Monday, December 23, 2024

భూసంస్కరణలు: పాక్షిక ఫలితాలు

- Advertisement -
- Advertisement -

మన దేశంలో గ్రామీణ పేదల అభ్యున్నతికి భూమి యాజమాన్యం కీలకం. బ్రిటీష్ వలసవాదం నుండి స్వాతంత్య్రం పొందిన 70 సంవత్సరాల తరువాత కూడా ధనిక భూస్వామ్య వర్గాలు విస్తారమైన భూమిని ఆక్రమించగా, 80 శాతం మంది రైతులు, వ్యవసాయ కౌలుదార్లు కొద్ది పాటి భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. పేదరిక నిర్మూలన ప్రక్రియలో వ్యవసాయోత్పత్తి, అలాగే ఉత్పాదకతను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా పెంచడంలో భూమిలేని పరిస్థితి వారికి ఒక ప్రధాన అడ్డంకి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలును సౌకర్యవంతంగా విస్మరించి, భూసంస్కరణల అజెండాను కూడా తారుమారుచేశాయి. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు భూమిని, ఆహారాన్ని అమ్ముకోదగిన వస్తువులుగా మార్చడానికి తోడ్పాపడ్డాయి.దక్షిణాసియాలోని మిలియన్ల మంది పేద రైతులనూ భూమిలేని గ్రామీణ పేదలను దూరం చేశాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే జమీందారీ వ్యవస్థ రద్దు చేశారు. రైతులకు భూమిని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో భూ సంస్కరణలు ప్రతిపాదించారు. భూమిలేని వారికి కొంత భూమిని అందించి చిన్న రైతులుగా మార్చడమే అసలు ఉద్దేశం.

కానీ ఇది మన దేశమంతటా విజయవంతంగా అమలు కాలేదు. చాలా తక్కువ పరిమాణంలో భూమి ఉన్న రైతులు దానిని లాభదాయకంగా ఉపయోగించలేని పరిస్థితుల్లో వాటిని వేగంగా కోల్పోతున్నారు. 1960వ దశకం చివరిలో హరిత విప్లవం, ఆహారోత్పత్తిని పెంచింది. అయితే గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు అలాగే ధనిక, భూస్వాముల మధ్య అసమానతలను కూడా పెంచింది. దేశంలో భూసంస్కరణల ఫలితాలు వేగంగా తిరోగమిస్తున్నాయి. భూస్వామ్య దోపిడీకి, బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా కార్మికవర్గంతో కలిసి పోరాడిన రైతాంగానికి చాలా ద్రోహం జరిగింది. 1950ల ప్రారంభంలో తెలంగాణ, తెభాగ (పశ్చిమ బెంగాల్)లో భూయాజమాన్యంలోని అసమాన భూపోరాటాలు సమగ్రంగా, అలాగే ప్రజానుకూలమైనవి కానందు వల్ల వాటి అమలు బలహీనంగా, టోకెన్ పంపిణీకి దారితీసింది. చివరిగా గ్రామాల్లో భూమి యాజమాన్యం నిర్మాణంలో గణనీయంగా మార్పు లేమీ జరగలేదు.

అధిక మొత్తంలో భూమి ధనిక రైతాంగం, మధ్యతరగతి రైతు వర్గాల చేతుల్లోనే ఉండిపోయింది.వెనుకబడిన, దళిత, నిమ్న వర్గాలకు చెందిన చిన్నపాటి రైతులకు కొద్దిపాటి భాగం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అసలు సెంటు వ్యవసాయ భూమిలేని వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కాలక్రమంలో ప్రభుత్వం చేపట్టిన భూసంస్కరణల వైఫల్యంతో మిగులు భూము లు (భూదాన్ భూములతో సహా) ప్రభుత్వం జప్తు చేసింది. సాగు భూమిలో కేవలం 2.1% భూమి మాత్రమే అతి తక్కువగా పేదలకు పంపిణీ చేశారు. చాలా భూమి పెద్ద మొత్తంలో ధనిక రైతుల ఆధీనంలో కొనసాగుతున్నది. కొన్నిచోట్ల చట్టవిరుద్ధంగా అధికార ప్రతిష్టంభనలో భాగంగా కోర్టు వివాదాల్లో చిక్కుకొని అపరిష్కృతంగా మిగిలిపోయింది. చట్టపరంగా వివాదాలు లేని మిగులు భూములను భూమిలేని రైతులకు పంపిణీ చేయాలన్న ఆలోచనే నెరవేరలేదు.నేషనల్ శాంపిల్ సర్వే 2020 ప్రకారం చిన్న, సన్నకారు రైతులకు (ధనిక భూస్వాములకు చెందిన దాదాపు 10 లక్షల ఎకరాల భూమిలో 84.2 శాతం భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని ఆయా రాష్ట్రాల్లో 1960-70లలో అఖిల భారత కిసాన్‌సభ పోరాటాలు చేసింది.

అలాగే ఈసమస్యను భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ భూసంస్కరణలను ప్రధాన ఎజెండాగా మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకు వచ్చింది. ఈ పోరాటాల కారణంగా భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూసంస్కరణల అమలును పునఃపరిశీలించ వలసి వచ్చింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలలో చట్టాలు చేశారు. భూపరిమితి చట్టం చేశారు. మరికొంత భూమి భూస్వాముల నుండి జప్తు కూడా చేశారు. కానీ వాటి పంపిణీ అమలు కాలేదు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో పేదరికం, నిరుద్యోగం అధికంగాఉన్న గ్రామాల్లో భూమి పంపిణీసమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. 2020 నాటికి చిన్న, సన్నకారు రైతులు 84.2% మంది రైతులు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమినే కలిగి ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు కలిసి స్వంతంగా సాగు చేసుకుంటున్నారు. పంట విస్తీర్ణంలో 47.3% మాత్రమే, మిగిలిన 52.7% పెద్ద, మధ్యతరగతి వర్గాల రైతుల వద్ద ఉండిపోయింది. తెలంగాణలో 1973 భూసంస్కరణల చట్టం వ్యవసాయ హోల్డింగ్స్‌పై సీలింగ్ నిబంధనల ప్రకారం అమలుచేశారు. 2.0 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి వున్న వారు జనాభాలో 13.8% ఉన్నారు.

భూమి కలిగిన ధనిక రైతులు 47.3% ఉన్నారు. పంట భూమి పంపిణీలో వివిధ రాష్ట్రాలలో భూయాజమాన్య నిర్మాణంలో కూడా భారీ వ్యత్యాసం ఉంది. పంజాబ్, బీహార్‌లలో 80% భూమి కేవలం 10% ధనిక భూస్వాముల ఆధీనంలో ఉంది. అయితే తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటకల్లో 55% వ్యవసాయ భూమి 10% ధనికుల కుటుంబాల ఆధీనంలో ఉంది. భారత దేశంలో కేవలం 4.9% మంది రైతులు 32% వ్యవసాయ భూమిని నియంత్రిస్తున్నారు. భారత దేశంలో ఒక పెద్ద రైతు చిన్నపాటి రైతు కంటే 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. నాలుగు మిలియన్ల ప్రజలు లేదా 56.4% గ్రామీణ కుటుంబాలు భూమిలేని వారుగా మిగిలిపోయారు. మొత్తం నికర పంట విస్తీర్ణంలో దాదాపు 82% సారవంతమైన, నీటిపారుదల భూమి అగ్రశ్రేణి ధనిక రైతుల ఆధీనంలో ఉంది. దేశంలో చిన్న, సన్నకారు రైతుల వద్ద ఉన్న భూమి తక్కువ సారవంతమైన, ఎక్కువగా వర్షాధార సాగు భూమిగా ఉంది. చాలా మంది రైతులు తమ భూమిని కోల్పోవడంతో వ్యవసా య కూలీలుగా మారుతున్నారు. చిన్న, మధ్యతరహా రైతులు తమ భూమిని కోల్పోవడానికి గల కారణాలలో సాగుఖర్చు పెరగడం ముఖ్యమైనది.

మరో వైపు కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లభించకపోవడం, మార్కెట్‌లో వ్యవసాయక ఉత్పత్తులకు విలువ లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు గ్రామీణ రుణ భారానికి గురయ్యారు. వాతావరణ మార్పులతో అస్థిరమైన వర్షపాతంతో వ్యవసాయం అస్థిరంగా, జూదంగా మారింది. మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న చిన్నరైతులు దివాలా తీశారు. ప్రస్తుత నయాఉదారవాద అభివృద్ధి నమూనా, వ్యవసాయ వ్యాపార దిగ్గజాల ద్వారా గ్రామాల్లో ఇన్‌ఫుట్ సరఫరా, భూయాజమాన్యం, మార్కెటింగ్, పంపిణీ గొలుసుపై గుత్తాధిపత్యానికి పురికొల్పుతోంది. కార్పొరేట్ వ్యవసాయమే ఇందుకు కారణం. చిన్న రైతులను స్థానభ్రంశం చేసి కార్పొరేట్ యాజమాన్యానికి భూమిని అప్పగించటానికి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికి భూసంస్కరణల నమూనాను పూర్తిగా తారుమారు చేయబడింది. 2018-19లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ నికర ఆదాయం రూ. 8,337. కానీ వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయంలో దాదాపు సగం వేతనాలు (ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా సంపాదించినవి) ఇప్పుడు ఉన్నాయని మనం గమనించాలి. కూలీ ఆదాయం పంటల సాగు నుండి కాకుండా కూలీ పని, పాడి పశువులు, కోళ్ళ పెంపకం ద్వారా సంపాదించినందున ఇది పెద్ద మార్పు కనపడుతుంది.

ఒక హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుంబాలకు బయటి పంటల సాగు ప్రధాన వనరుగా మారింది. వ్యవసాయ కుటుంబాలకు పంట ఉత్పత్తి స్థానంలో వేతనాలు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ఆదాయ నష్టం, విద్య, వైద్య ఖర్చు ల భారంతో రైతులు అప్పులపాలై తమ భూములను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. ఈ భూమిని రియల్ ఎస్టేట్ లాబీలు లేదా పెద్ద సంస్థలు లేదా ధనిక భూస్వాములు స్వాధీనం చేసుకుంటున్నారు. రైతుల, కౌలుదారుల సంఖ్య పెరగడం, సాగుకు అధిక ఖర్చులు కావడం, పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవటంతో రైతులు భూములు కోల్పోవడానికి, రైతుల పేదలుగా మారటానికి ప్రధాన కారణాలు. భారత దేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 127.3 మిలియన్లు (1273 లక్షలు) భూమిని కలిగి ఉన్న రైతులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో భూమిని కలిగి ఉన్న రైతుల సంఖ్య 8.6 మిలియన్లు (86 లక్షలు)తగ్గింది. ఇది ఒక రోజులో 2300 మంది రైతులు లేదా ప్రతి గంటకు దాదాపు వంద మంది రైతులు సంఖ్య తగ్గుతుంది. భూమిలే, చిన్న రైతులు కౌలు రైతులుగా మారారు.

తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో దాదాపు 40% వరకు ఇదే పరిస్థితులలో ఉన్నారు. కౌలు రైతులకు పిఎం సమ్మాన్, రైతు బంధు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంట నష్టపరిహారం, ఇతర రకాల ఉపశమనాల వంటి ప్రయోజనాలను తిరస్కరించారు. వ్యవసాయానికి అదనంగా సాగు ఖర్చులు భరించవలసి ఉంటుంది. అయినప్పటికీ వారు పంటల సాగు నుండి వచ్చే ఆదాయంలో దాదాపు సగం భూమి యజమానులకు చెల్లించవలసి ఉంటుంది. వారి గృహాలకు చాలా తక్కువ మాత్రమే మిగిలి ఉంది. రైతు ఆత్మహత్య అనేది రైతు వ్యతిరేక నయా ఉదారవాద సంస్కరణల ఉత్పత్తి. గత రెండు దశాబ్దాలలో దాదాపు 3.5 లక్షల మంది రైతులు (రోజుకు 332 మంది చొప్పున) తమ ప్రాణాలు ఫణంగా పెట్టారు. మహిళా రైతులు దాదాపు 60% వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తారు.అయితే వారిలో 12% మహిళా రైతులు మాత్రమే భూమిని కలిగిఉన్నారు. వారి శ్రమ ఎక్కువగా లెక్కించబడదు. అలాగే మహిళలు పురుషులతో పోలిస్తే 30% తక్కువ వేతనం పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర (కమ్యూనిస్ట్ నేతృత్వంలోని ప్రభుత్వాలు), జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో భూమి పంపిణీ జరిగింది.

దేశ వ్యాప్తంగా వామపక్షాలు చేసిన భూ ఆక్రమణ పోరాటాల తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, త్రిపుర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు (పాక్షికంగా) భూ సంస్కరణలను అమలు చేశాయి. జమీందారీ, భూస్వామ్య భూయాజమాన్యాన్ని రద్దు చేసి పాక్షికంగా అమలు చేసిన భూసంస్కరణల కింద ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా భారతదేశం అంతటా 68.72 లక్షల ఎకరాల భూమి సీలింగ్ మిగులుగా ప్రకటించబడింది. ఇందులో 60.27 లక్షల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోగా, 2006 వరకు 48.99 లక్షల ఎకరాలను పంపిణీ చేశారు. 2006లో భారత దేశంలోని మొత్తం నిర్వహణ ప్రాంతం 39.10 కోట్ల ఎకరాలుగా ఉంది. అంటే 1.25 శాతం నిర్వహణ ప్రాంతం భూసంస్కరణల కింద భూసీలింగ్ మిగులు చర్యల ద్వారా మాత్రమే పంపిణీ చేయబడింది. భూమిలేనివారు, చిన్న రైతుల మధ్య పంపిణీకి మిగులు భూమి లభ్యతను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజమైన స్ఫూర్తితో భూసంస్కరణలు అమలు చేస్తే తప్ప గ్రామాల్లోని నిరుద్యోగం, పేదరికాన్ని రూపుమాపడం సాధ్యం కాదు. రైతాంగానికి భూమి ప్రాధాన్యతనివ్వాలి. భూమిలేని చిన్నకారు, కౌలు రైతులకు అనుకూలంగా భూమి పంపిణీ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలి.

కోలాహలం రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News