Thursday, January 23, 2025

రైతుల ఢిల్లీ చలోకు తాత్కాలిక బ్రేక్

- Advertisement -
- Advertisement -

తమ డిమాండ్ల పరిష్కారానికి గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. కేంద్ర బృందం రైతు నేతలతో ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకూ చర్చలు జరిపి, కనీస మద్దతు ధరపై కీలకమైన ప్రతిపాదనలు చేసింది. వీటిపై చర్చించేందుకు వీలుగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల 21వరకూ  నిలిపివేస్తున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ ప్రకటించారు.

రైతు నేతలతో చర్చలు జరిపిన కేంద్ర బృందంలో మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఉన్నారు. చర్చల అనంతరం పీయూష్ గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తాము ప్రతిపాదించినట్లు చెప్పారు. మినుములు, మొక్కజొన్న, కందులు, మైసూర్ పప్పు సాగు చేసే రైతులతో సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయన్నారు. ఇందుకోసం ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కేంద్ర బృందం ప్రతిపాదనలపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామని రైతు నేత సర్వన్ సింగ్ పంథేర్ చెప్పారు. ప్రస్తుతానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఇంకా కొన్ని డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదనీ, డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే 21వ తేదీనుంచి మళ్లీ ఆందోళన ప్రారంభిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News