒకే పుణ్య స్థలం ప్రార్థనా స్థలం అయోధ్య. ఒకే గ్రంథం భగవద్గీత, ఒకే పేరు హిందూ. ఇలా క్రైస్తవ మోనోథీయిజపు అనుకరణ యెలాగూ వుంది. దానితో పాటు టెరిటరీ భౌగోళిక సరిహద్దులపైన ఆధారపడిన జాతీయతతో ‘హిందూ’ మతాన్ని ముడిపెట్టి, ముస్లింలని పక్కనపెట్టి ఇతరులందర్నీ గణించే ప్రక్రియ బహుళత్వాన్ని సావర్కార్ హిందుత్వగా మార్చేసింది. దీని ఫలితమా అన్నట్లు యుపిలోనూ ఇతరత్రా చమర్ ఇతర జాటవులు లాంటి దళిత కమ్యూనిటీలు నవయానంతో పాటు హిందుత్వకి దగ్గర జరిగాయి. నిజానికి బాబ్రీ మసీదు స్థలం బౌద్ధులదేననే వాదన ‘హిందుత్వ’లో భాగమే. ఈ విధంగా సావర్కార్, సావిత్రీదేవిల భిన్న మార్గాల ఫాసిజాలు ఏకోన్ముఖంగా పయనిస్తున్నాయి.

మనకి ఒకే మెజారిటీ మతంలేని లోటుని ‘హిందుత్వ’ ఫాసిజం పూరించవచ్చు. మన దేశం కూడా శ్రీలంకలా, బర్మాలా మతరాజ్యంగా మారే ప్రమాదం వున్న మాట నిజం. శ్రీలంకలో, బర్మాలో ఒక వ్యవస్థీకృత మతం వుంది. అది బౌద్ధం. అదృష్టవశాత్తూ అటువంటి వ్యవస్థీకృత మతం మన దేశం నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. కాని కృత్రిమ ఏకీకరణ ద్వారా ‘హిందూ’ ఐడెంటిటీ సృష్టించబడింది. ఇది హైబ్రిడ్ మొక్కలాంటిది. అయితే భారత దేశంలోని ప్రజలలో వున్న నిజమైన బహుళత్వం మత రాజ్యాన్ని నివారించగలదా, లేక పూర్తిగా విఫలమవుతుందా అనేది ప్రశ్న. గాంధీ హత్యానంతరం విడుదల చేసిన ప్రకటనలో గాడ్సే తనకి కుల పట్టింపులు లేవు అని చెప్పాడు. హిందుత్వ సృష్టికర్త సావర్కార్ కుల నిర్మూలనకి కృషి చేస్తానన్నాడు. ‘కుల నిర్మూలన’ పట్ల హిందూవాదులకి చిత్తశుద్ధి వుందా లేదా అనేది వేరే ప్రశ్న.

కుల అస్తిత్వాన్ని మతంతో ముడి వేయడంలో మన రాజ్యాంగ నిర్మాతలతో సహా అందరూ ముందున్నారు. ఒకడు దళితుడా కాదా అనేది అతడు ‘హిందూ’ మతస్థుడా కాదా అనే దానితో ముడిపెట్టారు. క్రమేపీ ముస్లిం, క్రైస్తవుడు కానివాడే దళితుడు. అంటే హిందువే దళితుడు. దళిత అస్తిత్వం పూర్తిగా హిందూ అస్తిత్వంతో అవిభాజ్యంగా మారిపోయింది. మరే సామాజికవర్గ అస్తిత్వం ఇంతగా మతంతో ముడిపడి లేదు. ఒక బ్రాహ్మణుడు హిందువైనా, క్రైస్తవుడైనా బ్రాహ్మణుడే. అలాగే రెడ్డి కూడా. కాని ఒక ఎస్‌సిల, ఎస్‌టిల అస్తిత్వం ‘హిందూ’తో ముడిపడింది. రాజ్యాంగమే ఈ ప్రమాదాన్ని కల్పించింది. అంటే దళితులు హిందువులు కాదు అని కొందరు మేధావులు మాట్లాడ్తారు.

కాని రాజ్యాంగం ప్రకారం దళిత అస్తిత్వం మాత్రమే హిందువు. దళితుడే హిందువు( అందుకే కావచ్చు గుజరాత్ హిందుత్వ వాదులు దళితులని మహా హిందువులు అన్నారు. ఇలా ఒక పెద్ద ప్రజా సమూహం హిందూ ముద్ర కింద పడి నలిగిపోయే ప్రమాదం రాజ్యాంగంలోనే కల్పించబడినపుడు అంబేడ్కర్ ఎందుకు నిరసన తెలుపలేదు? రాజ్యాంగంలో దళితులకి హిందూ మత అస్తిత్వాన్ని బలపరిచి, మనుస్మృతి దహనం వల్ల ఉపయోగం ఏమిటి? బహుశా మనుస్మృతి దహనం ద్వారా ‘అవర్ణు’లైన దళితుల్ని హిందూ అస్తిత్వంలో భాగంచేశారా? రాజ్యాంగం చేసింది అదే కదా? చివరికి నవ బౌద్ధం హిందూ అస్తిత్వంలోకి దారిని సుగమం చేసింది.

రాణి శివశంకర్ శర్మ
7396666942

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News