Wednesday, January 22, 2025

నాజీయిజం చీకట్లో చిరుదీపం

- Advertisement -
- Advertisement -

అన్నేలీస్ మేరీ ఫ్రాంక్ 12.06.1929 న జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఎడిత్, ఒట్టొ హీన్రిచ్ ఫ్రాంక్ దంపతులకు జన్మించారు.ఆమె ఎక్కువగా నెదర్లాండ్స్ రాజధాని ఆంస్టర్డం, దాని చుట్టూ గడిపారు. 1941లో జర్మన్ పౌరసత్వాన్ని కోల్పోయారు. రాజ్యరహితం అయారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులు అనుభవించిన నరకయాతన బాధితులలో ఈమె ఒకరు. అన్నే తండ్రి ఒట్టొ మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడు. తర్వాత జర్మన్ వ్యాపారి. ఫ్రాంక్ దంపతులు పిల్లలను చదువరులుగా ప్రోత్సహించారు.

అడాల్ఫ్ హిట్లర్ 30.01.1933 న జర్మని ఛాన్సలర్ అయారు.ఆనాటి నుండే జనహననం మొదలయింది. 1925 లోనే హిట్లర్ తన మీన్ కాంఫ్ (నా పోరాటం) ఆత్మకథలో యూదు విద్వేష భావజాలాన్ని ప్రకటించారు. ‘చివరి పరిష్కారం’ ప్రణాళిక కింద నాజీలు యూదులనందరిని చంపాలకున్నారు. 60 లక్షల మందిని హతమార్చారు. హిట్లర్ మంత్రివర్గంలో జన జ్ఞానోదయ, ప్రచారాల మంత్రి జోసెఫ్ గోబెల్స్ యూదు మేధావులు రచించిన 25,000 పుస్తకాలను కాల్పించారు. నాజీల యూదు వ్యతిరేక భావజాలం పెరుగుతున్న నేపథ్యం లో 1933లో ఒట్టొ కుటుంబం ఆంస్టర్డంకు మారింది. అక్కడ ఓపెక్ట కంపెని పేరుతో ఒట్టొ జామ్ తయారీలో వాడే సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలు అమ్మారు. 1933 39 మధ్య 3 లక్షల యూదులు జర్మనీని వదిలారు. 1940 మే లో జర్మనీ నెదర్లాండ్స్‌పై దాడి చేసింది. అన్నే ఆమె అక్క మార్గట్‌లను సార్వజనిక పాఠశాలకు రానివ్వలేదు. వాళ్ళు 1941 సెప్టెంబర్‌లో ప్రారంభించిన యూదుల బడిలో చేరారు.

ఒట్టొ 1942లో తన వ్యాపారాన్ని ఇద్దరు డచ్ దేశస్థులకు అప్పజెప్పారు. యూదులయిన ఒట్టొ ఫ్రాంక్ కుటుంబ సభ్యు లు, నాజీలకు పట్టుబడకుండా ఉండటానికి, ఆయన సొంత ఓపెక్ట కంపెనీకి అనుబంధ రహస్య ప్రదేశానికి మారారు. మరొక యూదు కుటుంబం వాన్ పెల్స్, యూదు దంత వైద్యుడు ఫ్రీట్జ్ ఫెఫర్ కూడా తర్వాత వారితో అక్కడ కలిశారు. ఫ్రాంక్ కుటుంబం దాక్కున్న ప్రదేశ ద్వారాన్ని ఒక పుస్తకాల బీరువాతో మూశారు. ఆ సమయంలో నలుగురు ఒట్టొ కంపెనీ సిబ్బంది విక్టర్ కుగ్లర్, జోహాన్స్ క్లీమన్, హెర్మయిన్ మీప్ గీస్, (ఆమె భర్త జాన్), ఎలిసబెత్ బెప్ వొక్సూజిల్, (ఆమె తండ్రి జోహాన్స్ హేండ్రిక్) నాజీల నుండి ప్రాణాలకు తెగించి ఫ్రాంక్ కుటుంబానికి సాయపడ్డారు. ప్రపంచ విషయాలు, రాజకీయ పరిణామాలు తెలిపేవారు. ఆహారం అందించారు. భద్రత కల్పించారు.

నాజీలు ఫ్రాంక్‌ల రహస్య స్థానాన్ని కనిపెట్టారు. 4.8.1944 న ఫ్రాంక్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడ నివసిస్తున్న వారిని అందరినీ నిర్బంధించారు. మొదట నెదర్లాండ్స్‌లోని తాత్కాలిక శిబిరం వెస్టర్ బోర్క్‌కు మార్చారు. తర్వాత నాజీలు ఆక్రమించిన పోలండ్ లోని ఆష్విట్జ్ కేంద్రీకరణ- నిర్మూలన శిబిరంలోకి తరలించారు. అప్పటికే అక్కడ లక్ష మంది జర్మన్, డచ్ యూదులు నిర్బంధంలో ఉన్నారు. రహస్య కేంద్రంలో దొరికిన వారిని నేరస్థులుగా పరిగణించారు. కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష వేశారు. ఆష్విట్జ్ లో 40 ఉప కేంద్రాలు ఉండేవి. వీటిలో ఖైదీలను వెట్టి చాకిరి శ్రామికులుగా వాడుకున్నారు. ఆష్విట్జ్ దక్షిణ పోలండ్‌లోని ఓస్వీసిమ్ నగర శివారులో పారిశ్రామిక పట్టణం. అక్కడ ఆడువారిని, మగవారిని వేరు చేశారు. మొదట అన్నే, ఆమె అక్క మార్గట్, అమ్మ ఎడిత్‌లను ఒకేచోట బంధించి వారితో అతి కష్టమయిన పనులు చేయించారు. వారి బట్టలు ఊడదీశారు. గుండు గీశారు.

ఖైదీ సంఖ్యను చేతిపై టట్టూతో పొడిపించారు. అక్కడ పెట్టే తిండి సరిపోయేది కాదు. ఎడిత్ తాను తిండి మాని ఒక రంధ్రం ద్వారా పిల్లకు అందించేవారు. కొన్ని నెలల తర్వాత పిల్లలను జర్మనీలోని బెర్జన్- బెల్సన్ కేంద్రీకరణ శిబిరానికి మార్చారు. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ టైఫస్ అనే టైఫాయిడ్ వ్యాధితో 1945 ఫిబ్రవరి, మార్చిలలో మరణించారు. 7 వేల ఖైదీలు ఈ వ్యాధి తో చనిపోయారు. ఒట్టొ ఆష్విట్జ్ శిబిరంలోనే ఉన్నారు. ఓపెక్ట రహస్య ప్రదేశంలో ఉన్నవారిలో ఒట్టొ ఒక్కరే బతికారు. యుద్ధం తర్వాత ఆయన ఆంస్టర్డంకు వచ్చారు. భార్య చనిపోయారని దారిలో తెలిసింది. అన్నే, మార్గట్‌లు మరణించారని బెర్జన్- బెల్సన్ శిబిరంలో ఉన్న ఒక మహిళ 1945 జులైలో ఒట్టొకు తెలిపారు.

మరణించే నాటికి అన్నే వయసు 15 ఏళ్ళు. తాము రహస్య ప్రదేశంలో దాచుకోడానికి కొన్ని రోజుల ముందు తన 13 వ పుట్టినరోజు 12.06.1942 న జన్మదిన కానుకగా అన్నేకు ఒక డైరీ లభించింది. అందులో ఆమె 14.06.1942 నుండి దినచర్య రాయడం మొదలుపెట్టారు. 01.08.1944 వరకు తన జీవితం గురించి రాశారు. నాజీ ఆక్రమణ కాల కష్టాల నమోదు కోసం తమ డైరీలను జాగ్రత్తపరచండని మార్చి 1944లో ప్రవాస డచ్ ప్రభుత్వ సభ్యుడు గెరిట్ బోల్కెస్టీన్ లండన్ నుండి రేడియో ప్రసారం చేశారు. దాన్ని విన్న అన్నే తన డైరీని తిరగ రాశారు. ఒక ఆకాశరామన్న మిత్రురాలు కిట్టీని సంబోధిస్తూ ఉత్తరాల రూపంలో ఆమె డైరీ రాశారు. తన కుటుంబ సభ్యుల సంబంధాలను, సన్నిహితత్వాన్ని, విభేదాలను వివరించారు. వాటిని మెరుగు పరుచుకోవాలని ఆకాంక్షించారు.

రహస్య జీవితంలో అక్కాచెల్లెళ్ల మధ్య స్నేహ భావం పెరిగింది. అమ్మ ఎడిత్ పట్ల అసహనం తగ్గి ఓర్పు, ప్రేమ, గౌరవం పెరిగాయి. ఆ కాలంలో మార్గట్ లాటిన్ భాషలో దూరవిద్య ద్వారా ఒక కోర్స్ చేశా రు. రహస్య జీవితంలో అన్నే విపరీతంగా చదివారు. రాశారు. రహస్య జీవితం ముగిశాక మార్గట్ ఉన్నత చదువులు చదవాలని, తాను పాత్రికేయురాలు కావాలని, ప్రజల శ్రేయసుకు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. అమానవీయ నాజీ చర్యల్లో వారి జీవితాలు అంతమవుతాయని ఆ చిన్నారులు ఊహించలేదు. నాజీలు ఒట్టొ ఇంటిపై దాడి చేసి వారిని నిర్బంధించిన తర్వాత ఒట్టొ కార్యదర్శి మీప్ గీస్ ఆ ఇంటి వద్దకు వచ్చారు. ఆమెకు అన్నే డైరీ, నోట్ పుస్తకాలు, కాగితాలు కనిపించాయి.

గీస్ వాటిని భద్రపరిచారు. అన్నే తండ్రి ఒట్టొ ఆష్విట్జ్ కేంద్రీకరణ శిబిరం నుండి ఏదో విధంగా బతికారు. యుద్ధం తర్వాత 1945 జులైలో ఆంస్టర్డంకు వచ్చారు. అపుడు అన్నే రచించిన డైరీ, పుస్తకాలు, కాగితాలను గీస్ ఒట్టొకు అందజేశారు. అన్నే కోరిక మేరకు ‘రహస్య ప్రదేశం – 14.6.1942 నుండి 1.8.1944 వరకు డైరీ ఉత్తరాలు’ అన్న శీర్షికతో నెదర్లాండ్స్‌లో 25.06.1947న మొదటిసారి, ఒట్టొ ముద్రించారు. తర్వాత ఆ పుస్తకం 70 భాషల్లో 3 కోట్ల ప్రతులకు పైగా ముద్రించబడింది. చాలా నాటకాలకు, సినిమాలకు ఆధారంగా, ప్రేరణగా మారింది. అన్నే యుద్ధకాల డైరీ, ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఇది నాజీ ఆక్రమణలో యూదుల జీవిత వృత్తాంతాలను చిత్రీకరించిన సాక్ష్యాధార పత్రం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులు అనుభవించిన నరకయాతనకు ప్రతిబింబం.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News