Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో కమిటీ చిచ్చు

- Advertisement -
- Advertisement -
గాంధీభవన్ ఎదుట పొన్నం ప్రభాకర్ వర్గీయుల ఆందోళన
సీనియర్ల కుట్రవల్లే ఎన్నికల కమిటీలో చోటు దక్కలేదని ఆగ్రహం
సముచిత స్థానం కల్పించకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల కమిటీలో పొన్నంకు చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలకంగా పని చేశారని అలాంటి వ్యక్తిని అవమానించారని వారు నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు కుట్రలు చేయడం వల్లే ఎన్నికల కమిటీలో పొన్నంకు స్థానం దక్కలేదని వారు ఆరోపించారు. పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుట వారు నినాదాలు వ్యక్తం చేశారు. అయితే పిసిసి సమావేశం ఉండటం వల్ల ఆందోళన విరమించాలని పొన్నం వర్గీయులను రేవంత్‌రెడ్డి కోరగా, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకుండా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను అవమానించారంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
పొన్నంకు సంఘీభావం తెలిపిన ఉమ్మడి కరీంనగర్ నేతలు
26మంది ఎన్నికల కమిటీలో తనకు స్థానం దక్కని తీరుపై పొన్నం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మూడు రోజులుగా పొన్నం నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఈ విషయంలో ఆయనకు తమ సంఘీభావం తెలుపుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎన్నికల కమిటీలో అవకాశం కల్పించి, ఎన్‌ఎస్‌ఐయూ నుంచి కాంగ్రెస్ పటిష్టత కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్న పొన్నంను మాత్రం పక్కన పెట్టడం పట్ల వారంతా అసంతృప్తిని వ్యక్త్తం చేశారు. హైకమాండ్ చర్య పొన్నంను అవమానించేదిగా ఉందని వారు వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి కాంగ్రెస్ ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలకు చోటు
ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలకు చోటు దక్కిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు అంశం ఎన్నికలు ఈ కమిటీ చేతిలోనే ఉంటుంది. దీంతో అభ్యర్థుల ఎంపికలో తమ నేతకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్న ఆందోళన పొన్నం వర్గంలో వ్యక్తమవుతోంది. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల విద్యార్థి సంఘం నేతగా, యువజన కాంగ్రెస్ నేతగా, కాంగ్రెస్ నేతగా ఆయన చేసిన సేవలకు పార్టీ అధిష్టానం గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయమని పొన్నం అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత కల్పించాల్సింది పోయి, కీలక కమిటీ కూర్పులో ఆయన్ను విస్మరించడం సరికాదని పొన్నం వర్గం ఆరోపిస్తోంది. పిసిసి ఎన్నికల కమిటీలో పొన్నంకు సముచిత ప్రాధాన్యత దక్కకపోతే తాము పార్టీకి రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే పిసిసి ఎన్నికల ప్రణాళికల కమిటీలో పొన్నంకు చోటు కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్న అది వచ్చేంత వరకు తాము నమ్మమని పొన్నం అనుచరులు పేర్కొనడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News