Wednesday, January 22, 2025

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు..లోకేష్‌ను ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయొద్దు : ఎపి హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌ను ఈ నెల 12 వరకు ఎపి హైకోర్టు పొడిగించింది. హైకోర్టులో బుధవారం నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే లోకేష్ ముందస్తు బెయిల్ బుధవారంతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. మరోవైపు తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే లోకేష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అప్పటివరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దని, ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన సంగతి విదితమే.

ఈ కేసులో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో లోకేష్ పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతామని సిఐడి ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా లోకేశ్‌ను ఇంకా నిందితుడిగా పేర్కొనలేదని సిఐడి హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో తాను నిందితుడిని కాదని లోకేష్ చెబుతున్నందున ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని సిఐడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్‌ను అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయకుండా సిఐడి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News