ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లోనూ : కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) సోమవారం వరకల్లా పది రాష్ట్రాల్లో నిర్ధారణ అయిందని కేంద్ర పశుసంవర్థకశాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్,హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్ధారణ అయింది. సోమవారం ఈ జాబితాలో కొత్తగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ చేరాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. నీటి కొలనులు, పక్షుల మార్కెట్లు, జంతుశాలలు, కోళ్ల ఫారాలపై నిఘా కొనసాగించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కోళ్ల ఫారాల నుంచి తొలగించిన వ్యర్థాల ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులను సంహరించే కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బందికి పిపిఇ కిట్లు అందించాలని సూచించింది. రాష్ట్రాల్లోని పశుసంవర్థకశాఖలు, ఆరోగ్యశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది.
రాజస్థాన్‌లోని టాంక్, కారౌలీ, భిల్వారా జిల్లాలు, గుజరాత్‌లోని వల్సాడ్, వడోదరా, సూరత్ జిల్లాల్లో బర్డ్‌ఫ్లూతో కాకులు, వలస పక్షులు మృతి చెందినట్టు నిర్ధారించామని కేంద్రం తన ప్రకటనలో పేర్కొన్నది. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వారా, డెహ్రాడూన్ జిల్లాల్లో కాకులు, ఢిల్లీలో కాకులు, బాతులు బర్డ్‌ఫ్లూతో మరణించాయని తెలిపింది. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలోని కోళ్ల ఫారంలో కోళ్లు, ముంబయి, థానే, దపోలీ, బీడ్ జిల్లాల్లో కాకులు బర్డ్‌ఫ్లూతో మరణించాయని తెలిపింది. కేంద్ర బృందం సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని పంచకులలో బర్డ్‌ఫ్లూ ప్రాంతాన్ని సందర్శించి దర్యాప్తు జరుపుతుందని కేంద్రం తెలిపింది.