ఏటా వేసవికాలం భారత వాతావరణ శాఖ వేడిగాలులు, వేడితరంగాల గురించి హెచ్చరించడం పరిపాటి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ హెచ్చరికలు ప్రారంభమయ్యాయి. ఈశాన్య, పశ్చిమ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వేసవి ప్రారంభానికి ముందే సాధారణం కంటే 3.1 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తూర్పు, దక్షిణ భారతదేశంలో రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడితరంగాల వాడి బాగా పెరుగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోడానికి భారతదేశం ఎంతవరకు సంసిద్ధమవుతుందన్నది ప్రశ్నార్ధకం. అయితే దేశం లోని మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ మాత్రం వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి సంసిద్ధం కావడం హర్షించదగిన పరిణామం.
వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని నిర్ణయించింది. ఇదివరకు వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు కేవలం రూ. 50 వేలు మాత్రమే చెల్లించేవారు. వడగాలులను రాష్ట్ర విపత్తుగా గుర్తించి ఆ మేరకు సహాయాన్ని అందించడంతోపాటు ఎక్స్‌గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించడం ఎంతైనా ముదావహం. గత ఏడాది వేసవిలో 28 జిల్లాల్లో వడగాలులు వీచాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం జిల్లా స్థాయినుంచి స్థానిక స్థాయివరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. విపత్తు నిర్వహణ బడ్జెట్ నుంచి 10 శాతం నిధులను ఖర్చు చేయాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా రైతు మృతి చెందితే వారి కుటుంబాలకు రైతు బీమా స్కీమ్ లేదా ఎక్స్‌గ్రేషియా వీటిలో ఏది ఎక్కువ మొత్తం వస్తే ఆ స్కీమ్‌ను ఆయా కుటుంబీకులు ఎంచుకోవచ్చు.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రత మైదానాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వేడి తరంగంగా ప్రకటిస్తారు. అలాగే తీరప్రాంతంలో 37 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, కొండల్లో 30 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వేడితరంగంగా ప్రకటిస్తారు. దేశంలో 20202022 మధ్యకాలంలో వడదెబ్బ కారణంగా మరణాలు పెరిగాయి. 2020లో 530 మరణాలు సంభవించగా, 2022లో అది 730కి పెరిగింది. గత ఏడాది దేశం మొత్తం మీద 17 రాష్ట్రాల్లో వడదెబ్బకు 733 మరణాలు సంభవించగా, 40,000 కేసులు నమోదయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలను సగానికి సగం తగ్గించి చెబుతోంది. వేడితరంగాల వల్ల సంభవించిన నష్టాలను తేల్చడానికి ప్రస్తుతం ప్రామాణికమైన డేటా సేకరణ అంటూ ఏదీ లేదు.
పిల్లలు, వయోవృద్ధులు, అవుట్ డోర్ కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి హెచ్చరిస్తోంది. అవుట్ డోర్ కార్మికులు మాత్రం విపరీతంగా దెబ్బతింటున్నారు. వీరి పని గంటలు 20 శాతం వరకు తగ్గిపోతున్నాయి. ఇది ఆయా కుటుంబాల ఆదాయంపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ఫలితంగా దేశ జిడిపిపై కూడా ప్రభావం చూపిస్తోంది. సుదీర్ఘ కాలంగా వేడి వాతావరణం కొనసాగడం వేతనాలు తగ్గిపోవడమే కాక, ఆరోగ్య సమస్యలు ఎదురై వైద్యచికిత్సలకు ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తోంది. ఆయా కుటుంబాలను పేదరికంలోకి నెట్టేస్తోంది. దేశంలోని కార్మిక శక్తిలో మూడొంతుల మంది ఆరుబయలు విపరీతమైన వేడికి గురవుతున్నారని ఢిల్లీకి చెందిన వాతావరణ మేధావుల సంస్థ అధ్యయనం వెల్లడించింది. 2030 నాటికి భారతదేశంలోని పనిదినాలు 5.8 శాతం తగ్గిపోతాయని, ఇది 3.4 కోట్ల పూర్తి పని కాల ఉద్యోగాలతో సమానమని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2019 నివేదిక వెల్లడించినట్టు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. దేశంలో మొట్టమొదటి ఉష్ణకార్యాచరణ ప్రణాళిక 1999లో ఒడిశాలో అమలు చేశారు.
2010లో ప్రాణాంతక వేడి వడగాడ్పులు వ్యాపించడంతో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాసియాలో ప్రప్రథమ నగరస్థాయి ఉష్ణప్రణాళిక (హీట్ యాక్షన్ ప్లాన్)ను అహ్మదాబాద్ రూపొందించింది. 2010 మే నెలలో అహ్మదాబాద్ పశ్చిమ భాగాన ఉష్ణోగ్రతలు 47.8 డిగ్రీల సెల్సియస్ దాటడంతో నవజాత శిశువులు 43 శాతం ఆస్పత్రి పాలు కావలసివచ్చింది. దేశం మొత్తం మీద అహ్మదాబాద్‌లో ఉష్ణకార్యాచరణ ప్రణాళికను తప్పనిసరిగా ఆనాడు అమలు చేయవలసి వచ్చింది. ఉత్పాదక రంగం పైన, ఆరోగ్యం పైన వ్యతిరేక ప్రభావాలను నివారించడమే ఈ ఉష్ణ ప్రణాళికల లక్షం. అయితే 18 రాష్ట్రాలకు 37 ఉష్ణప్రణాళికలను ఢిల్లీకి చెందిన ఒక పరిశోధన సంస్థ విశ్లేషించగా, చాలా ప్రణాళికల్లో స్థానిక పరిస్థితులతో సంబంధం లేకపోవడం, నిర్వహణకు నిధుల కొరత స్పష్టంగా కనిపించింది.
ప్రజల సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించడంలో ఇవి విఫలమవుతున్నాయని తేలింది. ఇంధనం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, ప్రజా రవాణా, విద్య, వ్యవసాయం, పశుసంవర్ధకం, తదితర ముఖ్యమైన రంగాల్లో అత్యధిక వేడి ప్రభావం ఎలా ఉంటుందో ఈ ప్రణాళికలు సమీక్షించలేకపోతున్నాయని తేలింది. ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఈ ప్రణాళికల అమలుకు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఉండడం లేదు. ఉష్ణ కార్యాచరణ ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయలేకుంటే 2030 నాటికి దేశంలో 5.8 శాతం వరకు పని గంటలు తగ్గుతాయని, కార్మిక శక్తిలో దాదాపు 50 శాతం తమ పనుల్లో తీవ్రమైన వేడి వాతావరణాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.