Monday, January 20, 2025

వచ్చే నెలలో సింగరేణి రెండవ దశ 240 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు టెండర్లు

- Advertisement -
- Advertisement -
8 ఏరియాల్లో ప్లాంట్ల నిర్మాణం అక్టోబర్ నుంచి పనులు ప్రారంభించాలి
సింగరేణి విద్యుత్ సమీక్ష సమావేశంలో సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశం

హైదరాబాద్: సోలార్ విద్యుత్తు ఉత్పాదన రంగంలో విజయవంతంగా ముందుకు పోతున్న సింగరేణి సంస్థ రెండవ దశలో 240 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది ఏరియాల్లో ప్లాంట్లు నెలకొల్పడానికి రంగం సిద్ధం చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా 8 ఏరియాల్లో చేపట్టనున్న సోలార్ ప్లాంట్లకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అక్టోబర్ నెల నుండి నిర్మాణాలు ప్రారంభించాలని సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్. శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో నిర్వహించిన విద్యుత్ సమీక్ష సమావేశంలో రెండవ దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశ 300 మెగావాట్ల ప్లాంట్లలో మిగిలిన 76 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని రెండవ దశలో చేపట్టనున్న 240 మెగావాట్ల ప్లాంట్లను వచ్చే ఏడాది అక్టోబర్‌లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. తద్వారా మొత్తం 540 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదనతో కంపెనీని నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా నిలపడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

8 ఏరియాల్లో కొత్త ప్లాంట్లు:
రెండో దశలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడం కోసం సంస్థ డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు ఏరియాల వారిగా పర్యటించి ఏరియా జనరల్ మేనేజర్లతో కలిసి స్థలాలను ఎంపిక చేశారు. మందమర్రిలో 67.5 మెగావాట్ల ప్లాంట్, రామగుండం-3 ఏరియాలో 41 మెగావాట్ల ప్లాంట్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 37.5 మెగావాట్లు, సత్తుపల్లిలో తొలిసారిగా 32.5 మెగావాట్ల ప్లాంట్, శ్రీరాంపూర్ ఏరియాలో తొలిసారిగా 27.5 మెగావాట్ల ప్లాంట్, ఇల్లందులో 15 మెగావాట్ల ప్లాంట్, భూపాలపల్లి ఏరియాలో 10 మెగావాట్ల ప్లాంట్, రామగుండం-లో 01 ఏరియాలో తొలిసారిగా 05 మెగావాట్ల ప్లాంట్ ను నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ ప్లాంట్ల నిర్మాణం కోసం ఇప్పటికే విధివిధానాలను రూపొందిస్తుండగా తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా టెండర్లను పిలిచి నిర్మాణ ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. సమావేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనితీరును కూడా సమీక్షించారు. ఇటీవలనే క్యాపిటల్ ఓవర్ హాలింగ్ జరుపుకున్న ఈ కేంద్రం తిరిగి అత్యుత్తమ స్థాయిలో విద్యుత్ ఉత్పాదన చేస్తూ మంచి పిఎల్‌ఎఫ్ సాధించడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ ఆవరణలో పర్యావరణహిత నిర్మాణం ఎఫ్‌జిడి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు , చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్ కుమార్ సుర్, థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ బసివి రెడ్డి, చీఫ్ ఓ అండ్ ఎం జె.ఎన్. సింగ్, జీఎం సోలార్ జానకిరామ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, జీఎం సివిల్ సూర్యనారాయణ, ఏజీఎం సివిల్ కేఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News