ఇడుక్కి( కేరళ): కేరళలోని మున్నార్‌లో ఉష్ణోగ్రత ఈ శీతాకాలంలో తొలిసారిగా నిన్న(బుధవారం) సున్నా కంటే తక్కువకు పడిపోయింది. సమీపంలోని చెందువార, వట్టవాడ తదితర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చలి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా డిసెంబర్‌లో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అయితే ఈసారి వర్షం కారణంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మున్నార్‌కు చెందిన సురేష్ తెలిపారు.”ఈ శీతాకాలంలో మున్నార్‌లో ఇంత తీవ్రమైన చలిని అనుభవించడం ఇదే మొదటిసారి” అన్నారాయన.
మున్నార్‌లోని కన్నిమల, చెందువార, చిటువార, ఎల్లపెట్టి, లక్ష్మి, సేవాన్‌మల, లాకట్‌తో సహా పలు ప్రాంతాల్లో నిన్న మైనస్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా మంది పర్యాటకులు ఉదయం మంచుతో కప్పబడిన పచ్చిక బయళ్లను సందర్శించారు. కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామమైన వట్టవాడలోనూ చలి తీవ్రత నమోదైంది. బుధవారం ఉదయం వట్టవాడలో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా కంటే దిగువకు పడిపోయింది. మున్నార్ కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఒక హిల్ స్టేషన్. ఇక్కడ సాధారణంగా డిసెంబర్‌లో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. విపరీతమైన చలిని ఫీల్ కావడానికి చాలా మంది పర్యాటకులు మున్నార్‌ను సందర్శిస్తున్నారు.