Sunday, December 22, 2024

స్టాలినూ… నీ ఎర్రసైన్యం…

- Advertisement -
- Advertisement -

అంతటా
కారుచీకటి మూసుకొస్తున్నప్పుడు
ఫాసిజం కోరలు చాస్తున్నప్పుడు
కత్తులు దూస్తున్నప్పుడు
నిస్సహాయుల కుత్తుకలు పరపరా కోసేస్తున్నప్పుడు

సరయు నిండా నెత్తురే ప్రవహిస్తోంది
శవాలు తేలని శబరి
శవాలె ప్రవహించిన ఇంద్రావతి
బిక్క చచ్చిపోయిన పల్లెలె పట్నాలు
స్టాలినూ, ఏ చావులకీ లెక్క ఉండట్లేదు
వేల కాళ్ళ అక్టోపస్ లా ఫాసిజం రాజ్యం చేస్తోంది
మెల్లగా ఒక్కో ముసుగూ తొలగిస్తొంది
మాలోని భ్రమలు ఒక్కొక్కటే బీటలు వారుతున్నాయి

క్రమంగానే, కానీ అతివేగంగా
నడక నేర్చి నడిచొచ్చిన దారిలోనే
వెనక్కి మరింత వెనక్కి
దిగువకి లేనంత దిగువకి జారిపోతూ
నడిచొచ్చిన దారిలోనే
అంతులేని శ్రమతో మేధస్సుతో

ముడుచుకుపోతోంది లక్షల ఏళ్ళ సంఘర్షణ, శ్రమ,
విజ్ఞానం ఎదురుదాడికి గురయినప్పుడు
మతం వేల అంచుల కత్తిగా ఎదుట నిలబడింది
జాతుల చరిత్రని అధ్యయనం చేయ్యమనే నీ మాట
ఇప్పుడు మరింత బాగా అర్థమవుతోంది

సముద్రాన్ని పదే పదే సమీపించి
గొల్లున ఎలుగెత్తి వేడుకుంటాను
వేల తలల విషపు పురుగుల్ని
తెల్లముసుగు లోని భీభత్సాన్ని చూపి క్షమించ వద్దని
చేతులు జోడించి అర్థిస్తాను

సహించవద్దని ఒట్టు తీసుకుంటాను
స్టాలినూ, నువ్వు ఆవహించాలిప్పుడు మమ్మల్ని
అడుగు అడుక్కీ క్షణ క్షణానికీ
పదుల చోట్లా శోధించబడుతూ
నన్ను నేను ధ్రువీకరించుకుంటూ
నిలువునా పదే పదే తడిమించుకుంటూ
సిగ్గుతో చచ్చిపోతున్నాను
ఎవడో గీసిన హద్దుల్లో బతకాలి
ఎవడో చెప్పినట్టు గుడ్డలు తోడుక్కోవాలి

పర్వతాలని చుట్టుకున్న నదిలాగ
పగళ్ళని చుట్టుకున్న రాత్రి లాగ
చిక్కటి ఆకాశాన్ని చుట్టుకున్న నక్షత్ర సమూహం లాగ
కమ్మేస్తున్న ప్రచండ అలలాగ
దూసుకొస్తున్న పెనుతుపాను లాగ
స్టాలినూ, నీ ఎర్రసైన్యం కావాలోయ్ మాకు

ఇక్కడ జరూరుగా చేతినిండా పని వుంది
చేసి గెలవాల్సిన అంతిమ యుద్ధం వుంది
స్టాలినూ, నీ ఎర్రసైన్యం….
ఫాసిజా వినాశసైన్యం, స్టాలినూ……

-స్వాప్నిక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News