పాట్నా : చదువుకోవడానికి వెళ్లుతున్న బీహార్ చిన్నారి విద్యార్థులు జలసమాధి చెందారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గురువారం భాగ్‌మతి నదిలో స్కూలు విద్యార్థులతో వెళ్లుతున్న పడవ బోల్తా పడిన ఘటనలో పది మంది వరకూ గల్లంతు అయ్యారు.పిల్లలను స్కూళ్లకు పంపించిన పడవ మునిగిందనే సమాచారంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమాదం సమయంలో పడవలో 32 మంది వరకూ ఉన్నారు. నది ప్రవాహ గతిలో ఉన్న మధ్పూర్ పట్టి ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. పిల్లలను స్కూళ్లకు తీసుకుని పడవ వెళ్లుతుండగా అదుపు తప్పిందని అధికారులు తెలిపారు. సమాచారం అందగానే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్ )స్పందించింది. అక్కడికి చేరుకుంది. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిందని వార్తా సంస్థలు తెలిపారు. సహాయక బృందంలో గజ ఈతగాళ్లు కూడా ఉన్నారు.
నదిలోకి దూకి బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగగానే దాదాపు 20 మందిని రక్షించినట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోలు రూం వర్గాలు తెలిపాయి. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ బీహార్ విభాగం ఉప సంచాలకులు రంధీర్ సింగ్ తెలిపారు. గల్లంతయిన పది మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని, మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. దీనితో స్థానికులు తమ వారి కోసం గట్టున నిలబడి ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ స్పందించారు. జిల్లా కలెక్టరు సహా ఉన్నతాధికారులు అంతా ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశాలు వెలువరించారు. చిన్నారులు కుటుంబాలకు తగు విధంగా ధైర్యం కల్పించాలని సూచించారు.