వరంగల్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయని, మన తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పి. అర్. సి. వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఒ 114 విడుదల చేసింది. ఈ సందర్భంగా అర్చక ఉద్యోగులు నూతన పి.అర్. సికి సహకరించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక ఉద్యోగ జెఎసి కన్వీనర్ డి.వి.అర్.శర్మ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశామని చెప్పారు. దేవాదాయశాఖ లో కట్ ఆఫ్ తేదీ తొలగించి మిగిలిన 1252 మంది తాత్కాలిక అర్చక ఉద్యోగుల ను కూడా రెగ్యులర్ చెయ్యాలని వారికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అర్చక ఉద్యోగులకు ఇంతటి వేతనాలు లేవని, తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో 152 కోట్లు కేటాయించి ప్రభుత్వ సమాన వేతనాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్నారని పొగిడారు. కెసిఆర్ దిశా నిర్దేశం లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. భారత దేశానికి ఆదర్శం మన అర్చకుల వేతన విధానం అని అన్నారు. మన యాదాద్రి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో దేశంలో అత్యున్నత దేవాలయంగా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అద్దంకి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నరేష్ శర్మ, వరంగల్ జిల్లా ప్రథాన కార్యదర్శి అభిలాష్ శర్మ, భీమన్న శర్మ, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -