Thursday, January 23, 2025

రాజ్యహింసపై పోరాడిన యోధుడు

- Advertisement -
- Advertisement -

హక్కులు అనేవి పాలకుల భిక్ష కాదు, ప్రజా పోరాటాల విజయాలని చరిత్ర నిరూపిస్తున్న సత్యాలు. 1215 మాగ్నాకార్టా నుండి నేటి వరకు హక్కుల రూపంలో నిర్ణయించబడ్డవన్నీ కూడా ప్రజలు అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్నవే. ఆ సాధించుకున్న హక్కులను ప్రభుత్వం తప్పనిసరై రాజ్యాంగంలో పేర్కొవలసిన పరిస్థితిని ప్రజా ఉద్యమాలు సృష్టించాయి కూడా. ప్రజల హక్కుల అమలు పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సామ్రాజ్యవాదులు బలపడుతున్న కొద్దీ చివరికి పారిశ్రామిక ప్రగతికీ మూలమైనటువంటి 8 గం॥ల పని దినం హక్కు కూడా కార్మికులకు నిరాకరించబడుతున్నది.

ఇటువంటి స్థితిలో న్యాయశాస్త్ర రంగా నిపుణుడైన ప్రొ. శేషయ్య మన మధ్యలేకపోవడం తీరని లోటే. గ్రామాల్లో రైతు, కౌలు రైతుల హక్కుల కోసం పరితపించిన ప్రొ. స్వామినాథన్ కూడా ఈ మధ్యనే మనకు దూరమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఎక్కడ ఉద్యమించినా అక్కడ పోలీసుల కాల్పులవుతాయి, రైతులు అమరులవుతారు. 2016లో మధ్యప్రదేశ్ మందసర్‌లో ఆరుగురు రైతులను కూడా ప్రభుత్వం మద్దతు ధర అడిగినందుకే హత్య చేసింది. హక్కులు అడుగుతున్న వారిని, హక్కుల కోసం ఉద్యమించిన వారిని హత్య చేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారిపోయింది.

అందులో భాగంగానే అసోంలో మానవ అధికార్ సంగ్రావ్‌ు సమితికి చెందిన పరాగ్ కుమార్ దాస్‌ను, కశ్మీర్‌కు చెందిన జలీల్ ఆంద్రాబీని, పంజాబ్‌కు చెందిన కలరాను ప్రభుత్వాలు అమానుషంగా హత్య చేశాయి. కానీ హక్కుల ఉద్యమం బలపడడం కోసం 2016 లో ప్రొ. శేషయ్య నాయకత్వంలో అఖిల భారత స్థాయిలో సుమారు 20 హక్కుల సంఘాలను ఐక్యం చేసి ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ కమిటీ సిడిఆర్‌ఒను నిర్మాణం చేయడం జరిగింది. దానిపై కూడా రాజ్య నిర్బంధం భీమా కోరెగావ్ కుట్ర కేసులో కొనసాగి మహారాష్ట్ర సిపిడిఆర్‌కు చెందిన ప్రొ. ఆనంద్ టెల్‌టుంబ్డెను, ఢిల్లీ పియుడిఆర్‌కు చెందిన గౌతం నవలాఖాలను ఎలా నిర్బంధాలకు గురి చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రొ. శేషయ్య రాయలసీమ ఫ్యాక్షన్ పడగనీడలో పుట్టాడు.

ప్రాంతం ఫ్యాక్షనిజానికి నిలయం అయినప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజా ఉద్యమాలను అర్థం చేసుకొని తన కార్యాచరణను హక్కుల ఉద్యమంలో చివరి కంటా కొనసాగించాడు. నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాల అణచివేతను వ్యతిరేకిస్తూ పుట్టిన ‘పౌర హక్కుల సంఘానికి’ నాయకత్వం వహించాడు. ‘పౌర హక్కుల సంఘం ఆవిర్భవ అవసరాన్ని గుర్తిస్తూ ప్రజాతంత్ర వర్గపోరాట స్పృహతోనే ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ, సంస్థలో చివరి వరకు క్రియాశీలకంగా పని చేసాడు. ప్రజాస్వామిక ఉద్యమాలను ఎలా అర్ధం చేసుకోవాలి, పోరాడే ప్రజలను హక్కుల సంఘాలు ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని గుర్తు చేస్తూ, ఉద్యమ పునాదులను ‘రాజ్యం’ హక్కుల సంఘాలను కూడా చూడకుండా చేస్తున్నది. ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉద్యమాల ప్రజాస్వామిక అంశాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తుందని, నిజాయితీ కోల్పోయిన ప్రభుత్వాలు ఎంతటి క్రూరత్వానికైనా తెగిస్తాయని, దాని నుండి బుద్ధిజీవుల అప్రమత్తతే మనల్ని, ప్రజా ఉద్యమాలను రక్షిస్తుందని ప్రజలకు వివరించగలిగాడు.అదే హక్కుల సాధనకు కీలకంగా పని చేస్తున్నాయి.

రైతాంగ ఉద్యమాలు 1/70 చట్టాన్ని సాధిస్తే, కారంచేడు దళితుల పోరాటం, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం 1989 సాధించింది. ప్రజా ఉద్యమ స్ధాయి ఆ స్ధాయిలో ఉంటే రాజ్య నిర్బంధం టాడా చట్టం, పోటా చట్టాలను తీసుకువచ్చింది. నేడు ఉపా నిర్బంధంలో ప్రాథమిక హక్కుల ఆచూకే లేకుండాపోయింది. ఈ చట్టాలను రద్దు చేయడానికి దేశ వ్యాప్తంగా సభలు, ఆందోళనలు కొనసాగించి హక్కుల ఉద్యమాలు తమదైన పాత్రను నిర్వహించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన ప్రజాస్వామిక ఉద్యమాలన్నీ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమూహంలో భాగంగా మార్చాయి. అలా ప్రతి ఒక్కరూ ఉద్యమాల్లో పాల్గొని విముక్తి ఉద్యమానికి ప్రాణం పోశారు.

హక్కుల ఉద్యమం స్పర్శించని సమస్య లేని స్థితి సమాజంలో ఏర్పడితే చాలనే, బుద్ధిజీవుల నాయకత్వం క్రింద హక్కులోద్యమం ప్రజాస్వామికంగా కొనసాగింది. చివరికి ‘శాంతి చర్చల’ సమయానికి సమాజంలో ఎన్‌కౌంటర్ అంటేనే ప్రభుత్వ హత్య అనే స్థితి తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది. దేశ వ్యాప్తంగా మేధావుల దృష్టికి తీసుకెళ్ళగలిగింది. ఉద్యమకారులతో చర్చలు జరపక తప్పని ఒక అనివార్య స్థితికి ప్రజా చైతన్యాన్ని తీసుకెళ్ళింది. దానికి పౌర స్పందన వేదిక సీనియర్ ఐఎఎల్ ఆఫీసర్ ఎస్.ఆర్. శంకరన్ కృషి కూడా ఎంతో ఉంది. నక్సల్స్, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చల కాలంలో కూడా ఎన్‌కౌంటర్ హత్యలు సాగాయి. 2019 ఫిబ్రవరి 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విస్తృత ధర్మాసనం ఎన్‌కౌంటర్ హత్యలపై ఇచ్చిన తీర్పు సందర్భంగా ఎన్‌కౌంటర్ హత్యలు ఆగాయి.

రెండు సందర్భాలలో మాత్రమే కేవలం 6 నెలల కాలం మాత్రమే ఎన్‌కౌంటర్ రూపంలో ‘జీవించే హక్కు’ అణచివేతకు గురికాకుండా కాపాడుకోగలిగాం. చివరికి ‘ఎన్‌కౌంటర్’ ప్రభుత్వ చేతుల్లో బలమైన ఆయుధం అయింది. హత్యలు చేయాలనుకుంటే ఎన్‌కౌంటర్లు జరుగుతాయి, వద్దనుకుంటే ఆగుతాయి. ‘నిజమైన ఎన్‌కౌంటర్లు’ సత్యదూరం అనే సత్యాన్ని ప్రజలకు అర్ధం చేపించడానికి పౌరహక్కుల సంఘం తరపున ప్రొ॥ శేషయ్య నిర్వర్తించిన పాత్ర చాలా క్రియాశీలమైనది. హక్కుల అణచివేత ఉన్న దగ్గర ప్రజల తిరుగుబాటు ఉంటుంది. తిరుగుబాటులో పీడిత ప్రజల ఐక్యతా శక్తి ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా పాలించాల్సిన ప్రభుత్వం కుట్ర, పన్నాగాలతోనే దళితులపై విస్తృతమైన హత్యాకాండలు కొనసాగుతున్నాయి.

అవి ఆదివాసులపైన, చివరికి హక్కుల సంఘాల కార్యకర్తలపైన కూడా రాజ్యం దాడి తీవ్ర స్ధాయిలోనే కొనసాగుతుంది. శేషయ్య ఆచరణ క్రియాశీలకంగా కొనసాగుతున్నంత కాలం ప్రభుత్వం నిర్భంధాన్ని ‘పులుల’ రూపంలోకి మార్చుకొని అప్పటికే పురుషోత్తం, అజం అలీలను కేవలం మూడు నెలల వ్యవధిలో హత్య చేసింది. ఆ హత్యలను చూసి హక్కుల కార్యకర్తలు భయపడాలని ప్రభుత్వం భావించింది. కాని నిర్బంధాన్ని ఎదిరిస్తూ ముందు నిలబడ్డ శేషయ్యపై కూడా ‘పులుల’ దాడి కొనసాగింది. అయినా సంస్థలో నిర్దేశించుకున్న విధంగా కార్యాచరణను కొనసాగించాడు. హత్యలతో, బెదిరింపులతో నిలువరించలేని హక్కుల ఉద్యమాల్ని ‘ఉపా’ క్రూర నిర్బంధ హస్తాల్లో బందీ చేయాలనుకుంటున్న స్థితిని ప్రొ॥ శేషయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.

‘ఉపా’ చట్టాన్ని ఎత్తివేయాలనే దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భీమా కోరేగాం కుట్ర కేసు ‘ఉపా’ చట్టం క్రింద ఆరోపితులను సుదీర్ఘకాలం జైళ్ళలో నిర్బంధిస్తూ వారు జీవించే హక్కును, జీవనోపాధి హక్కులను, బలి చేస్తున్న వైనాన్ని చాలా తీవ్రంగా ఖండించారు. ఏ కేసులనైనా బెయిల్ ఇవ్వాల్సిందే కాని అనేక సాకులతో బెయిళ్ళు ఇవ్వకుండా బుద్ధిజీవులపై అణచివేత కొనసాగించకూడదు. ఇది ప్రజాస్వామిక పాలనలో ఫాసిస్టు ధోరణులుగా మనం అర్థం చేసుకోవాలి. అసమాన అభివృద్ధిలోంచి ఒక ప్రజాస్వామిక డిమాండ్ ఉబికి వస్తుంది. అదే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ 1969లో కొనసాగింది. 2000 దశకంలో మరొకసారి ముంచుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పౌరహక్కుల సంఘం, ప్రజా సంఘాలకు దిశా నిర్దేశం చేస్తూనే తెలంగాణ సాధనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి కూడా మద్దతు ఉద్యమాలను నిర్వహించడంలో ప్రొ॥ శేషయ్య నిర్వహించిన పాత్ర కీలకమైనది.

నారాయణ రావు
(ప్రధాన కార్యదర్శిపౌర హక్కుల సంఘం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News