Monday, December 23, 2024

జెఇఇలో చిద్విలాసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బి.టెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి చిద్విలాస్ రెడ్డి మొత్తం 360 మార్కులకు 341 మార్కులు సాధించి రికార్డు టాపర్‌గా నిలిచారు. టాప్ టెన్ ర్యాంకర్లలో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులు ఆరుగురు ఉన్నారు. వావిలాల చిద్విలాస్ రెడ్డికి 1వ ర్యాంకు, రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు,అడ్డగడ వెంకట శివరామ్‌కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్ జోన్‌కు చెందిన మరో తెలంగాణ విద్యార్థి నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకు సాధించగా, అమ్మాయిల విభాగంలో తొలిస్థానంలో నిలిచారు.

ఈ నెల 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు. అందులో 43, 773 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 36,264 మంది అబ్బాయిలు ఉండగా.. 7,509 మంది అమ్మాయిలు ఉన్నారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచే అత్యధికంగా 10,432 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, బాంబే, ఖరగ్‌పూర్, కాన్పూర్, రూర్కే, గువహటి జోన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది రాయగా, ఈ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. మొదటి ర్యాంకుల్లో సుమారు వందకు పైగా ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు మెరుపులు మెరిపించారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, ఆదివారం ఉదయం తొలుత తుది కీ ని విడుదల చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఐఐటీ గువాహటి నిర్వహించగా, సీట్ల భర్తీని ఆ సంస్థే చేపడుతున్నది. ఫలితాల కోసం https:// jeeadv.ac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకు 341 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన పదిహేడేళ్ల వావిలాల చిద్విలాస్ రెడ్డి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తల్లి నాగలక్ష్మిరంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో తండ్రి రాజేశ్వర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా గిరికొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. మొదటి అబ్బాయి హైదరాబాద్ బిట్స్‌లో నాలుగో సంవత్సరం చదువుతుండగా,రెండో అబ్బాయి జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా టాపర్‌గా నిలిచారు. చిద్విలాస్‌రెడ్డికి ఆలిండియా టాప్ ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

పరిశోధనలపై ఎంతో ఆసక్తి ఉందని, ఆ దిశగా తన భవిష్యత్తు విద్యా ప్రణాళికలు ఉంటాయని జెఇఇ అడ్వాన్స్‌డ్ ఆలిండియా టాపర్ చిద్విలాస్ రెడ్డి తెలిపారు. ఐఐటి బాంబేలో సిఎస్‌ఇ చేరి, ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత పరిశోధనల వైపు దృష్టి సారిస్తాననిన్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో తాను మొదటి ఐదు స్థానాల్లో ఉంటానని ఊహించినప్పటికీ, ఆలిండియా టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ కోసం తాను గత నాలుగేళ్లుగా సిద్ధమవుతున్నానని చెప్పారు. అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా అధ్యాపకుల మార్గదర్శనంలో ఎక్కువ సమయంలో చదువుకే కేటాయించానని తెలిపారు. జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకుని సిద్ధమయ్యే విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతానని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే సిలబస్, ఇతర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News