మన తెలంగాణ/హైదరాబాద్: కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీ స్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో చలిగాలుల తీవ్ర త అధికంగా నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తం గా పలు జిల్లాలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు న మోదు కావడం గమనార్హం. తెలంగాణ కాశ్మీర్‌గా పిలవబడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచు దుప్పటి కప్పుకుంది. ఆ ప్రాంతమం తా కాశ్మీరును తలపిస్తోంది. రెండు రోజులు గా జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది.
పొగమంచు కమ్ముకొని జాతీయ ర హదారితోపాటు ఇతర రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కొంత మబ్బుగా ఉన్నా, గురువారం మరింత పొగమంచు ఆవరించడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం నిండా పొగమంచు కమ్మేయడంతో మధ్యాహ్నం దాటినా సూర్యుడి దర్శనం లభించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్ మండలాల్లో శుక్రవారం పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. ఒక్కసారిగా ఈ రెండురోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరోవైపు రాగల 48 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వణుకుతున్న ఉత్తర భారతదేశం
ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నైరుతి ఢిల్లీలోని ఆయానగర్‌లో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు తీవ్రమైన చలి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలో సుమారు 26 రైళ్లు గంట నుంచి 10గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరో 24 గంటల వరకు ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు.
ఒక్కరోజే 723 మందికి గుండెనొప్పి
చలి కారణంగా ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25 మంది మరణించారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. వీరిలో 17 మంది ఎలాంటి వైద్య సహాయం అందక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు తెలిపాయి. తీవ్రమైన చలి కారణంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూం ప్రకారం గురువారం ఒక్కరోజే 723 మంది ఉత్తరప్రదేశ్‌లోని పలు ఆస్పత్రులకు గుండెనొప్పితో ఎమర్జెన్సీ, ఓపీడీ కోసం వచ్చారని వైద్యులు తెలిపారు.