మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయ్యప్ప దేవాలయం సమీపంలోని ద్వారకా సర్కిల్ వద్ద రాత్రి 7.30 గంటలకు టెంపో, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
“నాసిక్‌లోని సిడ్కో ప్రాంతానికి వెళుతున్న టెంపోలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు నిఫాద్‌లో ఒక మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. టెంపో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఇనుప రాడ్‌లతో ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడినవారు అక్కడికక్కడే మృతి చెందారు” అని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని ఆయన తెలిపారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.