Sunday, December 22, 2024

డిసెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లలో పది శాతం పెరుగుదల

- Advertisement -
- Advertisement -

చిట్టా విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వశాఖ

న్యూఢిల్లీ : దేశంలో సరుకులు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు డిసెంబర్‌లో పదిశాతం పెరిగాయి. వీటి విలువ రూ 1.64 లక్షల కోట్లు వరకూ ఉంటుంది. ఏడాది క్రితం సరిగ్గా ఇదే నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ 1.49 కోట్లు వరకూ పలికాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ నూతన సంవత్సర ఆగమన వేళ ఈ విషయాన్ని తెలిపింది. ఇక జిఎస్‌టి వసూళ్ల క్రమాన్ని ఈ ప్రకటనలో వివరించారు. గడిచిన 2023 సంవత్సరంలో ఎప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ జిఎస్‌టి నికర వసూళ్లు పటిష్టరీతిలో 12 శాతం పెరిగాయి.

మొత్తం మీద ఇవి రూ 14.97 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకాయి. అంతకు ముందటి సంవత్సరం 2022 లో ఇదే వ్యవధిలో వసూళ్ల మొత్తం రూ 13.40 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. ఇక సగటు మాసిక స్థూల జిఎస్‌టి వసూళ్లు తొలి తొమ్మిది నెలల కాలంలో రూ 1.66 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ దశలో ఈ వసూళ్లు రూ 1.49 కోట్లుగా నిలిచాయి. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ఇక గడిచిన డిసెంబర్ నెలలో జిఎస్‌టి వసూళ్లు స్థూలంగా రూ 1,64,882 కోట్లు.

ఇందులో కేంద్రం వాటా రూ 30,443 కోట్లు. కాగా రాష్ట్రాల వాటా ఎస్‌జిఎస్‌టి రూ 37,935 కోట్లు. అంతర్జాతీయ స్థాయిలో సాగే ఎగుమతుల ద్వారా సేకరించిన జిఎస్‌టి సంబంధిత ఐజిఎస్‌టి ద్వారా దక్కిన వాటా రూ 84,225 కోట్లు. ఇందులో రూ 41,534 కోట్లు వరకూ సరుకుల ద్వారా అందినవి. ఇక సెస్సు రూపంలో సేకరణ అయింది రూ 12,249 కోట్లు. దీని అనుబంధ పద్దును చూస్తే సరుకులపై సుంకాల కింద రూ 1,079 కోట్లు వసూలు అయ్యాయి. ఇక అత్యంత కీలక విషయంగా ఏడవ నెలలో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ 1.60 లక్షల కోట్లు దాటాయి. 2023 అంతా జిఎస్‌టి వసూళ్ల పరంగా సంతృప్తిని మించి సంతోషాన్ని కల్గించిందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News