Monday, December 23, 2024

ఎండోన్మాదం

- Advertisement -
- Advertisement -

Temparatures high in Telangana for next 5 days

122 ఏళ్ల రికార్డును అధిగమించిన ఏప్రిల్ నెల ఉష్ణోగ్రతలు

వచ్చే ఐదు రోజుల్లో మరింత తీవ్రత : వాతావరణ శాఖ

ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. 122 ఏళ్లలో అత్యంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో నమోదయ్యాయని, 46 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతగా నమోదయ్యిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికమవుతుండగా, మహానగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండి సూచించింది. ఉదయం వేళల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. వడగాల్పుల భయంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవస రం అయితే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు.

శనివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా….

శనివారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కౌటాలలో అత్యధికంగా 46.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల జిల్లాలోని రాఘవపేట, ఎండపేట, కొల్వా యిల్లో 45.9 డిగ్రీలు, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీలు, నల్గొండ జిల్లాలోని కనగల్‌లో 45.7, వరంగల్ జిల్లా రాయపర్తిలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు….

ఉత్తర తెలంగాణలో ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే గానీ ఎండపూట ప్రజలు బయటికి రావొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో….

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నేటి నుంచి ఐదు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో గంటకు 30నుంచి 40కి.మీల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించింది. శనివారం ఉపరితల ద్రోణి విదర్భ నుంచి మరట్వాడ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుందని అధికారులు వివరించారు.

సాయంత్రం చిరుజల్లులు…

రాష్ట్రంలోని పలు జిల్లాలో సాయంత్రం వాతావరణం కాస్త చల్లబడడంతో చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, గాజులరామారం, సూరారం, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. చిరు జల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News