Sunday, December 22, 2024

ఠారెత్తిస్తున్న ఎండలు!

- Advertisement -
- Advertisement -

భూమిపై అత్యుష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏడాది తిరగక ముందే ఈ రికార్డును 2024 తిరగరాస్తుందేమోనని అనిపించకమానదు. ఈ ఏడాది ఆరంభం నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. ఫిబ్రవరి రెండో వారం వచ్చేసరికి మధ్య వేసవిని మరపించడమూ మొదలైంది. ఈ నేపథ్యంలో రాబోయే మూడు నెలలూ మండుటెండలేనంటూ భారత వాతావరణ విభాగం (ఐఎండి)చేస్తున్న హెచ్చరికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయోనని సామాన్యుడు బెంబేలెత్తడం సహజమే. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే.. వేసవి కాలాన్ని పునర్నిర్వచించుకోవాలేమోనని అనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి వేడిగాలుల ప్రభావం కూడా తీవ్రమేనని ఐఎండి పేర్కొంటోంది.

సాధారణంగా ఏప్రిల్ రెండో వారం నుంచీ భానుడి ప్రతాపం మొదలవుతుంది. ఈసారి ఏప్రిల్ మొదటి రోజునే పగటి ఉష్ణోగ్రతలు తెలుగునాట కొన్ని చోట్ల 43 డిగ్రీల సెల్సియస్ దాటడం రానున్న గడ్డు పరిస్థితులకు సంకేతంగా భావించవచ్చు. ఒకవైపు ఎండలు ఠారెత్తిస్తుండగా మరోవైపు భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే విపత్కర పరిస్థితి నెలకొని ఉంది. గత ఏడాది వర్షాకాలం ఆరంభంలో మొదలైన ఎల్‌నినో పుణ్యమాని వర్షాలు అంతంత మాత్రమే కురవడంతో భూగర్భ జలమట్టం పెరగలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎండలు విజృంభిస్తున్న నేపథ్యంలో, వందల అడుగుకు భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లకు నీరు అందడం లేదు.

పంటల మాట అటుంచి, రాబోయే రోజుల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరవయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితికి ఎల్‌నినో కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పులతో ఏర్పడే ఎల్‌నినో కారణంగా వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో గత ఏడాది జూన్‌లో మొదలైంది. దీని ప్రభావం ఈ ఏడాది మే వరకూ కొనసాగుతుందని చెబుతున్నారు. వాతావరణంలోకి విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూతాపం రానురాను పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 1901 నుంచి మన దేశంలో పెరుగుతున్న భూతాపం రేటు ప్రపంచ సగటు కన్నా ఎక్కువ. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు సంపన్న దేశాలు సైతం బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగంపై ఆధారపడుతూ వాతావరణ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాయి.

కర్బన ఉద్గారాలను అధిక మోతాదులో విడుదల చేస్తున్న జాబితాలో చైనా, అమెరికా, భారత దేశం అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. భూతాపం పెరిగితే వ్యవసాయ దిగుబడులు తగ్గి, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. హిమనదాలు కరిగిపోవడం, సముద్రాలు పొంగడం, వరదలు సంభవించడం, వడగాలుల తీవ్రత పెరగడం వంటి ఉత్పాతాలు చోటు చేసుకుంటాయి. భూ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలిపి ఉంచితేనే మానవాళి భద్రంగా ఉంటుందని ఎనిమిదేళ్ల క్రితమే పారిస్ వాతావరణ సభ తీర్మానించింది. అయితే ఎల్‌నినో కారణంగా గత ఏడాది భూతాపం పెరుగుదల 1.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ ఎండా కాలంతో ఎల్‌నినో పరిసమాప్తమవుతుందనీ, ఆ తర్వాత లానినో పరిస్థితి ఏర్పడి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేస్తున్న సూచనలు హర్షణీయమే. అయితే ముందున్న విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడం ప్రధానం.

మండిపోతున్న ఎండలకు ఇప్పటికిప్పుడు మందు వేయడం ప్రభుత్వాల చేతిలో లేని పని. ఈసారి ఎండలు అసాధారణంగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన కర్తవ్యం ప్రభుత్వానిదే. వడదెబ్బ తగిలి అమాయక జనం ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో వడదెబ్బ చికిత్సకు తగిన మందులు, పరికరాలను అందుబాటులో ఉంచాలి. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో సరిపెట్టుకోకుండా, ప్రజలు ఈ ఎండాకాలాన్ని సురక్షితంగా దాటడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలూ తమ వంతు పాత్ర పోషించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News